- సాయివనం ప్రాజెక్ట్ లో ఫామ్ హౌజ్ పేరుతో టోకరా.!
- రూ. 28లక్షలకే 242 స్క్వేర్‌యార్డ్ అంటూ మోసం
- ప్రతి నెల రూ. 7 వేలు అద్దె చెల్లిస్తామంటూ గాలం
- భూములు కట్టబెట్టేందుకు మాయమాటలు
- రియల్ ఎస్టేట్ సంస్థ బాగోతం బట్టబయలు
- అమాయకులను బోల్తాకొట్టిస్తున్న ఎస్ఆర్ఆర్ సంస్థ
‘మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు’ అనే పద్యంలో కవి చెప్పినట్టు రియల్ భూమ్ తో ప్రజలు ఎంతో మోసపోతున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న కొందరు వ్యాపారులు ఎప్పుడూ.. జనాన్ని ఎట్లా మోసపుచ్చాలనే ఆలోచన చేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ అనేక మంది కోట్లు సంపాదించారు. పది జిల్లాలను కాస్త అమాంతం మూడు రెట్లు చేయడం, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు పెంచిన అప్పటి సీఎం కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రంలో భూములకు రెక్కలొచ్చాయి. దీన్నే ఆసరగా చేసుకున్న కొందరు రాజకీయ నాయకులు కోట్లు వెనకేసుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఎవరూ పడితే వారు భూములు అమ్మడం, కొనడం ద్వారా ల్యాండ్ వ్యాల్యూ బాగా పెరిగిపోయింది. ఇదే ఆసరగా చేసుకొన్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు వ్యవసాయ భూములను తక్కువ ధరలకు తీసుకోని.. కొత్త కొత్త వెంచర్లు చేసి ఫ్లాట్స్ చేయడం, ఫామ్ ల్యాండ్ లు సేల్ చేసుకుంటున్నాయి.
ఫామ్ హౌజ్ పేరుతో భారీ మోసం :
తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు భూములు అమ్మేటందుకు బూటకపు మాటలు చెబుతున్నాయి. ఫామ్ ల్యాండ్ కు కొన్నాళ్ల తర్వాత డబ్బులు చెల్లిస్తామని, ప్లాట్స్ కు ఐదేళ్లకు డబ్బులు డబుల్ చేసి ఇస్తామంటూ జనాన్ని మోసగిస్తాయి. అదే తరహాలో సాయివనం పేరుతో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ప్రైవెట్ లిమిటెడ్ సంస్థ భారీ మోసానికి తెర లేపింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మైలారం, ఘట్‌కేసర్ పరిధిలో సాయి వనం పేరుతో ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఫామ్‌హౌజ్ అని పేరుతో కొత్త దుక్నం తెరిచింది. అమాయకపు ప్రజలను అనేక మోసాలకు పాల్పడుతున్నది. కొంత డబ్బు పెట్టి మీరు కొనుగోలు చేస్తే మీకు ప్రతినెల డబ్బు ఇస్తామంటూ బుకాయిస్తుంది. రూ. 28లక్షలకే 242 స్క్వేర్‌యార్డ్ ఫామ్ హజ్ కొంటే, ప్రతి నెల రూ. 7 వేలు అద్దె చెల్లిస్తామని మాయమాటలు చెబుతూ మోసానికి తెరలేపింది.
అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు :
ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఫామ్‌హౌజ్ అని పేరుతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌కు హెచ్ఎండిఏ నుండి ఎలాంటి అనుమతులు లేకున్న నిర్మాణాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అంటూ ప్రజలను దోపిడికి గురి చేస్తున్నారు. ఫామ్‌హౌజ్‌లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టంతో ప్లాంటేషన్ ఉంటుందని, రంగురంగుల బ్రోచర్స్‌తో, 12 సంవత్సరాలు మెయింటెనన్స్ ప్రీ అంటూ భారీ మోసానికి తెరలేపారు. కానీ ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో సాయివనం క్షేత్రస్థాయిలో పరిశీలించగా వారి ప్రకటనలకు వాస్తవాలకు ఎలాంటి పొంతన లేదు. ఇదే విషయమై హెచ్ఎండీఏ అధికారులు, డీటీసీపీ అధికారులు, మండల తహసీల్దార్‌ను విచారించగా ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ ఫామ్‌హౌజ్ అనే వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ఈ వెంచర్ లో భూములు కొనుగోలు చేస్తే వినియోగదారులదే పూర్తి బాధ్యత అని అధికారులు స్పష్టం చేయడం కొసమెరుపు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న దందాలకు ప్రభుత్వ పెద్దలు, రెవెన్యూ అధికారులు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాళ్ల అండతోనే యధేచ్చగా వెంచర్లు చేసి భూములు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఎస్ఆర్ఆర్ డెవలపర్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.