- తెలంగాణలో కులగణన సర్వే అంశంపై రాహుల్, ఖర్గేకు సమగ్ర వివరాలు
- కేంద్రం ఆమోదించకుంటే ఉద్యమానికి సిద్ధం
న్యూఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే విధివిధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు అంశాలపై లోతైన చర్చలు జరగినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. “తెలంగాణలో కులగణన సర్వేను శాస్త్రీయ బద్ధంగా, పారదర్శకంగా చేపట్టిన తీరును పార్టీ అగ్ర నేతలకు వివరించినట్లు తెలిపారు. ఈ అంశంలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచింది” అని పిసిసి చీఫ్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన సర్వే ప్రక్రియను రాహుల్ గాంధీ, ఖర్గే ఆచితూచి విన్నారని పేర్కొన్నారు.

కేంద్రం వద్ద పెండింగ్‌లో బిల్లులపై వివరాలు
“గవర్నర్ నుంచి కేంద్రానికి వెళ్ళిన రాష్ట్ర బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని, పార్లమెంట్‌లో దీని కోసం కేంద్రాన్ని ఒత్తిడి చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గేలను కోరినట్లు తెలిపారు. అదేవిధంగా సుప్రీం కోర్టు విధించిన రిజర్వేషన్ల క్యాప్ తొలగించేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ఈ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చే దిశగా కేంద్రాన్ని కదిలించేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. “తెలంగాణ ప్రభుత్వం చేయాల్సినంత చేసింది, ఇప్పుడు కేంద్రం వద్ద మాత్రమే పెండింగ్‌లో ఉంది” అని స్పష్టం చేశారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర శాసనసభలో ఓటు వేస్తూ, కేంద్రానికి వెళ్ళగానే యూటర్న్ తీసుకుంటోంది అని మహేష్ గౌడ్ విమర్శించారు. ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల నేతలతో ఈ అంశంపై చర్చించి, కేంద్రాన్ని ఒత్తిడిలోకి తేవడానికి వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో తెలంగాణ కులగణనపై కాంగ్రెస్ ఎంపీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కులగణన ఎలా శాస్త్రీయంగా, ప్రజాస్వామ్యపరంగా నిర్వహించామో, దానివల్ల ఏర్పడిన సామాజిక డేటా ఎలా ఉపయోగపడుతుందో వివరించనున్నారు. కేంద్రం కులగణనకు ఆమోదం తెలపకపోతే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉద్యమానికి సిద్ధమవుతామని, కులగణనతో సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని, తెలంగాణ రూపొందించిన విధానాలను దేశవ్యాప్తంగా అమలు చేయించే వరకు విరమించమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.