- అమీన్ పూర్ లో సర్వే నెం. 455/2, 455/3లో అసైన్డ్ ల్యాండ్
- 1997లో శీలం లింగయ్య, శీలం శంకరయ్యకు చెరో 30 గుంటల చొప్పున సర్కారు పంపిణీ
- పేదలకు అసైన్డ్ చేసిన అప్పటి ప్రభుత్వం
- అట్టి భూమిని వేరే వ్యక్తులకు అమ్మిన వైనం
- 1977 చట్టం ప్రకారం వాపస్ తీసుకున్న అప్పటి గవర్నమెంట్
- అడ్డదారిలో ధరణిలోకి ఎక్కించి ఇతరులకు అమ్మిన కుటుంబీకులు
- కమర్షియల్ గా మార్చి ప్లాట్స్ చేసి అమ్మకాలు
- తిరిగి గవర్నమెంట్ స్వాధీనపర్చుకోవాలని డిమాండ్
తెలంగాణలో భూముల ధరలు అమాంతం పెరిగిపోవడం మూలంగా జనం వాటిని తిని అరగాయించుకుంటున్నారు. ‘ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు’ అన్నట్టుగా గజం జాగ అయినా సరే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తారు కొందరు. బతుకు జీవుడా అని దిగాలు చెందుతుంటే వాళ్లకు ఆసరుంటే బాగుటుంది కదా అని జాలిపడ్డది అప్పటి ప్రభుత్వం. ఎప్పుడూ ఎవడికో ఒకడికి కూలిపోతే ఏముంటది పాపం గుంట భూమైనా ఇస్తే చేసుకొని బతుకుతడుని పుణ్యాత్ములు ఆలోచించి సాగుచేసుకునేందుకు పేదోళ్లకు ప్రభుత్వం భూములిచ్చేలా చేసింది.
నాటి కాలంలో దుర్భర జీవితంలో ఉన్న వారూ కుటుంబాన్ని సాకేందుకు ఇదీ కొంతమేర సాయపడుతుందని మంచి ఆలోచన చేసింది సర్కారు. నాడు పేద ప్రజలు సాగు చేసుకునేందుకు గత ప్రభుత్వం పేదలకు భూములు పంపిణీ చేసింది. దళిత, బహుజన బిడ్డలకు ప్రభుత్వ భూములను ఇచ్చి సాగుచేసుకోమని, అమ్మకం చేయరాదని షరతుల (1977 నిబంధన) ప్రకారం కేటాయించింది. వ్యవసాయం చేసుకున్నంత కాలం మీదే భూమి అన్నట్టుగా రాసి ఇచ్చింది. కొందరూ దాన్ని దుర్వినియోగం చేసుకొని చేతులు కాల్చుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం (అప్పటి పఠాన్‌చెరు మండలం) లోని సర్వే నెంబర్ 455/2, 455/3 లో భూమి లేని నిరుపేదలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిరుపేదలైన శీలం శంకరయ్య, శీలం లింగయ్యకు సాగు చేసుకోవడానికి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెరో 30 గుంటల చొప్పున కేటాయించడం జరిగింది. ‘అడుక్కునే వాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు’ ఆ భూమిపై కన్నుపడ్డ కొందరూ వచ్చి అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారు. అయితే శీలం శంకరయ్య, శీలం లింగయ్య ఇద్దరు కలిసి 1997లో అట్టి భూమిని వారి కుమారులు వెంకటేష్, లక్ష్మణ్, యాదగిరి, కృష్ణ, నాగరాజు మరియు శీలం లింగయ్య కొడుకులు శీలం బిక్షపతి, వారి కూతుర్లతో కలిసి ఎం.కె రాజు తండ్రి నారాయణ రాజుకు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. ‘ఉన్నది పాయె.. ఉంచుకొన్నది పాయె’ అన్న చందంగా సర్కారు ఇచ్చిన భూమిని వద్దనుకొని డబ్బుపై ఉన్న ఆశతో ఇతరులకు అమ్మడంతో ఆ భూమి కాస్త లేకుండా పోయింది. వారిద్దరూ భూమిని అమ్మకం చేశారనే విషయంపై తహసిల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు రావడంతో సమగ్ర విచారణ జరిపిన అప్పటి ఎమ్మార్వో వాస్తవాలను తెలుసుకొని, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల నిషేధిత చట్టం 1977 నిబంధనలు ఉల్లంఘించినందుకు అట్టి భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం పర్చుకుంది. దీంతో శీలం శంకరయ్య, శీలం లింగయ్యలు ఆ భూమిపై ఉన్న హక్కులు కోల్పోయారు.
అక్రమంగా ధరణిలో రిజిస్టర్ :
‘మంది మాటలు విని ఎక్కడికో పోతే.. ఇంటికొచ్చేసరికి ఇల్లు ఆగం అయినట్టు’ ప్రభుత్వం ఇచ్చిన 30గుంటల భూమి కాస్త పోయినంక వాళ్ల కొడుకులు, కూతుర్లు అతి తెలివి ఉపయోగించారు. శీలం శంకరయ్య, శీలం లింగయ్య మరణానంతరం 2018లో శీలం కృష్ణ భార్య శీలం రాణి, లింగయ్య కొడుకు శీలం బిక్షపతి మరియు కూతుర్లు కలిసి కొత్త గేమ్ ప్లాన్ చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగి రిజిస్టర్ చేయించారు. ‘కడివెడు గుమ్మడికాయైనా కత్తిపీటకి లోకువే’ అన్న చందంగా అప్పటి తహసిల్దార్ కు మాముళ్లు ఇచ్చుకొని ఆయన సహకారంతో తమ పేరుమీద ధరణిలో నమోదు చేసుకోవడం జరిగింది. అదే విధంగా తమ పేరు మీద పాస్‌బుక్ లు సైతం పొందారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల అండతో 2019 తర్వాత పోడు భూమిని చదును చేసి, ఎమ్మార్వో సహాయ సహాకారాలతో నాలా కన్వర్షన్ లేకుండా, ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండానే అగ్రికల్చర్ ల్యాండ్ ని లే అవుట్ చేసి ప్లాట్స్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. అక్రమార్కులు అంతటితో ఆగకుండా స్థల ప్రాంగంణంలో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులను లెక్క చేయని ఎమ్మార్వో :
మరోవైపు శీలం రాణి నిబంధనలకు విరుద్దంగా స్వాధీనపరుచుకున్న ప్రభుత్వ భూమిని సయ్యద్ సిరాజుద్దీన్‌కు అమ్మకం చేశారు. ఇక ఆ భూమిని కొనుగోలు చేసిన సిరాజుద్దీన్ తిరిగి కొల్లాటి సురేష్ అనే వ్యక్తికి అమ్మారు. అలాగే శీలం భిక్షపతి వారి సోదరీమణులు కలిసి శేఖర్ గౌడ్‌కు అమ్మడం జరిగింది. అయితే శేఖర్ గౌడ్‌ను బినామీగా పెట్టి ఓ రాజకీయ నాయకుడితో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహరాలపై కలెక్టర్, ఆర్డీఓ దర్యాప్తు చేసి వాస్తవాలతో కూడిన పూర్తి నివేదిక పంపించాలని ఎమ్మార్వో కు ఆదేశాలు జారీ చేశారు. ‘ఆవులు పోట్లాడుకొని లేగల కాళ్ళు విరగదొక్కినట్లు’ స్థానిక తహాశీల్ధార్ డబ్బుకు ఆశపడి ఉన్నతాధికారుల నిబంధనలు లెక్కచేయపోవడం గమనార్హం. పై ఆఫీసర్ల ఆదేశాలను భేఖాతరు చేస్తూ చోద్యం చూడడమే కాకుండా సదరు భూమికి సంబంధించి తప్పుడు నివేదికతో ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించాడు. ‘అబద్ధము ఆడితే అతికినట్లుండాలి’ ఒకప్పుడు ప్రభుత్వం ఆ భూమిని స్వాదీనం చేసుకున్నందున ఆ భూమిలో గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు ఏర్పాటు చేయాలని పై అధికారులు ఆదేశించినా పొలిటికల్ అండతో తహసిల్దార్ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు.
నాటి ప్రభుత్వం పేదలకు సాగుచేసుకునేందుకు భూమి ఇవ్వగా దానిని వాళ్లు అమ్ముకోవడంతో అట్టి భూమిని సర్కారు తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్రమ మార్గంలో సదరు భూమిపై హక్కులున్నాయని శీలం లింగయ్య, శీలం శంకరయ్య కొడుకులు, కూతుర్లు తమ పేరుమీద ధరణిలో ఎక్కించుకొని మళ్లీ ఇతరులకు అమ్మినంతన మాత్రాన తమది అవుతుందా.. 1977 చట్టం ప్రకారం సదరు భూమిని స్వాధీనం చేసుకున్న అనంతరం, ధరణిలో నమోదు చేయించుకొని దొంగతనంగా పాస్ బుక్ పొంది, మళ్లీ ఇతర వ్యక్తులకు అమ్మజూపేందుకు వీలు లేదు. ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిని బహిరంగ మార్కెట్‌లో క్రయ, విక్రయాలు జరగడం, కబ్జాదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిన తహసిల్దార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారించడం, అక్రమార్కులకు సహకరించడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి ప్రభుత్వ భూమిని రక్షించి, ఆ భూమి ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అలాగే అక్రమార్కులకు సహకరించి, విధుల్లో అలసత్వం వహించిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.