- వీఆర్వో,వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలి
- 317 జీవో ద్వారా బదిలీ అయిన అధికారులనూ పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
- అన్ని స్థాయిల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలి
- టెక్నికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
- ఎన్నికల ప్రక్రియలో బదిలీ అయిన తహశీల్దార్లను పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలి
- ఈనెల 29న 900 మంది తహశీల్దార్లతోను,అక్టోబరు 6న డిప్యూటీ కలెక్టర్స్,అదనపు కలెక్టర్లు 250 మందితో ప్రత్యేకంగా భేటీ కానున్న మంత్రి పొంగులేటి
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉద్యోగుల సంఘాలతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్,డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ వివిధ స్థాయిల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.ఆయా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.వీటిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.ఈనెల 29న రాష్ట్రంలోని 900 మంది తహశీల్దార్లతోను,అక్టోబరు 6న డిప్యూటీ కలెక్టర్స్,అదనపు కలెక్టర్లు 250 మందితో ప్రత్యేకంగా భేటీ కానున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అన్ని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాములు,ప్రధాన కార్యదర్శి రమేశ్ పాక, తెలంగాణ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షుడు గరికె ఉపేందర్ రావు, తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ హక్కుల సాధన సమితి చైర్మన్ ఆర్.విజయ్, కన్వీనర్ కె.సత్యనారాయణ,తెలంగాణ రీడిప్లాయిడ్ వీఆర్వో అసోసియేషన్ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్,ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి,తెలంగాణ రెవెన్యూ టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రఘు,ఎం.భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఉద్యోగుల సంఘాలు కొన్ని వినతులు కోరారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా వేరే ప్రాంతాలకు బదిలీ అయిన తహశీల్దార్లను,317 జీవో ద్వారా బదిలీ అయిన తహశీల్దార్లు,ఇతర రెవెన్యూ అధికారులను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేయాలని 03.07.2024 తేదీన జారీ అయిన జీవో.80 ఫైనాన్స్ హెచ్ఆర్ఎం-1 నుంచి మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.రెవెన్యూ శాఖ నుంచి ఇతర శాఖలకు సర్దుబాటు చేసిన వీఆర్వోలు,వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకురావాలని,అన్ని స్థాయిల్లో రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.సీసీఎల్ఏ సహా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేసి,ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని,తహశీల్దార్ల అద్దె వాహనాల బిల్లులు 15 రోజుల్లో వచ్చేలా చూడాలని తెలిపారు.అద్దె వాహనాలకు చెల్లించే మొత్తాన్ని నెలకు రూ.33,000 నుంచి రూ.50,000 వేలకు పెంచాలి.ఎన్నికల వ్యయం సహా ఇతర అన్ని బిల్లులు త్వరగా మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.చిన్న,చిన్న సమస్యలకు తహశీల్దార్లు,ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌లపై కేసులు నమోదు చేయకుండా పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని,పదోన్నతులపై ఇతర జిల్లాల్లో జూనియర్ అసిస్టెంట్లు,రికార్డ్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారిని తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.జీవో 81 ప్రకారం తక్కువ సమయంలో ఎలాంటి బెనిఫిట్స్ పొందకుండా పదవీ విరమణ చేస్తున్న 55 ఏళ్ల నుంచి 61 ఏళ్ల వయస్సు గల వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చి 2500 దళిత కుటుంబాలను ఆదుకోవాలని,టెక్నికల్ మేనేజర్లు(హెచ్‌హెచ్‌పీలు),టైపిస్ట్ కమ్ కంప్యూటర్ అపరేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి,ఏజెన్సీ వ్యవస్థను తొలగించాలి,సీనియారిటీ ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి,ఈహెచ్ఎస్ అమలు చేయాలి.