Thursday, November 21, 2024
spot_img

నాణ్యత క్షీణించిన నేటి చదువులు

Must Read

అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు వికసించాలి. అలా జరగాలంటే విద్యావ్యవస్థను సంస్కరించాలి.భారత దేశంలో “విద్యావ్యవస్థ” ప్రాచీనకాలం నుండే వ్యాప్తిలో ఉన్నది.నాగరికతకు నెలవైన భారతదేశంలో పూర్వకాలం లోనే గురుకులాల పేరిట విద్యావ్యవస్థ మనుగడలో ఉంది. అయితే నాటి కాలంలో విద్య అందరికీ అందుబాటులో ఉండేది కాదు. కఠోరమైన నియమాలతో, క్రమశిక్షణతో సాగిన ప్రాచీన విద్య నైతిక విలువల బోధనకు అగ్రతాంబూల మిచ్చేది. వినయం,వివేకం,పెద్దల పట్ల,గురువుల పట్ల గౌరవభావం నాటి విద్యావ్యవస్థ అందించేది. న్యాయం,ధర్మం,నీతి ఆధారంగా సాగిన నాటి విద్యలన్నీ సంస్కృతంలో బోధించబడేవి.సంస్కృత భాష ప్రపంచంలోనే అతి పురాతన మైనది. ప్రాచీన లిఖితభాషల్లో సంస్కృత భాషకు సముచిత స్థానం లభించింది. ప్రపంచంలో కెల్లా అతి పురాతన మైన లిఖిత భాషలు సుమేరియన్, ఈజిప్షియన్,లాటిన్ మొదలైన భాషలు. సైగలతో,శబ్ధాలతో భావ వ్యక్తీకరణ చేయడం వలన కలిగే ఇబ్బందుల వలన ప్రతీ భాషకు లిపి ఉండాలని భావించడం వలనే లిఖిత భాషలు ఆవిర్భవించాయి. భాషకు అక్షరాలు తోడు కావడం వలన విజ్ఞానం వికసించింది. ఒకరి భావాలను మరొకరు అతి సులభంగా గ్రహించగలగడం,తమ అభిప్రాయాలకు అక్షరరూపం రావడంతో ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ తెలుసుకునే జ్ఞానం అలవడింది.పూర్వకాలపు విద్యావ్యవస్థ దాదాపుగా అంతరించిపోయింది. విద్యావ్యవస్థలో కాలాను గుణమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.విజ్ఞాన శాస్త్ర రంగాలు పురోగతి సాధించాయి.భారత దేశంలో లిఖిత భాషలున్న రోజుల్లో ఆంగ్ల భాష అస్థిత్వం లేదు. సుమారు 9 వ శతాబ్దం వరకు ఆంగ్ల భాషకు ఉనికే లేదు.నలంద,తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల ఘనకీర్తి విశ్వవ్యాప్తం.దీనిని బట్టి భారత దేశ విద్యావ్యవస్థ ప్రాశస్త్యం అవగతమౌతున్నది. అయితే మారిన కాలానికి అనుగుణంగా అలనాటి విద్యావిధానం మారకపోవడం,ఉపాధికి మార్గం చూపకపోవడం,విదేశీయుల దండయాత్ర వలన పరిపాలనా పగ్గాలు పరాయి పాలకుల చేతుల్లో ఉండడం వలన మన విద్యావిధానం విదేశీ పాలకుల చేతుల్లోకి పోయింది.బ్రిటీషు వారు భారత దేశాన్ని వదిలి వెళ్లిన తర్వాత కూడా భారతదేశం సరైన విద్యావ్యవస్థ ను రూపొందించుకోలేక పోయింది.అడపాదడపా విద్యావిధానంలో మార్పులు జరిగినా పెద్దగా ఫలితం చేకూరలేదు. మెకాలే విద్యావిధానపు అవశేషాలు నేటికి అగుపిస్తున్నాయి.భారత దేశంలో విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది.ఆధునిక యుగంలో శాస్త్రసాంకేతిక విప్లవం వెల్లి విరిసింది.ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా అవతరించింది.ఆంగ్ల భాషను బ్రిటీషు వారు ఇండియాలో ప్రవేశపెట్టడానికి కారణం తమ పరిపాలనలో ఇండియన్ల అవసరం ఉంది కనుక.బ్రిటీషువారి కాలంలో భారత్ లో కేవలం 10 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. తమ పరిపాలనలో సహకరించడానికి భారతీయులకు ఆంగ్ల విద్య అవసరం. ఆ క్రమంలోనే భారత్ లో ఆంగ్ల విద్యకు బీజం పడింది. ఏది ఏమైనప్పటికీ ఆంగ్ల విద్యా వ్యాప్తి వలన భారత దేశానికి మేలే జరిగింది.