- ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
వినీలాకాశంలో ఈ నెల 22న అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఆయా గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్ల సహాయం లేకుండానే నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 22వ తేదీ నుంచి 31 వరకు గ్రహాలు ఒకో వరుసలోకి రాబోతున్నాయి. గ్రహాలు ఒకేవరుసలో చాలా అరుదుగా కనిపిస్తాయి. గ్రహాలు ఒకే వరుసలోకి రావడాన్ని ప్లానెటరీ అలైన్‌మెంట్‌గా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలోకి రానున్నాయి. చాలా అరుదుగా గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తుంటాయి. ఈ దృగ్విషయాన్ని ప్లానెటరీ అలైన్‌మెంట్, పరేడ్ ఆఫ్ ప్లానెట్స్‌గా పిలుస్తుంటారు. వాస్తవానికి గ్రహాలకు మధ్య భారీగానే దూరం ఉంటాయి. గ్రహాలు ఏవీ అంతరిక్షంలో వరుస క్రమంలో ఉండవు. కానీ, మనకు భూమిపై నుంచి చూసిన సమయంలో ఒకే వరుసలో దర్శనమిస్తాయి. ఈ దృశ్యాన్ని బైనాక్యులర్స్ ద్వారా చూస్తే మాత్రం మరింత స్పష్టంగా కనిపిస్తాయి. శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లను చూసేందుకు ఫిబ్రవరి ప్రారంభం ఉత్తమమైన సమయంగా ఖగోళ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మార్చిలో అరుణగ్రహం, బృహస్పతి, యురేనస్, వీనస్, నెప్ట్యూన్, శని, మెర్క్యురీ గ్రహాలు ఒకేవరుసలోకి వచ్చి కనువిందు చేయనున్నాయి. దీన్ని గ్రేట్ ప్లానెటరీ అలైన్‌మెంట్‌గా పిలుస్తారు. ఈ ఖగోళవిందును టెలిస్కోప్ సహాయం లేకుండా చూడొచ్చు. కానీ, స్పష్టంగా నాలుగు గ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలను చూసేందుకు టెలిస్కోప్ అవసరమవుతుంది. సూర్యాస్తమయం తర్వాత రాత్రి 8.30 గంటల నుంచి ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఆ సమయంలోనే అన్ని గ్రహాలు ఒకేవరుసలో దర్శనమిస్తాయి. రాత్రి 11.30 గంటల తర్వాత మళ్లీ కనిపించవు. కానీ, బృహస్పతి, మార్స్, యురేనస్ గ్రహాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోతాయి. ఈ నెల 22 నుంచి 31 వరకు ఆయా గ్రహాలను భూమిపై నుంచి నేరుగా చూడొచ్చు. శని, బుధుడు, నెప్ట్యూన్ సూర్యాస్తమయం సమయంలో సూర్యుడికి దగ్గరగా వెళ్తాయి. మెర్క్యురీ, శని, నెప్ట్యూన్ సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లడంతో గ్రహాలు భూమిపైకి కనిపించడం తగ్గిపోతుంది. శుక్ర గ్రహం సైతం అంతగా కనిపించేందుకు ఛాన్స్ ఉండదు. బృహస్పతి, అంగారకుడు, యురేనస్ సైతం మాత్రమే కొద్దివారాల పాటు అలాగే ఉంటాయి.