అమీన్ పూర్‌లోని సర్వేనెం.462లో దాదాపు 1 ఎకరం భూమి కబ్జా చేసి.. ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం
- ఆదాబ్ కథనంతో కదిలిన యంత్రాంగం..
- కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వేయర్ నిజనిర్ధారణ
- ఏడీ నివేదికతో బట్టబయలైన కబ్జాదారుల బాగోతం
- రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు
- బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాట్లే
- మాముళ్ల మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మార్వో
- అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడాలని స్థానికుల డిమాండ్

తెలంగాణలో ప్రభుత్వ భూములను కాపాడే నాధుడే లేడా…?? అంటే లేడు అనే సమాధానమే వస్తుంది. ఏ మారుమూల గ్రామంలో చూసిన భూముల రేట్లు భారీగా పెరిగిపోవడంతో అక్రమార్కులు కబ్జాలపైనే కన్నువేస్తున్నారు. ఎక్కడ కూసింత జాగ దొరికినా దాన్ని ఆక్రమించుకోవడమే వాళ్ల పని. వీళ్లకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఫుల్ సపోర్ట్ చేస్తుండడం గమనార్హం. అందరూ కుమ్మక్కై నీకింత, నాకింత అన్నట్టుగా అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూమి, అసైన్డ్ ల్యాండ్లు, గుట్టలు, పుట్టలు, చెట్లు, చేమలు, చెరువులు, కుంటలు దేన్ని వదలడం లేదు. దేన్నైనా ఏదో ఓ విధంగా ఆక్రమించుకోవాలనే తపనతో ఉంటున్నారు. తద్వారా రియల్టర్లు.. రాజకీయ, అధికార పలుకుబడితో భూములను కాజేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా మాముళ్లకు ఆశపడి ప్రభుత్వ భూములు, అమాయకుల జాగలను అక్రమార్కులకు అప్పగించేస్తున్నారు. కొందరు వ్యక్తులు తన ఉన్నతస్థానం పేరు చెప్పుకుంటూ ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారు. అక్రమ మార్గంలో జాగలను కొట్టేయాలనే దుర్భుద్దితో బయట తిరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ గ్రామం, మండలం పరిధిలోని రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెం.462లో కోట్లాది విలువ చేసే సుమారు 3 ఎకరాల భూమి ఉంది.. అందులో దాదాపు 1 ఎకరం భూమిపై కబ్జాదారులు కన్నెసి మింగేశారు.
ఏడీ రిపోర్ట్ ప్రకారం.. సర్వే నెంబర్ 462 టిపాన్ లేకపోవడంతో పక్క ఉన్న సరిహద్దుల ప్రకారం నిర్వహించిన సర్వే ప్రకారం మొత్తం విస్తీర్ణం 2.16 గుంటలు చూపిచడం జరిగింది. మిగతా 24 గుంటల స్థలాన్ని సర్వే అధికారులు గుర్తించలేకపోయారు. వారు గుర్తించిన 2 ఎకరాల 16 గుంటల ప్రకారం కబ్జా యొక్క వివరాలు..
462/పార్ట్ లో 0.20 గుంటలు రోడ్డుకు కేటాయించారు. 462/పార్ట్ – 0.21 గుంటలు సబ్ స్టేషన్‌కు, 462/పార్ట్ – 0.17 గుంటల్లో 120 గజాల చొప్పున 8మంది నిరుపేద జర్నలిస్ట్‌లకు అధికారికరంగా కేటాయించడం జరిగింది. అక్రమంగా ఫ్రీడమ్ ఫైటర్ అంటూ 300 గజాల స్థలాన్ని కొలిశెట్టి వజ్రమ్మ పేరుతో కేటాయించారు. 462/పార్ట్ – 0.08 గుంటల స్థలాన్ని పక్కనే ఉన్న సర్వే నెం.414 / 415 పట్టాదారులు కబ్జా చేయడం జరిగింది. అదే విధంగా సర్వే నెంబర్ 461పట్టదారుడు సర్వే నెంబర్ 462లోని 0.13 గుంటల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఫ్యూజన్ ఇంటర్‌నేషనల్ యాజమాన్యం బాజాప్తగా సర్వే నెంబర్ 462లో 0.17 గుంటలు ఆక్రమించాడు.
- ఏడీ సర్వే నివేదిక ప్రకారం 2 ఎకరాల 16 గుంటల స్థలంలో జరిగిన అక్రమాల గురించి తెలుపడం జరిగింది. కానీ, రికార్డులో ఉన్న ప్రకారం మిగతా 24 గుంటల స్థలాన్ని గుర్తించలేకపోయారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 17 గుంటల స్థలాన్ని జర్నలిస్ట్‌లకు కేటాయించారని తెలిపారు. ఈ 8మంది జర్నలిస్ట్‌లకు స్థల కేటాయింపు విషయంలో ఆదాబ్ ఎలాంటి అభ్యంరతం లేదు.. వీరికి ఇచ్చిన పట్టా ప్రకారం ఒక్కొక్కరికి 120 గజాల చొప్పున మొత్తం 960 గజాలు కేటాయించడం జరిగింది. 17 గుంటల స్థలంలో 960గజాలు పోను మిగతా స్థలం కబ్జాకు గురైంది.
భూ ఆక్రమణపై కలెక్టర్ కు ఫిర్యాదు :
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం, మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 462 ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఈ విషయం ఆదాబ్ పత్రికలో వార్తా కథనం ప్రచురించబడింది. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన సర్వేలో ఈ ఆక్రమణ నిర్ధారణ అయింది. ఇక దీనిపై జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నవించడం జరిగింది. మండల రెవెన్యూ అధికారి ఈ ఆక్రమణను ప్రోత్సహించి, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులకు అక్రమంగా బదలాయించారు. అదేవిధంగా, మున్సిపల్ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, డోర్ నెంబర్లు కేటాయించి, మున్సిపల్ టాక్స్ కూడా వసూలు చేశారు. కోట్ల రూపాయల విలువైన దాదాపు 1 ఎకరం ప్రభుత్వ భూమిని మాముళ్లు తీసుకొని కబ్జాదారులకు అప్పగించడం జరిగింది. ఉద్యోగస్థులు అయి ఉండి కూడా అవినీతికి పాల్పడ్డందుకు తమరు ఈ అధికారులపై కఠిన చర్యలు తీసుకొని, అదేవిధంగా ఫ్రీడం ఫైటర్ అని చెప్పుకొని అక్రమంగా భూమిని సొంతం చేసుకున్న వారిపై కూడా చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరడం జరిగింది.
జాతీయ రహదారికి పక్కనే ఉన్న కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని రాజకీయ పలుకుబడితో ఇతరులు కబ్జా చేయడంపై ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించాలి. ఆక్రమణకు గురైన సర్కారు ల్యాండ్ లో బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్న అధికారులకు కానరాకపోవడం విడ్డూరం. మాముళ్ల మత్తులో మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలని అన్యాక్రాంతమైన సర్కారు భూమిని కాపాడాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.