- ఇక్కడే అతి పురాతన పాపహరీశ్వర శివాలయం
- ఆ పక్కనే ప్రకృతి చమత్కారమైన వేదశిల దత్తప్రభు ఆలయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి పుణ్యక్షేత్రం.ఈ పుణ్యక్షేత్రం మనందరికి సుపరిచితమే.కానీ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి తల్లి పుణ్యక్షేత్రం నుండి కిలోమీటర్ దూరంలో మరొక పుణ్యక్షేత్రం కూడా ఉంది.అదే స్వయంభు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి ఆలయం.ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను “ఆదాబ్ హైదరాబాద్ ” మీ ముందుకు తీసుకొచ్చింది.
దత్త గురు రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి వారి ఆశీర్వాదంతో గురు చరిత్ర ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి మనందరికీ విధితమే.53 అధ్యాయాలు కలిగిన గురు చరిత్రలో 14వ అధ్యాయం ఈ బాసర పరిసర ప్రాంతంలో జరిగినది అని స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది.ఈ పవిత్ర పుణ్య స్వయంభు దత్త క్షేత్రాన్ని,వారి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి (శ్రీ గురులు) దర్శించుకొని ఇక్కడ ఒక గుహలో ధ్యానం చేసుకున్నారు.
శ్రీ నృసింహ సరస్వతి గురువులు తపస్సు చేసుకున్న ధ్యాన గుహ
ఆ గుహని ఇక్కడ “ధ్యాన గుహ” అని పిలుచుకుంటున్నారు.14వ అధ్యాయంలో లిఖించిన శ్రీ గురులు, సాయందేవునికి మధ్య జరిగిన సంభాషణ మరియు సంఘటన ఈ ప్రాంతంలో జరిగినది.ఉదర బాధతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుడు, బాధ భరించలేక ఇక్కడ ఉన్న పవిత్ర పుణ్య గోదావరి నదిలో పడి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు.అప్పటికే ఈ ప్రాంతానికి శ్రీ గురులు శిష్య బృందంతో చేరుకున్నారు.శిష్యులు ఆ బాధితుడిని శ్రీ గురుల వద్దకు తీసుకువెళ్లి అతని బాధ గురించి వివరించారు. అప్పుడే వచ్చిన సాయందేవునికి శ్రీ గురులు ఒక పని అప్పగించారు.అదే ఉదరవ్యాధితో బాధపడుతున్న బ్రాహ్మణునికి ముష్ఠాన భోజన సేవ చేసుకోమని.ఏ కొద్ది మాత్రం తిన్నా విపరీతమైన ఉదరభాధతో బాధపడుతున్న ఆ బ్రాహ్మణునికి పంచభక్ష పరమాన్నాలు పెడితే జబ్బు మరింతగా వికటిస్తుంది కదా అన్న తన భయాన్ని సాయం దేవుడు శ్రీ గురులకు విన్నవించుకున్నారు.వైద్యులకే వైద్యుడైన తన మాట మీద నమ్మకంతో అన్నదానం చేయమని సాయందేవున్ని శ్రీ గురువులు ఆజ్ఞాపించారు.ఆజ్ఞ శిరసావహించిన సాయందేవుడు, అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.ముష్టాన్న భోజనం స్వీకరించిన తర్వాత ఆ బాధితుడికి కడుపునొప్పి పూర్తిగా తగ్గిపోయింది.