మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ రష్మి శుక్లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రష్మి శుక్ల స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి బాద్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించడంతో వివేక్ ఫన్సాల్కర్ ను తాత్కాలిక డీజీపీగా బాద్యతలు అప్పగించారు.
రష్మి శుక్ల పక్షపాతం వహిస్తున్నారని ఇటీవల ప్రతిపక్ష పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. గత ప్రభుత్వ హయంలో నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని, మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణించాయని, డీజీపీ రష్మి శుక్లను తొలగించాలని లేఖలో పేర్కొన్నాయి. దీంతో ఈసీ స్పందించింది. కాంగ్రెస్, ఇతర పార్టీల నుండి ఫిర్యాదులు రావడంతో డీజీపీని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు.