- అత్తాపూర్ లోని సర్వే 384లో 12ఎకరాలు మాయం
- దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు
- కోట్లాది రూపాయలు విలువచేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు
- ఎవరికి తోచినంత వారు కబ్జా పెట్టిన వైనం
- చోద్యం చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..
- ఎండోమెంట్ కమిషనర్ మౌనం వెనుక ఆంతర్యం ఏంటి..?
- దేవుని భూమిని అక్రమార్కుల చెర నుండి రక్షించాలి
- దేవాదాయ శాఖ అధికారులకు స్థానికుల రిక్వెస్ట్
“దిక్కులేనివారికి దేవుడే దిక్కు” అంటారు పెద్దలు. మరీ దేవుడికి ఎవరు దిక్కు అనేది ప్రశ్న. ఎందుకంటే దేవుడి భూమికే రక్షణ కరువైంది అంటే ఈ క్వశ్చన్ తలెత్తక మానదు. స్వయాన శ్రీ సీతారామచంద్రస్వామికే శఠగోపం పెట్టారు అక్రమార్కులు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జాదారులు ఖతం చేశారు. ‘నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు.. ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నట్టు’ ఉన్నది కబ్జాకోరుల వ్యవహారం. తాము చేసేది ఎవరికీ తెల్వదులే అనుకుని దేవాదాయ శాఖ భూమిని మాయం చేశారు. వీరికి సర్కార్ ఆఫీసర్లు సైతం ఫుల్ సపోర్ట్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ అధికారులు లక్షల్లో జీతాలు తీసుకుంటూ అక్రమార్కులకు వంత పాడుతుండడం సిగ్గేస్తోంది.
పూర్తి వివరాల్లోకి… రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, అత్తాపూర్ గ్రామంలో దేవుని భూమి కంటపడింది. హైదరాబాద్ లోని అత్యంత కాస్లీ ఏరియా అయిన హైటెక్ సిటీ, సైబర్ సిటీకి అతి దగ్గరలో ఉన్న రాజేంద్రనగర్ లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. గజానికి లక్షల్లో వ్యాల్యూ చేస్తుండగా అక్రమార్కులు తట్టుకోలేకపోయారు. అత్తాపూర్ లోని శ్రీసీతారామచంద్రస్వామి(Sri Seetha Ramachandra Swamy) ఆలయ భూమిని కబ్జా చేశారు. గ్రామ సర్వే నెం 384లో 15.23ఎకరాల దేవాదాయ భూమి కలదు. అందులో సుమారు 12ఎకరాల భూమి కబ్జాకు గురైంది. కోట్లు విలువ చేసే అట్టి భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. ఆ తర్వాత ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు. దేవాదాయ శాఖ భూమిలో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీ సీతారామచంద్రస్వామికి చెందిన భూమిని కబ్జా చేసి మరీ కట్టడాలు నిర్మిస్తుంటే చోద్యం చూస్తుండడం వెనుక ఆంతర్యమేంటో తెలియడం లేదు. ఒక వేళ సుమారు వెయ్యి గజాలను కబ్జా చేసి ఎస్ఎం గార్డెన్ యజమాని నిర్మాణాలు చేపడుతున్నారు.
అత్తాపూర్ లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూమిని ఎవరికి తోచినంత వారు కబ్జా చేసి కట్టడాలు చేపడుతుండడం విడ్డూరంగా ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు.. ఎలక్ట్రి సిటీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు అధికారులు వసతులు ఎలా కల్పించారు.. దేవుడి భూమిని దర్జాగా కొట్టేసి కట్టడాలు చేపడుతుంటే ఎండోమెంట్ నిద్రమత్తులో ఉండడం గమనార్హం. సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సుమారు 12ఎకరాల భూమి కబ్జాకు గురైతే దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. అసలు దేవాదాయ భూమికి జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వకుంటే నిర్మాణాలు చేపడుతుంటే ఏం చేస్తున్నారు. కోట్లు విలువ చేసే దేవాదాయ శాఖ భూమి అక్రమార్కుల చెరలో పడితే ఎవరూ ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీస్తున్నారు. అత్తాపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించి, కబ్జాదారులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కబ్జాదారులకు సపోర్ట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.