- కేజీ చిన్నారిని చితకబాదిన టీచర్
- స్కూల్ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి
- రూ.60 నుంచి 70వేల డోనేషన్లు వసూల్
- లక్షల్లో ఫీజులు,జాయినింగ్‌లో బోలెడు కండిషన్లు
- పేరెంట్స్‌కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్.. లేకుంటే నో
- బుక్స్‌కు రూ.6 నుంచి 8వేల వరకు బిల్లు
- కేజీ నుంచి పదవ తరగతి వరకు భారీగా ఫీజులు
- విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యం
- విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి : తల్లిదండ్రులు
తెలంగాణలో విద్య చాలా కాస్లీ అయిపోయింది. చదువుకునుడు కాస్త చదువుకొనుడు అయింది. కేజీ నుంచి టెన్త్ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కార్పోరేట్ స్కూల్స్ నిలువునా దోచుకుంటున్నాయి. పేదోడి పిల్లోడు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవాలంటే చాలా కష్టతరం అయింది. ఎందుకంటే వేలల్లో డోనేషన్లు కట్టి తమ చిన్నారులను స్కూల్లో వేసే పరిస్థితి కనిపించడం లేదు. ‘చెప్పేవి శ్రీరంగనీతులు.. చేసేది…’ అన్నట్టు కార్పోరేట్ పాఠశాలలు 1, 2, 3 అంటూ ఫలితాల్లో అన్ని ర్యాంకులు తమవే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అలాంటిదే మలక్ పేట, ఆస్మన్‌ఘడ్‌లోని సెయింట్ జోసఫ్ స్కూల్ ఒకటి. ఈ మైనార్టీ స్కూల్‌లో వేలల్లో డోనేషన్లు, ఫీజులు పెట్టడంతోపాటు బుక్స్‌కు పది వేల వరకు డబ్బులు వసూలు చేయడం శోచనీయం. విద్యాహక్కు చట్టం ప్రకారం నడచుకోకుండా అధిక సంఖ్యలో విద్యార్థులను జాయిన్ చేసుకోవడం, ఫ్యాకల్టీకి సరైన జీతాలు ఇవ్వకపోవడంతోపాటు ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్ చేస్తుంది స్కూల్ యాజమాన్యం.
సెయింట్ జోసఫ్‌లో అరాచకాలు:
హైదరాబాద్‌లోని మలక్ పేటలో సెయింట్ జోసఫ్ స్కూల్ లో అరాచకాలు ఎక్కువైపోతున్నయి. రెండ్రోజుల క్రితం ప్లే స్కూల్ విద్యార్థినీ చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆ పాఠశాలలో జరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘జీలకర్రలో కర్రా లేదు, నేతిబీరలో నెయ్యీ లేదు’ అన్నట్టు క్వాలిఫైడ్ క్యాంటెట్స్ అని పెద్ద చదువులు చదివిన టీచర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వక పోవడం గమనార్హం. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నప్పటికి వారికీ జీతాలు తక్కువగా చెల్లిస్తున్నారు. డోనేషన్లు రూ.60 నుంచి 70 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఫీజుల విషయానికొస్తే కేజీ క్లాస్ కే సుమారు రూ.70వేల నుంచి లక్ష వరకు ఉన్నాయి. అదే టెన్త్ క్లాస్ విషయానికొస్తే అంతకుమించే ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్ పేరుతో రూ.6నుంచి 8వేల వరకు డబ్బులు గుంజుతున్నారు.
పేరెంట్స్‌కు కండీషన్లు:
ఆ స్కూల్‌లో పిల్లలకు సీటు కావాలంటే పేరెంట్స్ కు వెయ్యి కండీషన్లు పెట్టడం గమనార్హం. తల్లిదండ్రులు ఇద్దరూ డిగ్రీ చదివి ఉండాలి. ఇద్దరిలో ఒకరికైనా ఇంగ్లీష్ తప్పనిసరిగా రావాలి. అంతేకాకుండా అడ్మిషన్ కంటే ముందు పిల్లలకు ఎగ్జామ్ పెట్టి మరీ సెలెక్ట్ చేస్తున్నారు. ఇదీ పేరెంట్స్ కు తలనొప్పిగా మారుతుంది. తాను పడ్డ కష్టాలు తమ పిల్లలు పడొద్దని మంచి స్కూళ్లో పెద్ద చదువులు చదివించాలనే కోరికతో ఉంటే. ప్రైవేటు పాఠశాలలో ఎంతైనా ఖర్చు పెట్టి చదివించాలంటే చివరకు ఇలా కండిషన్లు పెడ్తుంటే అమ్మానాన్నలు మనోవేదనకు గురవుతున్నారు. ఫీజులు కట్టలేక కొందరు.. తాము ఉన్నత చదువులు చదువుకోలేదని మరికొందరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిబంధనల ప్రకారం క్లాసుకు ఇంతమంది పిల్లలు మాత్రమే ఉండాలని లిమిట్ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఎక్కువ సంఖ్యలో చిన్నారులను చేర్చుకొని విద్యను వ్యాపారం చేసుకుంటున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి ప్రవేశాల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అదేవిధంగా 10వ తరగతి వరకు 5శాతం పేదలకు ఫ్రీ సీట్లు ఇవ్వాలి. సెక్షన్-23 ప్రకారం ఉపాధ్యాయుల నియామకంలో అవసరమైన అర్హతలు, ఉద్యోగ షరతులు, నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అలాగే సెక్షన్-25 ప్రకారం షెడ్యూల్‌లో నిర్ధారించిన విధంగా విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సెయింట్ జోసఫ్ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అడ్మిషన్ సమయంలో రూ. 60 వేల నుండి రూ. 70 వేల వరకు డోనేషన్లు వసూలు చేస్తున్నారనేది పక్కా సమాచారం. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ పాఠశాల యాజమాన్యానికి 10రెట్లు పెనాల్టీ వేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు పెనాల్టీ వేయకపోవడంతో , సేవాదృపక్పథంతో కొనసాగాల్సిన పాఠశాలను వ్యాపారంగా మార్చేశారు. ప్రతి సంవత్సరం జీవో ఎంఎస్ నెం. 1ప్రకారం పాఠశాల యాజమాన్యం వారి ఆడిట్ రిపోర్ట్‌ను విద్యాశాఖ అధికారులకు సడ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ, సెయింట్ జోసఫ్ పాఠశాల యాజమాన్యం ఇప్పటికి ఆడిట్ రిపోర్ట్ సడ్మిట్ చేసిన దాఖలాలు లేవు. ‘తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు’ అన్నట్టుగా కార్పోరేట్ స్కూల్స్ వ్యవహరిస్తున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుపేద తల్లిదండ్రులను ఘోస పెడ్తున్నాయి.
రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో కార్పోరేట్, ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చుకొని.. డోనేషన్లు, బుక్స్ పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి. కనీస వసతులు, క్వాలిఫైడ్ టీచర్లు లేకుండా, ఉన్నా వారికి కనీస జీతాలు ఇవ్వక నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలాంటి స్కూల్స్‌పై ప్రభుత్వం, విద్యాశాఖ స్పందించి కఠిన చర్యలు తీసుకొని, డొనేషన్లను తిరిగి ఇప్పించాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నారు.