- మంత్రుల చేష్టలతో విసిగిపోయిన ప్రభుత్వం, పార్టీ పెద్దలు
- వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి అవకాశం.!
- అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచిన సీఎం
- నెలాఖరుకల్లా అన్ని చక్కదిద్దాలన్న యోచనలో కార్యాచరణ
- బీఆర్ఎస్ హయాంలోని తప్పులను వెలికితీసే పనులు వేగవంతం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పథకాల అమలుకు శ్రీకారం
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పార్టీ పెద్దలతో పలు అంశాలపై చర్చినట్లు తెలుస్తోంది.. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇలా పలు అంశాలు పెద్దల సమక్షంలో చర్చకు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.. వాటిలో ముఖ్యంగా కేబినెట్ విస్తరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపారట.. మంత్రివర్గంలో ముగ్గురి పని తీరుపై ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వ్యహారంపై ఢిల్లీ పెద్దల సమక్షంలో వాడి వేడి చర్చలు జరిగాయట. ఆ ముగ్గురి పని తీరుపై పార్టీ క్యాడర్, లీడర్, కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.. అయితే పని తీరు బాగా లేని మంత్రులను మారుస్తూ ప్రభుత్వం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావుల మంత్రి పదవులు పోతాయంటూ ప్రధానంగా వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో వ్యక్తి మంత్రి పదవి కూడా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. తొలగించిన మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు సూచించారట. అలాగే ప్రభుత్వం ఏర్పడి.. ఏడాది పూర్తయింది కాబట్టి పూర్తి స్థాయిలో మంత్రి వర్గ విస్తరణ కూడా చేపట్టాలని సీఎంకు పార్టీ చీఫ్ కు ఢిల్లీ పెద్దలు చెప్పారట..
నెలాఖరుకల్లా అన్ని చక్కదిద్దాలన్న యోచనలో ప్రభుత్వం :-
రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలోనే ఉన్న సీఎం కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ కూడా చేపట్టనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. దూకుడుగా ఉన్న గులాబీ నేతలను అవినీతీ కేసులలో ఉక్కిరిబిక్కిరి చేయాలనీ చూస్తుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా ఈ కార్ రేస్ కేసువ్యహారాన్ని తెరమీదకు తెచ్చిన ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని బయటపెట్టాలని దూకుడు పెంచింది.. దీనిలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామమైన నిర్మాణ సంస్థలను విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ వారం చివరలో వారికి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అప్పుడు మంత్రులుగా కొనసాగిన మాజీ మంత్రులు ఈటల రాజేందర్(ఆర్థిక శాఖ), హరీశ్ రావులకు(ఇరిగేషన్ శాఖ) కూడా నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం ఉందని సమాచారం. పనులు పూర్తి కాకుండానే నిధులు ఎందుకు విడుదల చేశారు? అనే అంశంపై అధికారులు అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి జరిగిన ప్రాసెస్ కాబట్టి.. ప్రభుత్వ పెద్దల ఆలోచనల మేరకు ఇదంతా జరిగిందని విచారణలో స్పష్టం చేశారు అధికారులు. ఆ సమాచారం ఆధారంగా మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, హరీశ్ రావులను కూడా విచారించాలని ఆ తర్వాత ఫైనల్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించాలని కమిషన్ ఆలోచిస్తోంది.