- సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న సౌదీ అరేబియాలోని భారత రాయబారి
- స్థానిక అధికారులతో పరస్పర ఒప్పందాలు
- భారత్-సౌదీ సహకారంపై చర్చ
- రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయం సందర్శన
సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహైల్ అజాజ్ ఖాన్ ‘సౌదీ నో కోడ్ ఇన్నోవేషన్’ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన భారతదేశంలో సాంకేతిక ఆవిష్కరణలు, టెక్ రంగంలో భారత్-సౌదీ సహకారంపై మాట్లాడారు. రాయబారి టెక్ ఫోర్జ్ నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో పాల్గొనే భారతీయ సాంకేతిక సంస్థల నిర్వాహకులను కలిశారు. సాంకేతిక రంగంలో భారతదేశం, గల్ఫ్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి, మెరుగైన సినర్జీని సృష్టించడానికి ఆలోచనలను పంచుకున్నారు. సమ్మిట్‌కు హాజరయ్యే ముందు, ఖాన్ సౌదీ అరేబియాలోని నజ్రాన్ ప్రాంతాన్ని సందర్శించాడు. అక్కడ అతను స్థానిక పరిపాలనా అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సహకారంతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. ఇక్కడ వారు భారతదేశం, నజ్రాన్ మధ్య బలమైన చారిత్రక సంబంధాలు, ఈ ప్రాంత అభివృద్ధికి భారతీయ సమాజం యొక్క సహకారం, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై చర్చించారు. నజ్రాన్ రీజియన్ గవర్నర్ ప్రిన్స్ జలావి బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముసైద్ ఆదివారం భారత రాయబారిని తన కార్యాలయంలో ఘనంగా స్వాగతించారు. స్వాగత కార్యక్రమంలో ఇరువురి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగింది. అలాగే సావనీర్‌లను ఇచ్చిపుచ్చుకున్నారు. ముఖ్యంగా గ్రానైట్, రాగి, జింక్, బంగారం వంటి ఖనిజాలతో సహా మైనింగ్ రంగంలో భారత్‌తో వాణిజ్య అవకాశాల గురించి చర్చించినట్లు రియాద్‌లోని భారత హైకమిషన్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపింది. భారత హైకమిషన్ ప్రకారం, రాయబారి నజ్రాన్ విశ్వవిద్యాలయాన్ని కూడా సందర్శించారు. యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ వైస్ డీన్ డాక్టర్ బందర్ అల్-షెహ్రీనితో సమావేశం అయ్యారు. యూనివర్శిటీ కళాశాలల్లో భారతీయ విద్యార్థులకు విద్యావకాశాలపై రాయబారి చర్చించారు. ఖాన్ ఇక్కడ భారతీయ విద్యార్థులతో కూడా సంభాషించారు. నజ్రాన్ పర్యటన సందర్భంగా రాయబారి భారతీయ సమాజ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారి అనుభవాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.