Wednesday, December 18, 2024
spot_img

ద‌ర్జాగా గుడి భూమి కబ్జా..

Must Read
  • రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
  • శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థ‌లం స్వాహా
  • ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
  • బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
  • జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
  • త‌హ‌సీల్దార్ నిర్ల‌క్ష్యంతో జోరుగా నిర్మాణ ప‌నులు
  • ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమ‌తులా..?
  • ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు ఎలా సాధ్యం..?

రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ, అసైన్డ్, దేవాలయ భూములు మాయం అవుతున్నాయి. ఎక్కడ భూమి ఖాళీ కనపడితే గద్దల్లా అక్కడికొచ్చి వాలుతున్నారు. వెంటనే కర్చీఫ్ వేసి ఆ భూమిని కబ్జా చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో కోట్లల్లో భూములు విలువ పలుకుతుండగా అక్రమార్కులు తమ తెలివి ప్రయోగిస్తున్నారు. డబ్బు, రాజకీయ, అధికార బలంతో భూములను చెరబడుతున్నారు. గవర్నమెంట్ విలువైన భూములు కావొచ్చు, దేవాదాయ జాగలు అయినా, అసైన్డ్ భూములను సైతం వదలడం లేదు. కోట్లాది రూపాయలు పలుకుతుండడం, రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోవడంతో జాగలను కొట్టేస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల సపోర్టుతో అక్రమార్కులు భూములను ఆక్రమించుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద బిల్డింగ్ లను కడుతున్నారు. అధికారులకు భారీగా లంచం అందజేసి తమ పని కానిస్తున్నారు. ఇందులో ఎమ్మార్వో, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల హస్తం ఉన్నట్లు, వీరి అండదండలతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…

రాజేంద్ర నగర్ మండల పరిధిలోని అత్తాపూర్ డివిజన్, రాంబాగ్ లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం(Sri Anantha Padmanabha Swamy Temple)కు ఆనుకొని ఉన్న స‌ర్వే నెంబ‌ర్ 523లోని కొంత భూమిని కబ్జా చేశారు. దేవాలయ భూముల పక్కనే ఉన్న కొందరు కబ్జాకు యత్నించి.. నిర్మాణాలు చేపడుతున్నారు. కాగా విషయం తెలుసుకున్న స్థానికులు, ఎండోమెంట్ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకోవడం జరిగింది. కాగా ఈ విషయంపై అక్కడ ఆందోళన నెలకొంది. ఇప్పటికే అత్తాపూర్ సీతారామచంద్ర స్వామి దేవాలయంతోపాటు అనంత పద్మనాభ స్వామి దేవాలయం భూముల్లో అనేక అక్రమ నిర్మాణాలు వెలిసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై గతంలో లోకాయుక్త న్యాయవాదులు సర్వేలు జరిపి ఇవి దేవాలయ భూములుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మూటేషన్ చేయడం జరిగింది. అయినప్పటికి తాజాగా కొందరు కబ్జాదారులు దేవాలయాన్ని ఆనుకొని ఉన్న కాంపౌండ్ వాల్ ను కూల్చి వేశారు. ఆ స్థలం తమదే అంటూ గేటు ఏర్పాటు చేసి బోర్డులు పాతిపెట్టారు. ఈ ఇష్యూపై ఇదివరకే దేవాదాయ శాఖ వారు కాంపౌండ్ వాల్ కట్టి దాన్ని కాపాడడం జరిగింది. ఇటీవల జరిగిన ఘటనతో స్థానిక భక్తులతో పాటు ఎండోమెంట్ శాఖ అధికారులు విచ్చేసి ఆ స్థలం దేవాలయానిదేనని తెలిపారు.

అత్తాపూర్ డివిజన్ లోని రాంబాగ్ లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన సర్వే నంబర్. 523లో 8.25 ఎకరాల స్థలం ఉందని గతంలో రంగారెడ్డి జిల్లా దేవాదాయశాఖ అధికారి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది చాలా పురాతనమైన దేవాలయం కావడంతో కొందరు ఈ స్థలంపై కన్నేసి తమదే ఆ స్థలం అని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దేవాలయం పక్కనే ఉన్న భూమిలో ప్రహారీ ఏర్పాటు చేశామన్నారు. దీన్ని కొందరు కూలగొట్టి గేటు ఏర్పాటు చేస్తున్నారు. అంతకుముందు ఈ విషయం తెలుసుకొని రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ సిబ్బంది, ఏవోలు అధికారులు అక్కడికి వెళ్లి పనులు నిలిపి వేయించారు. పోలీసులకు పూర్తి నివేదికను అందించి దేవాలయ భూమిని కాపాడాలని పలువురు కోరారు. ఈ భూమిపై కోర్టులో కేసు ఉందన్నారు. కేసు పెండింగ్ లో ఉన్నప్పటికి ఇందులో ఎవరు నిర్మాణం చేయడానికి పర్మిషన్ లేదు. ఎండో మెంట్ శాఖ అధికారి స్థానిక అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ అక్ర‌మ నిర్మాణాల‌పై దేవాదాయ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయ‌డం కూడా జ‌రిగింది.

రాంబాగ్ లోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు కబ్జాచేసి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే వీరికి రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల నుంచి పూర్తి అండదండలు ఉన్నాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. గతంలో ఎమ్మార్వో ఇదీ ప్రభుత్వ భూమి అని సర్టిఫికేట్ ఇచ్చినప్పటికి దాంట్లో బిల్డింగ్ కడుతుంటే ఎలా చూస్తున్నారంటూ, అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదే విష‌యంపై ఆదాబ్ హైద‌రాబాద్ ప్ర‌తినిధి త‌హ‌సీల్దార్‌కు వివ‌ర‌ణ కోర‌గా స‌ర్వే నెంబ‌ర్ 523 ప్ర‌భుత్వ భూమి అని తెలిపారు. అలాంట‌ప్పుడు ప్ర‌భుత్వ భూమిలో అక్ర‌మ నిర్మాణం చేప‌డుతుంటే త‌హ‌సీల్దార్ చ‌ర్య‌లు తీసుకోకుండా మౌనంగా ఉండ‌టంపై స్థానిక ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వెంట‌నే అట్టి భూమిని ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకొని దేవాల‌య ఉప‌యోగాల‌కు వినియోగించాల‌ని కోరుతున్నారు..

Latest News

భయం గుప్పిట్లో జగన్నాథ దేవాలయం

కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్? ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు 30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం రాత్రికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS