- స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ
- పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం
- సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి
స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. గాంధీభవన్ లో జరిగిన సిఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు చర్చించుకుని మంత్రుల ముఖాముఖి షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ మేరకు ఇప్పటినుండి ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కోరోజు, ఒక్కో మంత్రి ఉదయం 11 గంటల నుండి మధ్యహ్నం 02 గంటల వరకు గాంధీభవన్ లో అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. వారానికి రెండు రోజుల పాటు మంత్రులు గాంధీభవన్ ను సందర్శించాలని, ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి జరపాలని తెలిపారు. ఈ బుధవారం అనగా సెప్టెంబర్ 25 నుండే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. తొలి రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం సెప్టెంబర్ 27న మంత్రి శ్రీధర్ బాబు, అక్టోబర్ 04న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అక్టోబర్ 09న మంత్రి పొన్నం ప్రభాకర్, అక్టోబర్ 11న మంత్రి అనసూయ సీతక్క, అక్టోబర్ 16న మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, అక్టోబర్ 18న మంత్రి కొండ సురేఖ, అక్టోబర్ 23న మంత్రి పొంగులేటి శ్రీనివాస్, అక్టోబర్ 25న మంత్రి జూపల్లి కృష్ణా రావు, అక్టోబర్ 30న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖిలో పాల్గొంటారు.