Monday, September 30, 2024
spot_img

తెలంగాణ దర్శిని విద్యార్థులకు గొప్ప వరం

Must Read

తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో రెండవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శింపజేసి, వారికి చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ‘తెలంగాణ దర్శిని” అనే వినూత్న కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయం. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను పాఠాలుగా వినడం కంటే ప్రత్యేక్షంగా చూసి అనుభవించడం వలన ఎక్కవ జ్ఞానాన్ని పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువలన ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ దర్శిని గొప్ప వరం లాంటిదని చెప్పవచ్చు.

తెలంగాణ పర్యాటక శాఖ విడుదల చేసిన జీవో 280 ప్రకారం తెలంగాణ దర్శిని కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ఒక లక్ష మంది విద్యార్థులను నాలుగు విభాగాల విభజించి అమలు చేయాలని పేర్కొన్నారు. మొదటి విభాగంలో రెండో తరగతి నుంచి నాలుగో తరగతి విద్యార్థులు ఉంటారు. వీరికి ఒక్క రోజులో గ్రామం లేదా మండల పరిధిలోని స్మారక చిహ్నాలు లేదా వారసత్వ ప్రదేశాల సందర్శన ఉంటుంది. ఈ విభాగంలో 30 వేల మంది విద్యార్థులను సందర్శనకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో విద్యార్థికి 300 రూపాయలు చొప్పున, మొత్తంగా 90,00,00 ఖర్చు చేయనున్నారు. రెండవ విభాగంలో ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు వస్తారు. వీరికి కూడా ఒక్క రోజు పర్యటన మాత్రమే. వారికి 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో పర్యటన ఉండనుంది. ఈ విభాగంలో 40 వేల మంది విద్యార్థులను సందర్శనకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 800, మొత్తంగా రూ. 3,20,00,00 ఖర్చు చేయనున్నారు. మూడవ విభాగంలో తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు వస్తారు. వీరికి రెండు రోజుల చరిత్ర యాత్ర ఉంటుంది.

ఈ యాత్ర వారు చదువుతున్న చోటు నుంచి 50 నుంచి 70 కి.మీ పరిధిలో ఉండనుంది. ఈ విభాగంలో 20 వేల మంది విద్యార్థులను సందర్శనకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.2,000, మొత్తంగా 4,00,00,00 ఖర్చు చేయనున్నారు. నాలుగో విభాగంలో డిగ్రీ విద్యార్థులు వస్తారు. వీరికి నాలుగు రోజుల యాత్ర ఉంటుంది. వారి జిల్లాకు వెలుపల రాష్ట్రంలోని ఏదైనా ప్రదేశాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ విభాగంలో 10 వేల మంది విద్యార్థులను సందర్శనకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో విద్యార్థికి రూ. 4,000, మొత్తంగా 4,00,00,00 ఖర్చు చేయనున్నారు.

తెలంగాణ గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వంతో కూడిన వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలకు నిలయంగా పేరుగాంచింది. ఇలాంటి చారిత్రక పర్యాటక ప్రాంతాలపై నేటితరం విద్యార్థులకు అవగాహన కల్పించుటకు తెలంగాణ దర్శిని దోహదపడుతుంది అనడం అక్షర సత్యం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ చుట్టూ ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆ ప్రాంతం ఆచారాలు, సంప్రదాయాలు మరియు జీవన విధానాలు తెలుసుకోవచ్చు. ఆ ప్రాంతాల గురించి తరగతి గదిలో వినడం కంటే చూడడం ద్వార ఎక్కువ గుర్తుంచుకోనే అవకాశం ఉంది. వారి చుట్టూ ప్రాంతాల గురించి విమర్శనాత్మకంగా ఆలోచింపజేస్తాయి. అలాగే విద్యార్థులలో స్నేహ భావం, సహకారం, సమస్య పరిష్కారం, సంభాషణ నైపుణ్యం, నాయకత్వం వంటి మొదలగు లక్షణాలు పెంపొందుతాయి.