నేటి ఆధునిక కాలంలో భారత దేశం అభివృద్ధి పథంలో సాగాలన్నా, మానవ వనరులు సక్రమ పద్ధతి లో వినియోగ పడాలి. యువత దేశానికి ఆలంబన కావాలి.చదువులు ప్రశాంతమైన వాతావరణంలో సాగాలి. ఒత్తిడి లేని చదువులే మానసిక పరిపక్వతకు దారితీస్తాయి. ఒకప్పటి చదువులు క్రమశిక్షణతో,నైపుణ్యంతో, విలువలతో వికసించేవి.ఇప్పటిలా కాకుండా అప్పటి విద్యార్థుల్లో ప్రతీ అంశంలో అవగాహన ఉండేది. అన్ని విషయాల్లో నిష్ణాతులుగా ఉండేవారు. బాల్యదశ నుండే తల్లిదండ్రుల పట్ల,పెద్దల పట్ల ఎలా మెలగాలో నేర్పించేవారు. గురువుల పట్ల భక్తి ప్రపత్తులు మెండుగా ఉండేవి.విద్యావకాశాలు అరకొరగా ఉండే నాటి రోజుల్లో ఉద్యోగావకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి.అయితే ప్రతీ ఒక్కరూ విద్యను విజ్ఞాన సాధనంగా ఎంచుకుని ఎవరి కుల వృత్తుల్లో వారు స్థిరపడి హాయిగా జీవించేవారు. నాటి సమాజంలో పెద్దరికం కూడా సజావుగానే ఉండేది.న్యాయాన్యాయాలు,సత్యాసత్యాలు పెద్దల తీర్పుల ద్వారా బహిర్గత మయ్యేవి. న్యాయస్థానాలతో పనిలేకుండా కేవలం రచ్చబండ పై నిజాయితీ గల తీర్పులు వెలువడేవి. నాటి తరం పెద్దల సత్ప్రవర్తన, హుందాతనం,నాటి చదువులు ప్రసాదించిన విలువలు అలాంటివి. అయితే ఇప్పటి చదువులు నేతి బీరకాయ చందంగా తయారైనాయి.చదువుల్లో నాణ్యత క్షీణించింది. నైతిక విలువలు నేర్పే చదువులు కనుమరుగైనాయి. తత్ఫలితంగానే నేటి సమాజం మేడి పండులా తయారైనది.కూటి కోసం కోటి విద్యలు అన్న నానుడి రూపాంతరం చెంది కేవలం భుక్తి కోసమే విద్య అన్నట్టుగా తయారైనది. విలువలు వదిలేసి, వలువలు లేని ప్రపంచంలో విహరించడం కోసం యువత తాపత్రయ పడుతున్నది. పరులను బాధించి,అనందించే మనస్తత్వాలు కలుపు మొక్కల్లా తయారైనాయి. మంచితనం గంజాయి వనంలో తులసి మొక్కలా ఒంటరిగా మిగిలిపోయింది.స్వార్ధం,అవినీతి,పరపీడన సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. గోముఖ వ్యాఘ్రాలే అడుగడుగునా తారసపడుతున్నాయి. దెయ్యాలే వేదాలు వల్లిస్తున్నాయి.నేటి సమాజంలో నీతి అంపశయ్య పై అచేతనంగా పడి ఉంది.యువత పెడదారిలో పయనిస్తున్నది. పెంపకాలు సరిగా లేవు,చదువుల్లో విలువలు లేవు. బ్రతుకు దెరువుకే గాని సక్రమంగా బ్రతకడానికి నేటి చదువులు దారిచూపడం లేదు.వంచనతో బ్రతికేందుకే దారులు అధికం గా ఉన్నాయి.అందుకే విద్యావ్యవస్థ లో పెను మార్పులు రావాలి.క్రమశిక్షణకు,నైతిక విలువలకు నేటి పాఠ్యాంశాల్లో చోటివ్వాలి.జంతు ప్రవృత్తి లోకి జారిపోతున్న మానవ సమాజాన్ని కాపాడాలంటే భావి పౌరులను సన్మార్గంలో పయనింపచేయాలి.విద్యవిధానంలో సామాజిక పరమైన అంశాలకు ప్రాధాన్యత నివ్వాలి.ఎలా బ్రతకాలో దారిచూపించాలి.కటిక దారిద్య్రంలోనైనా పైసల కోసం పరుల చెంత ఊడిగం చేసి,ఆత్మాభిమానం చంపుకోకూడదు.సమాజంలో బాధ్యతాయుత మైన పౌరులుగా మెలగాలి.

  • సుంకవల్లి సత్తిరాజు.
  • (సామాజికవిశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్ )
  • 9704903463.

చిరునామా:
సుంకవల్లి సత్తిరాజు,
సంగాయగూడెం.
దేవరపల్లి మండలం,
తూ.గో.జిల్లా,
ఆంధ్రప్రదేశ్,

Latest News

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‎పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS