- కుల్బాగుర్ గ్రామ శివారులో 350 గజాల లింక్ డాక్యుమెంట్ తో 1000 గజాలుగా రిజిస్ట్రేషన్ చేసిన అవినీతి అధికారి..
- నకిలీ పత్రాలు సృష్టించి భూములను కొట్టేస్తున్న అక్రమార్కులు..
- సర్వే నెంబర్ 221, 222లో భూ కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారులు..
- అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన, చేసుకున్న వ్యక్తులపై, సాక్షులపై సాక్యులపై చర్యలకు అమలు కానీ ఐజి సర్క్యులర్..
- నేటికీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయని సబ్ రిజిస్ట్రార్..
- రిజిస్ట్రేషన్ చట్టం 1908 నిబందనలకు తూట్లు పొడిచిన వైనం..
- రిజిస్ట్రార్ ఆఫ్ ఐజి దృష్టి సారించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న సామాజిక
వేత్తలు..
ఎక్కడ చట్టాలు..? ఎక్కడ నిబంధనలు..? ఎప్పుడో చట్టుబండలై పోయాయి.. ఈ చట్టాలను ఖాతరు చేయని అధికారులు తమ ఇష్టం వచ్చినట్టుగా సొంత నిబంధనలు అమలు చేస్తూ కాసుల పంట పండిస్తున్నారు.. బరితెగిస్తున్నారు.. నకిలీ పత్రాల సృష్టి.. దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు.. ఒక్కటేమిటి.. చెప్పుకుంటూ పోతే గ్రంధాలు తయారవుతాయి.. తాజాగా సంగారెడ్డి జిల్లా, మండలం, కులాబుర్గు గ్రామ శివారులో వెలుగుచూసిన ఒక ఉదంతం మరో తాజా ఉదాహరణ.. వివరాలు చూద్దాం..
సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలం, కులాబుర్గు గ్రామ శివారులో సర్వేనెంబర్ 221, 222 లలో ఏ. సీతారామరాజు అనే వ్యక్తికి సంబంధించిన భూమి లేకున్నా.. ఉన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి, భూ కబ్జాలకు పాల్పడే ముఠా, అక్రమంగా దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.. కాసులు వెదజల్లుకో.. కావాల్సినంత భూమి రిజిస్ట్రేషన్ చేసుకో.. అన్న చందాన సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ వ్యవహరించడం, సదరు అధికారుల అవినీతికి అద్దం పడుతోంది.. రామేశ్వరం బండ గ్రామం, సంగారెడ్డి తాలూకా, మెదక్ జిల్లాగా ఉన్న సమయంలో డాక్యుమెంట్ నెంబర్ 7619 ఆఫ్ 1985 డాక్యుమెంట్ కు సంబంధించి సర్వే నెంబర్ 183, 184, 221లలో ప్లాట్ నెంబర్ 117కు సంబంధించి.. 350 గజాల విస్తీర్ణం గల స్థలం ఏ. సీతారామరాజు అనే వ్యక్తి పేరుపై ఉన్నట్లుగా సదరు డాక్యుమెంట్ లో ఉంది.. బోగస్ పత్రాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్ లు సృష్టించి, భూకబ్జాలకు పాల్పడే ముఠా సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తో లోపాయికారీ ఒప్పందం చేసుకొని.. సంగారెడ్డి జిల్లా, మండలంలోని కులాబుర్గు గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 221, 222లో భూమి ఉన్నట్లుగా.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. రామేశ్వరం బండ గ్రామంలోని ప్లాట్ నెంబర్ 117, విస్తీర్ణం 350 గజాల లింక్ డాక్యుమెంట్ నెంబర్ 17899 / 2023తో కలిగిన డాక్యుమెంట్ ఆధారంగా, కులాబుర్గు లోని సర్వే నెంబర్ 221, 222లో గల ప్లాట్ నెంబర్ 67, 50లకు సంబంధించి, 1000 గజాల స్థలాన్ని బృందావన్ హిల్స్, నిజాంపేట్ లో శ్రీ రమ్య రెసిడెన్సీలో నివాసం ఉంటున్న కమ్మరి కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం ఎలా సాధ్యమైంది..? అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు.. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసుకుంటే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లు అనేక్జర్ 1 నుండి 8 వరకు ఉన్న ఫార్మాట్ లో చూపిన నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని ఉన్నా.. అవినీతి సొమ్ముకు ఆశ పడ్డ సబ్ రిజిస్ట్రార్ అవేమీ పట్టించుకోకుండా, అక్రమ రిజిస్ట్రేషన్ చేసి అందిన కాడికి దోచుకుని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరాడు.. కాగా సదరు సబ్ రిజిస్ట్రార్..రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని ఐజి సర్క్యులర్ ప్రకారం అమ్మిన వ్యక్తుల పైన, కొనుగోలు చేసిన వ్యక్తుల పైన, డాక్యుమెంట్ లో ఉన్న సాక్షుల పైన, డాక్యుమెంట్ రైటర్ పైన కేసులు నమోదు చేయాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు..
సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ల పై సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ల శాఖ డెరైక్టర్ అండ్ ఇన్స్ పెక్టర్ జనరల్ జారీ చేసిన సర్క్యులర్ నెంబర్ జీ 1 / 1843 / 2015.. తేది: 08 – 04 – 2015 సూచిస్తుంది.. కానీ యదేచ్చగా అక్రమ రిజిస్ట్రేషన్ల చేసి భూ కబ్జాలకు పాల్పడే ముఠాపై కేసులు నమోదు కాకపోవడం.. కమ్మరి కుమార్ ని నేటికీ అరెస్టు చేయక పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.. రిజిస్ట్రేషన్ చట్టం 1908 నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ ను నేటికీ సస్పెండ్ చేయకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు..? ఇప్పటికైనా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ దృష్టి సారించి.. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్టార్ పై తక్షణమే చర్యలు చేపట్టి.. రిజిస్ట్రేషన్లు చేసుకుని భూకబ్జాలకు పాల్పడి, బోగస్ పత్రాలు సృష్టించిన వ్యక్తులపైన చర్యలు చేపట్టి, అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..
సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి, కబ్జాలకు పాల్పడ్డ ముఠా చేసిన ఆగడాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..