మహిమ చూపిన శ్రీ గురుని పాదాలపై పడిన సాయం దేవుడు తన బాధ సైతం వివరించుకున్నారు.మహమ్మదీయ వర్ణానికి చెందిన ఒక యవన రాజు దగ్గర తను పనిచేస్తున్నాడని,ఆ యవనుడు ఫలానా సమయానికి ఒక బ్రాహ్మణుని బలి తీసుకుంటాడని,ఈ పర్యాయం తన వంతు వచ్చిందని తన ప్రాణ భయాన్ని శ్రీగురులకు విన్నవించుకున్నారు.తన శిష్యులకు ఎలాంటి ప్రాణభయం ఉండదని,యవనరాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళమని,అతని సత్కారంతో తిరిగి రమ్మని శ్రీ గురువులు ఆశీర్వదించారు.ఆలస్యంగా వచ్చిన సాయం దేవుని చూసిన యవన రాజు ఆగ్రహంతో ఊగిపోయి లోనికి వెళ్తాడు.అకస్మాత్తుగా అతను నిద్రలోకి జారిపోవడం,ఒక బ్రాహ్మణుడు తనను చంపుతున్నట్టుగా పీడ కలగంటాడు.సత్వరమే ప్రాణభయం యొక్క బాధ తెలుసుకొని,సాయం దేవుని కాళ్లపై పడి తనను క్షమించమని,సత్కరించి మరీ పంపిస్తాడు మహమ్మదీయ యవ్వన రాజు.అంతా శ్రీ గురుని అనుగ్రహంతో జరిగిందని భావించిన సాయం దేవుడు వెంటనే ఈ యొక్క దివ్య అనుభవాన్ని శ్రీగురులతో వివరించుకుంటాడు.ఆ తరువాత,శ్రీ గురులు తను మిగతా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని,16 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ (బాసర) ప్రాంతానికి చేరుకుంటానని సాయందేవునికి చెబుతారు.14వ అధ్యాయంలో తెలుపబడిన ఈ దివ్య సంఘటన ప్రదేశం మన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉండడం నిజంగా మన అందరి అదృష్టం.
మరొక విశేషమేమిటంటే, అవదూత్ గురు, శేషరావు దీక్షిత్, వినాయక్ దీక్షిత్, శ్రీపాద దీక్షిత్, మదన్ దీక్షిత్, మోహన్ దీక్షిత్ పూజారులకు ఈ ఆలయనికి వంశపారంపర్య అర్చకులుగా సేవ చేసుకునే భాగ్యం కలిగింది. వీరు ఎవరో కాదు, సాక్షాత్తు సాయందేవుని వంశస్థులు అని నాగపూర్ కి చెందిన విష్ణు దాస్ మహారాజ్ అనే దత్త సాంప్రదాయ సంత్ సత్పురుషులు ద్వారా వెలుగులోకి వచ్చింది. దీక్షితుల పూర్వీకులు ఒక శిలపై బొగ్గుతో దత్తాత్రేయ స్వామి రూపం గీసి పూజించుకునేవారని,కొద్దికాలం తర్వాత ఆ బొగ్గు రేఖలే బొమ్మగా ఏర్పడి స్వామి శిలా విగ్రహంగా మారిందని,అందువలననే ఈ ఆలయం స్వయంభు దత్తాలయంగా ప్రసిద్ధి చెందిందని ఈ వంశీకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, నాగపూర్ వాస్తవ్యులు విష్ణుదాస్ మహారాజ ద్వారా నియమింపబడిన ఆనంద్ రావు పాటిల్ మరియు మనోజ్ తన్నీకర్ అనే దత్త భక్తులు ప్రస్తుతం ఈ ఆలయ అభివృద్ధి పనులు చూసుకుంటున్నట్టుగా అక్కడ ఉన్న బోర్డు ద్వారా తెలుస్తోంది.
