విద్యుత్ షాక్ కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన బోధన్ మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగారాం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలోని పొలంలోకి ఊర పందులు వెళ్ళాయని వాటిని తరుముతుండగా అక్కడ ఉన్న కరెంట్ వైర్లకు తన దగ్గర ఉన్న కర్ర తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అతన్ని కాపాడే క్రమంలో భార్య బాలమణి, కుమారుడు కిషన్ లు కూడా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు,సిబ్బంది తో కలిసి ఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు తెలిపారు.