తెలుగులో తొలి నవల రచనకు నాంది పలికిన గొప్ప కవి ఆయన. మొదటి స్వీయ చరిత్ర రాసిన మహోన్నత వ్యక్తి ఆయనే. తెలుగులో తొలి ప్రహసనం వ్రాసింది కూడా ఆయనే. మొట్ట మొదటి వితంతు వివాహం జరిపించిన గొప్పతనం ఆయనదే. ఆయనే నవయుగ వైతాళికుడిగా ప్రఖ్యాత గాంచిన కందుకూరి వీరేశలింగం పంతులు. బాల్యవివాహాల రద్దుకోసం ఉద్యమించిన మహోన్నతుడు, గొప్ప సంఘ సంస్కర్త. మూఢ నమ్మకాలపై యుద్దం ప్రకటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో జన్మించారు. బ్రిటిష్ హయాంలో బాల్య వివాహాలను నిరసిస్తూ ఆయన పెద్ద ఎత్తున ఉద్యమమే నిర్వహించారు. దీంతోపాటు అనేక సంఘ సంస్కరణలకు పాటు పడ్డారు. సామాజిక దురాచారాల నిర్మూలన కోసం నిరుప మానంగా కృషి చేశారు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన కందుకూరి, బాల్య వివాహాలు రద్దు కోసం ఉద్యమిస్తూనే .. వితంతు వివాహలు జరిపించాలని కోరేవారు. దేశంలో మొదటి వితంతు వివాహం జరిపింది ఆయనే. సాహితీ వ్యాసంగంలోనూ విశేషంగా కృషిచేశారు కందుకూరి వీరేశలింగం పంతులు. బహుముఖ ప్రజాశాలి అయిన కందుకూరి. మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను కూడా ప్రారంభించారు. తెలుగులో తొలి నవల వ్రాసింది. మొదటి స్వీయ చరిత్ర రాసింది కూడా ఆయనే. అంతేగాక తొలి ప్రహసనం కూడా కందుకూరి చేతినుంచి జాలువారింది. కందుకూరి జయంతిని నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటారు.
జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా, హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. తెలుగు కవుల జీవిత చరిత్ర రాసిన మొదటి వ్యక్తి. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను తెలుగులోకి అనువదించిన తొలి తెలుగు రచయిత. ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపకులు. యువజన సంఘాల స్థాపన కూడా ఆయనతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేశారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాము నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పకుండా పాటించిన ఆదర్శ వ్యక్తి. యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.
ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం. ఆయన చేసిన ఇతర సంస్కరణా కార్యక్రమాలొక ఎత్తు, వితంతు పునర్వివాహాలొక ఎత్తు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై, అనేక కష్టనష్టాలు ఎదుర్కొనే వారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని విస్తృత ప్రచారం చేసారు. వీరేశలింగం హేతువాది. ఆయన జీవితం సంఘసంస్కరణ, సాహిత్య కృషి రెండింటితో పెనవేసుకు పోయింది. ప్రభుత్వంలోని అవినీతిని ఏవగించుకుని ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాన్ని, అబద్ధాలు ఆడక తప్పదని న్యాయవాద వృత్తిని వదులుకున్న వ్యక్తి అటువంటి దురాచారాలపై ధ్వజమెత్తి, తన సంస్కరణా భిలాషను నిరూపించు కున్నారు.
ఉన్నత విద్యానంతరం వీరేశలింగం అధ్యాపక వృత్తిని చేపట్టారు. రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరం, మద్రాసులలోని పాఠశాలల్లో పని చేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తుండడంతో ‘పంతులు’గారని, వీరేశలింగం పంతులుగారని ప్రాచుర్యం పొందారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి 1876లో ఉపాధ్యావృత్తి నుండి జర్నలిస్టుగా మారి ‘వివేకవర్థిని’ అనే మాసపత్రికను ప్రారంభించారు. మొదట ఈ పత్రిక మద్రాసు నుండి వచ్చేది. తర్వాత కొంతమంది స్నేహితులతో కలిసి, రాజమండ్రి లోనే సొంత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పత్రికను నిర్వహించారు.ఆ రోజుల్లోనే లంచగొండితనం, మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు… ఇలా ఎన్నో అన్యాయాలు సమాజంలో జరుగుతుండేవి. వాటిపైకి తన పత్రిక ‘వివేకవర్థిని’ని ఆయన ఎక్కుపెట్టారు. ఉపన్యాసాలకే పరిమితం కాకుండా ప్రత్యక్షంగా, ఆచరణాత్మకంగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తొలి వితంతు పునర్వివాహాన్ని 11 డిసెంబర్ 1881న తన ఇంట్లోనే జరిపించారు. నవల, వ్యాసం, ఉపన్యాసం, విమర్శ వంటి ప్రక్రియలకు ఆద్యులు. తెలుగులో వచ్చిన తొలి సాంఘిక నవల ‘రాజశేఖర చరిత్ర’ (1878) పంతులు గారు రాసిందే. సంఘసేవలో వీరేశలింగం ఎంత కృషి చేసారో, సాహిత్యం లోనూ అంతే కృషి జరిపారు. చదువుకునే రోజుల్లోనే రెండు శతకాలు రాసాడు. పత్రికలకు వ్యాసాలు రాస్తూ ఉండేవారు. వివేకవర్ధనిలో సులభశైలిలో రచనలు చేసేవారు. వ్యావహారిక భాషలో రచనలు చేసిన ప్రథమ రచయితలలో ఆయన ఒకరు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో అద్వితీయ ప్రతిభ కలవారు కందుకూరి.
ఆయన 130కి పైగా గ్రంధాలు రాసాడు. ఆన్ని గ్రంధాలు రాసిన వారు తెలుగులో అరుదు. సాంఘిక దురాచారాలను సంభాషణాత్మకంగా, వినోదాత్మకంగా విమర్శించే ప్రహసనాల వంటి ప్రయోగానికి వీరేశలింగమే ఆద్యుడు.ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27 న మరణించారు. వీరేశలింగం గొప్ప సంస్కర్తే కాదు, గొప్ప కవి, రచయిత. తెలుగు సాహిత్యంలో ఆయన స్పృశించని సాహితీ ప్రక్రియ లేదు. ఆయన రచనలు, కవిత్వాల్లో కూడా అభ్యుదయ భావాలు నిండి ఉండేవి. తెలుగు సాహిత్యంలో ఆయనకు సమున్నతమైన స్థానం ఉంది. నవలలు, కథలు, వ్యాసాలు అన్ని రకాల సాహితీ ప్రక్రియల్లో వీరేశలింగం గారు తన దైన ముద్ర వేశారు. తెలుగు సాహిత్యం ఉన్నంత వరకూ వీరేశలింగం ఉంటారు. సంస్కరణోద్యమం ఉన్నంత వరకూ ఆయన పేరు చిరస్థాయిలో నిలుస్తుంది. ఆయన వ్యక్తి కాదు,గొప్ప వ్యవస్థ అనేది నూటికి నూరుపాళ్లు నిజం.