- కనీసం ప్రహరీ గోడ కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో అధికారులు
- 100 మందికి పైగా ఉంటున్న వైద్య విద్యార్థినిలకు రక్షణ కరువు
- ప్రభుత్వ వైద్య కళాశాల వసతి గృహం పరిస్థితులపై ఇవాల్టి ప్రత్యేక కథనం
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి అడవి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల వసతి గృహం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అనంతగిరి కి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు అయితే పర్యాటకుల ముసుగులో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పేరుగాంచిన అనంతగిరి అడవి ప్రాంతంలోని టీబి హాస్పిటల్ భవనంలో నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించింది. అక్కడే ఉన్న మరో పాత భవనానికి మరమ్మత్తులు చేసి మెడికల్ విద్యార్థినిలకు వసతిగృహంగా మార్చారు. కానీ వసతి గృహానికి కనీసం సీసీ కెమెరాలు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థినిలు ఉండే వసతి గృహం పక్కనే ఆకతాయిలు మద్యం తాగుతూ నానా హంగామ సృష్టించే అవకాశం లేకపోలేదు.రాష్ట్రం నలుమూలల నుండి వికారాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువు కోవడానికి వచ్చిన విద్యార్థులు భయం గుప్పెట్లో ఉండాల్సి న పరిస్థితి నెలకొం ది. ప్రస్తుతం ఉన్న వసతి గృహం 100 మీటర్ల దూరంలోనే హత్యలు జరిగిన ఘటనలు కూడా గతంలో అనేకం వెలుగు చూశాయి. అయితే పక్కన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం కొనసాగుతుంది.అయితే అందులో పనిచేసే కూలీలు అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్నారు. కావున కనీసం వసతిగృహానికి ప్రహరీ గోడ ఉంటే రక్షణగా ఉంటుంది కానీ అధికారుల నిర్లక్ష్యానికి జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు అవుతారు అని పలువురు వాపోతున్నారు. జరగరానిది జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే వసతి గృహానికి ప్రహరీ గోడ నిర్మించి విద్యార్థినిలకు ఇబ్బంది లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా తీర్చిదిద్దాలని, పోలీసు నిఘా సైతం పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలు,సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వసతి గృహంలో మెరుగైన వసతులు కల్పించి రక్షణ కల్పించాలని కోరుకుందాం.