Friday, September 20, 2024
spot_img

తెలుగు భాష -చారిత్రక నేపథ్యం

Must Read

భారతదేశం సువిశాలమైనది.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో సుమారు రెండువందలకు పైగా భాషలు వాడుకలో వున్నాయి.ఉత్తర భారతదేశంలో ఇండో-ఆర్యన్ భాషలు,ఈశాన్య ప్రాంత రాష్ట్రాలలో ఆస్ట్రో-ఎసియాటిక్ మరియు సినో టిబెటిన్ భాషలు, దక్షిణ భారతదేశంలో ద్రావిడభాషలు వ్యవహారంలో వున్నా,ఈనాటికీ లిపికి,గ్రంథరచనకు నోచుకోని భాషలు అక్కడక్కడా ఇంకా మిగిలి వున్నాయి. దక్షిణభారత దేశాన్ని గొప్పగా పాలించిన శ్రీకృష్ణదేవరాయులు తెలుగును “దేశభాషలందు తెలుగు లెస్స” అని పొగిడినా, విదేశీయులు సైతం తెలుగును “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని కీర్తించినా తెలుగు భాష గొప్పతనం పరాయి భాషల మోజులో ఉన్న పాలకుల,పాలితుల మధ్య నలిగిపోతున్నది.తెలుగుభాష ద్రావిడ విభాగానికి చెందినదిగా భాషా శాస్త్రవేత్తలైన ఎల్లిస్,బిషఫ్ కాల్డ్వెల్ లు ధృవీకరించారు.దక్షిణాది భాషావేత్తలైన ఎల్.వి.రామస్వామి,భద్రిరాజు కృష్ణమూర్తిగార్లు తెలుగు పుట్టు పూర్వాపరాల పైన సిద్ధాంతీకరించి, తెలుగు భాషను ద్రావిడభాషా సమూహంగా ద్రవీకరించారు.వీరి పరిశోధనల వలన తెలుగుభాషకు మూలం సంస్కృతభాష అనే అభిప్రాయం తొలిగిపోయింది.ద్రావిడ భాషల్లో తెలుగు,తమిళం,కన్నడం,మలయాళం మాత్రమే సాహిత్య భాషాలుగా పేర్కొనవచ్చు.ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలలో సుమారు 96 మిలియన్ ప్రజలు తెలుగులో మాట్లాడడం జరుగుతున్నది.భారతీయ భాషల్లో హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడేభాష తెలుగు.తెలుగు భాషను వ్యవహారిక భాషగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ప్రజలే కాక,దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఉపయోగిస్తున్నారు.ప్రాచీన కాలంలో సంస్కృతం,మధ్యయుగ కాలంలో హిందుస్థానీ భాషలు, ఆధునిక కాలంలో పాశ్చత్యభాషల ప్రభావం తెలుగు భాషపై పడినా,తెలుగు భాషలోని తియ్యదనం,కమ్మదనం,అమ్మదనంను ఇతరభాషలు చెరపలేకపోయాయి.ఆంధ్రుల ప్రస్తావన పురాణాలలో,రామాయణ,మహాభారత,భాగవతాది ఘట్టాలలో ఉన్నట్లు మనకు ఆధారాలు గలవు. క్రీ. శ.1వ శతాబ్దానికి చెందిన హాలుడు అనే శాతవాహన రాజు రచించిన ‘గాథాసప్తశతి’ అను గ్రంథంలో కొన్ని తెలుగు పదాలున్నట్లు భాషా పరిశోధకులు గుర్తించారు. ఇదే కాలానికి చెందిన గుణాడ్యుడనే మంత్రి రచించిన ‘బృహత్కథ’ లో పేర్కొన్న దేశీయభాష తెలుగు కావడం విశేషం. దీనిని బట్టి ఆనాటికే తెలుగు భాష జనవ్యవహారంలో ఉన్నట్లు చెప్పవచ్చు. క్రీ. శ. రెండవ శతాబ్దములో ప్రాచీన ఆంధ్ర బౌద్ధయుగానికి చెందిన అమరావతి స్థూపం లోని రాతిఫలకం మీద ‘నాగబు’ అనే తొలి తెలుగు పదంను, తెలుగు మాటగా శాసన పరిశోధకులు గుర్తించారు.శాసనాలలో తెలుగు భాషా వినియోగం క్రీ. శ.6 శతాబ్ధంనుండి ప్రారంభమైంది. ఆంధ్రప్రాంతంలోని రేనాడును పాలించిన రేనాటి చోళుల కాలంలో తెలుగుభాషా సాహిత్య వికాసప్రాభవం మొదలైంది.రేనాటి చోళ వంశమునకు చెందిన ధనంజయుని ‘కలమళ్ళ శాసనం’ తొలి తెలుగుశాసనంగా పరిగణించవచ్చును. తూర్పుచాళుక్య రాజైన జయసింహవల్లభుడు వేయించిన ‘విప్పర్ల శాసనం’ పూర్తిగా తెలుగు శాసనం.

క్రీ. శ. పదకొండవ శతాబ్దం ఆరంభం నుండి తెలుగులో గ్రంథరచన కొనసాగింది. నన్నయ రచించిన మహాభారతం తెలుగు భాషలో లభించిన మొదటి గ్రంథం. ఆంధ్రశబ్ద చింతామణి అను వ్యాకరణ గ్రంథమే తెలుగులో రచించిన మొదటి వ్యాకరణ గ్రంథం. ఈ గ్రంథాన్ని రచించిన గ్రంథకర్త వివరాలపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వున్నాయి.ఆంధ్రప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయులు, రెడ్డిరాజుల కాలంలో తెలుగుభాషా సాహిత్యం మధ్యస్థ దశకు చేరుకొన్నది. ఈ కాలంనాటి శాసనాలు తెలుగు,సంస్కృతం కలిసిన మిశ్రమ భాషలలో లభించాయి. విజయనగర ప్రభువుల కాలంనాటికి తెలుగు భాషావికాసం మలి దశకు చేరుకొని తెలుగు సాహిత్య సౌరభం పతాకస్థాయికి చేరుకొన్నది. కుతుబ్ షాహీల పాలనలో తెలుగు భాషా ప్రాభవం కొంతమేరకు తగ్గినా, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషా పోషణ, ఆదరణ పూర్తిగా మరుగున పడింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో కొంతమంది బ్రిటిష్ ఉదారవాద అధికారులు,తెలుగుభాషావేత్తలు తెలుగుపై మమకారంతో తెలుగుభాషా పునరుజ్జీవనోద్యమానికి శ్రీకారంచుట్టి సఫలీకృతులయ్యారు. జాతీయోద్యమ కాలంలో తెలుగుభాష ఆంధ్రులలో జాతీయ భావాలను రేకెత్తించి, దేశ స్వాతంత్రోద్యమ ఫలాలను పొందుటలో అజరారమరమైన కీర్తిని సాధించినదనటులో సందేహంలేదు. ఇంతటి గొప్ప చారిత్రక పరిణామం కలిగిన తెలుగుభాషను అంతరించిపోతున్న భాషల సమూహంలోకి చేర్చకుండా తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు, కీర్తిని సాధించుటకు నిత్యం తెలుగు ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆశిద్దాం.

డాక్టర్ మమత సోమరాజుపల్లి
సీనియర్ ఫెలో,
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం,
నెల్లూరు.
మొబైల్: 7013231038

Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This