పాప హరీశ్వర శివాలయం
శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్నది పాప హరీశ్వర శివాలయం. ఈ గ్రామంలోనే అతి ప్రాచీన పురాతనమైన ఆలయంగా స్థానికులు చెబుతున్నారు. దత్తాత్రేయ స్వామి ఆలయానికి మరియు ఈ శివాలయానికి ఒకప్పుడు సొరంగ మార్గం ఉండేదని ఇక్కడి స్థానికుల ద్వారా తెలుస్తున్నది. ఆ కాలంలో ఈ రెండు ఆలయాలకి రోడ్డు మార్గం ఉండేది కాదని, సొరంగ మార్గం కూడా చాలా కష్టతరంగా ఉండేదని మీరు చెబుతున్నారు. భక్తులు ఒక్కరుగా రావడానికి భయపడే వారని, కావున కనీసం ఐదుగురు జతకట్టుకొని ఈ సొరంగ మార్గం ద్వారా వచ్చి పరమేశ్వరుని పూజించుకునే వారని చెబుతున్నారు. ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో ఉన్నది. ధూప దీప నైవేద్య పథకం క్రింద ఆలయం ఉన్నప్పటికీ గర్భగుడిలోకి వెళ్లి చూస్తే అంతా బూజు పట్టి, చీమ పుట్టలతో భయంకరమైన పరిస్థితి కనిపిస్తున్నది. గుడికి ఆవల “అటుగా పడేసినట్టుగా” అతి పురాతన వినాయక, నాగదేవత, శివ, నందీశ్వరుల విగ్రహాలు దయనీయ స్థితిలో దర్శనమిస్తాయి. బాసర సరస్వతి మాత ఆలయం నుండి రెండు కిలో మీటర్ల దూరం లోపు ఉన్న ఈ ఆలయానికి రోడ్డు మార్గం సరిగా లేదు. పట్టించుకునే నాధుడు గాని, నాయకుడు గానీ లేరని స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ప్రకృతి వరప్రసాదం ఇక్కడి వేదశిల:
శివాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది ఈ వేదశిల. సీతమ్మ వారిని అపహరించినప్పుడు తన ఆభరణాలను మూట కట్టి పడేయగా, ఆ బంగారు మూటనే ఈ వేదశిలగా మారిందని కొందరు అంటుంటారు.ఇదిలా ఉండగా, మరొక చరిత్ర కూడా ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే, వ్యాస మహర్షి దేవతా విగ్రహాలను చెక్కి ప్రాణప్రతిష్ట చేయడానికి కొన్ని ప్రత్యేకమైన శిలలను ఎంచుకునేవారని, ఆ శిలల నుండి వీణ వాయిద్యం వినిపించేదని చెబుతుంటారు. అలాంటి ఒక శిలను కనుగొన్న అతను దేవతా విగ్రహంగా మార్చకుండా అలానే ప్రతిష్టించారని, అదే ఈ వేదశిల అని స్థానికులు చెబుతున్నారు.అతి పెద్దగా ఉండే ఈ శిలచుట్టూ కొన్నిచిన్న చిన్న శిలలు కూడా ఉంటాయి. కానీ, ప్రత్యేకత ఏమిటంటే, మన చెవిని వేదశిలకు ఆనించి, చేత్తో ఒక చిన్న రాయిని తీసుకొని ఈ శిలను నెమ్మదిగా కొడుతుంటే మనకు ఒక వైవిద్యమైన శబ్దం వినిపిస్తుంది.ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక స్టీల్ గిన్నెని ఇనుప కడ్డీతో కొడితే ఎలాంటి చురుకైన శబ్దం వినిపిస్తుందో దాదాపు అలాంటి శబ్దం ఈ శిల నుండి మనకు ఆనించిన చెవి ద్వారా వినిపిస్తుంది.ఒకానొక కాలంలో వీణ వాయిద్యం వినిపించేదని,కానీ కాలక్రమేనా జనాలు వినసొంపైన ఆ సంగీతం వినడానికి రాయితో ఈ శిలను తరచూ కొట్టడం వల్ల ఇప్పుడు వీణ వాయిద్యం ఆగిపోయి పైన వివరించిన విధంగా చమత్కారమైన శబ్దం వినిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు.
సంగీత వాయిద్యం వినిపించే వేదశిల
ఇలాంటి ప్రకృతి సౌందర్యంతో కూడిన పవిత్ర పుణ్యక్షేత్రాలను బాసర వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకుంటారని ఆదాబ్ హైదరాబాద్ చేసిన చిన్న ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక వ్యాసం.