విద్యా పరంగా చూస్తే ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో వినోదంతో పాటు చారిత్రక విజ్ఞానం పెంపొందే అవకాశం మెండుగా ఉంటుంది. ఏ ప్రాంతానికి సంబంధించిన చారిత్రక కట్టడాలను ఆ ప్రాంత విద్యార్థులు సందర్శించడం వలన ఆ ప్రాంతంపై విద్యార్థులకు గౌరవం ఏర్పడడమే కాకుండా, ఆ ప్రాంతం యొక్క చారిత్రక గొప్పతనాన్ని తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రాచీన కళకు, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన కట్టడాలను చూడడం వలన ఆయా కాలాల సాంఘిక కట్టుబాట్లు, అలవాట్లు, జీవన ప్రమాణాలు ఎలా ఉండేవో తెలుసుకొని వాటి ప్రభావం ఆధునిక ఆధునిక జీవనంపై ఎలా ఉందో విశ్లేషించుకోగలుగుతారు.

అంతేకాక గత భవన నిర్మాణ వైభవం, మానవ పరిణామ క్రమం విషయాలు తెలుసుకుని ఈ ప్రాంతంలో భవిష్యత్తు నిర్మాణాలు ఎలా ఉండాలో, రక్షణ పరమైన వ్యూహాలు ఎలా ఉండాలో, ఈ ప్రాంతాన్ని వివిధ రంగాల్లో ఎలా అభివృద్ధి చేసుకోవాలో విద్యార్థులు తెలుసుకోగలుగుతారు. అలాగే మన ప్రాంతంలో ఉన్న వివిధ చారిత్రక పర్యాటక స్థలాలపై అవగాహన పెంచుకొని పర్యాటక రంగం మరింతగా ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకుంటారు. ఒకనాడు ఈ ప్రాంత ప్రయోజనం కోసం జరిగిన వివిధ పోరాటల్లో అసువులు బాసిన వీరులు పుట్టిన నేలను, పోరాటం జరిగిన ప్రదేశాలను సందర్శించినప్పుడు వారిలో నిద్రాణమై ఉన్న దేశభక్తిని తట్టిలేపడంతో పాటు వారి యొక్క పోరాట స్ఫూర్తి నేటి తరంకు తప్పకుండా మార్గదర్శకం అవుతుంది.

ముఖ్యంగా జూనియర్, డిగ్రీ ఆర్ట్స్ విద్యార్థులు ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. వీరు చారిత్రక పర్యాటక ప్రాంతాలను సందర్శించడం వలన చారిత్రక విజ్ఞానంతో పరిశోధన జిజ్ఞాస పెరుగుతుంది. దీంతో వీరు భవిష్యత్తులో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, ఏపీగ్రపిస్టులు, న్యూమిస్ మాటిస్టులు, ఆరైక్విస్టులుగా స్థిరపడి తమ ప్రాంతంపై మరింత పరిశోధన చేసి స్థానిక చరిత్రను గ్రంథస్థం చేసి, భావితరాలకు తమ ప్రాంత చరిత్ర సాంస్కృతిక ప్రాధాన్యతను అందించగలుగుతారు. మనకు తెలియని మన తెలంగాణ చరిత్రను, మరుగున పడిన మన తెలంగాణ వీరుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం కలదు.

అంతేకాక వీరిలో నైతిక విలువలతో కూడిన సమగ్ర విద్య అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ప్రజా ప్రభుత్వం రాబోయే విద్యా సంవత్సరంలో తెలంగాణ విద్యా బోధనలో రెండవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలంగాణ సాంస్కృతిక చరిత్రను తప్పనిసరి పాఠ్యాంశంగా అమలు చేసి తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ వర్తింప చేయాలని చరిత్రకారులు, మేధావులు ఆకాంక్షిస్తున్నారు.

వ్యాస కర్త
డా. పోతరవేణి తిరుపతి
రాష్ట్ర అధ్యక్షులు
చరిత్ర పరిరక్షణ సమితి, తెలంగాణ
9963117456

Latest News

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS