- వేలకు వేలు వసూలు చేస్తున్న సిగ్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్
- పారా మెడికల్ డిగ్రీ కోర్స్ పేరిట నయా దందా
- రెగ్యూలర్ కోర్స్ లు కూడా ఉన్నాయంటూ మోసం
- విద్యార్థుల వద్ద డబ్బులు దండుకొని పైగా రుబాబు
- మోసపోయామని నిలదీస్తే సగం ఇస్తామంటూ మాయమాటలు
- మాకు న్యాయం చేయాలంటూ ఆదాబ్ ను సంప్రదించిన బాధితులు
- తెలంగాణ రాష్ట్రం యూనివర్సిటీ నుండి గుర్తింపు సంస్థ
- వీరు సర్టీఫికేట్లు ఆమోదించన తెలంగాణ పారా మెడికల్ బోర్డు
ఉన్నత చదువులు చదువుకోవాలన్న పేదోడి కలలను కొందరూ దుర్మార్గులు నిజం కానివ్వడం లేదు. అమ్మా నాన్న కాయకష్టం చేస్తూ… తన కొడుకు ఉన్నత స్థానానికి ఎదగాలి అన్న ఆశతో పై చదువుల కోసం ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చారు. వాళ్లే కూలి, నాలి చేసి బతుకుతున్నరు నేను అలా కాకుడదు అనుకొని సిటీలో.. ఏదో ఓ పని చేసుకుంటూ పై చదువులు చదవాలని గంపెడాశతో వచ్చేవారున్నారు. కానీ అలాంటి నిరుపేద యువతీ, యువకులను దోచుకునేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు మాయగాళ్లు. ‘కోడెల కొట్లాట మధ్య దూడలు నలిగి పోయినట్లు’ అమాయకులు బలి అవుతున్నారు. రంగు రంగుల పాంప్లేట్స్, వాల్ పోస్టర్లు, న్యూస్ పేపర్లు, టీవీలలో యాడ్స్ ద్వారా జనాన్ని మోసం చేసేందుకు మసిబూసి మారెడు కాయలు చేస్తారు. ఆ మాయమాటలను నమ్మి వేలకు వేలు అప్పనంగా సమర్పించుకొని చివరకు మోసపోయామనే తెలిసేసరికి జరగాల్సింది అంతా జరిగిపోతుంది.
వివరాల్లోకి వెళితే… పై చదువులు చదవాలనే నిర్ణయించుకొని ఆన్లైన్ లో (ఇంటర్నెట్ ద్వారా) సెర్చ్ చేయగా సిగ్మా ఇన్‌స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ అండ్ మెడికల్ సైన్స్ గురించి తెలిసింది. అందులో ఉన్న కాలేజీ ఫోన్ నెంబర్ ద్వారా ఓ యువకుడు సంప్రదించడం జరిగింది. అయితే తమ కళాశాలలో పారా మెడికల్‌కు సంబంధించిన బి.ఎస్‌సి, రెడియాలజీ మరియు మెడికల్ ఇమాజింగ్, కార్డియాక్ కేర్ టెక్నాలజీ, ఆప్టోమెర్టీ టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, అనెస్టీషియా టెక్నాలజీ మరియు బిపిటి ఫిజియోథెరఫీ డిగ్రీ కోర్సలు, రెగ్యులర్ కోర్స్ లు ఉన్నాయని మా వద్ద ఫ్యాకల్టీ, సౌకర్యాలు చాలా బాగుంటాయంటూ కళాశాల యాజమాన్యం వారు మాయమాటలు చెప్పారు. పారా మెడికల్ డిగ్రీ కోర్స్, రెగ్యూలర్ ఏ కోర్సు చేసిన ఫీజు ఒకేలా ఉంటుందని వివరించారు. అయితే మీరు ఇష్టమైన చదువు చదివిన కానీ డబ్బులు మాత్రం ఒకేలా కట్టాలి అని చెప్పారు. కాగా సదరు వ్యక్తి డిస్టెన్స్ లో చేరుతాను అని తనకు సంబంధించిన సర్టిఫికేట్స్ తోపాటు అడ్మిషన్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్ పేరుతో రూ.20వేలు తేదీ 08-02-2024 రోజున పే చేశాడు. రికార్డ్స్, ప్రాక్టికల్స్ ఇతరత్రా ఏమైనా ఉన్నాయా అని అడిగితె అలాంటివేమి ఉండవు.. అవన్నీ మేము చూసుకుంటాం అని చెప్పడం జరిగింది.
కొన్ని రోజుల తర్వాత మొదటి సెమిస్టర్ ఫీజు అడిగారు. తప్పని పరిస్థితిలో రూ.40వేలు తేదీ 20-02-24 రోజున కట్టారు. ప్రిపేర్ అయి పోతే ఫోన్ లో పరీక్షా ఉంటది మోసపూరిత మాటలు చెప్పి రూ. 2వేలు ఫీజు వసూలు చేశారు. అతనితో పాటుగా మరికొందరి విద్యార్థులు వద్ద కూడా ఇలానే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఇదంతా తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తమ అడ్మిషన్ క్యాన్సల్ చేయాలంటూ లెటర్ రాసిచ్చారు. తాము కట్టిన ఫీజు (డబ్బు) రూ.60వేలు తిరిగి ఇచ్చేయాలంటూ అడిగారు. తొలుత మీ డబ్బులు మీకు ఇస్తాం అని, 1 నెల తర్వాత వెళ్లి అడగగా సగం మాత్రమే చెల్లిస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. అదేంటని వారిని నిలదీయడంతో మీకు ఇష్టమైన చోట చెప్పుకోండి… ఏం చేసుకుంటారో చేసుకోండి అని రూఢీగా మాట్లాడారు. ‘సచ్చినోడికి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా’ చేసేదేం లేక 50 శాతం డబ్బులకు సరే అని ఒప్పుకున్నారు. రేపు, మాపు అంటూ నెల రోజులు తిప్పుకున్నారు. ఇదేమని కాలేజీ నిర్వాహకులను అడిగితే ఇస్తలేరని ఆదాబ్ తో వాపోయారు. మా తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ బతికే వాళ్లూ మా చదువు పూర్తికాక పోగా ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల నుంచి రావాల్సిన డబ్బులను ఇప్పించి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నారు.
ఈ అంశంపై ఇన్‌స్టిట్యూట్ మేనేజ్‌మెంట్ వారికి ఆదాబ్ హైదరాబాద్ ప్రతినిధి వివరణ కోరగా.. స్పష్టత ఇవ్వకుండా.. కార్యాలయానికి వస్తే.. మాట్లాడుతామని అని చెప్పడం జరిగింది..
అసలు ఈ సిగ్మా ఇన్‌స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ అండ్ మెడికల్ సైన్స్ కు ఎలాంటి గుర్తింపు లేకుండా, ఈ ఇన్‌స్టిట్యూట్ జారీ సర్టిఫికేట్లు పారా మెడికల్ బోర్డు గుర్తించకపోవడం, వీరు విద్యార్థుల నుండి అధిక మొత్తంలో వసూలు చేసిన డబ్బులు తదితర అంశాలపై మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..