- మైనార్టీ గురుకులాల్లో గందరగోళం
- సీసీఏ రూల్స్‌కు విరుద్దంగా సీనియార్టీ రిలీజ్
- ప్రధాన కార్యాలయం ముందు టీచర్స్ ధర్నా
- నిబంధనలకు విరుద్దంగా ప్రమోషన్లు, బదిలీలు
- కోర్టు ఉత్తర్వులు ఉన్న పట్టించుకోని మైనార్టీ గురుకుల కార్యదర్శి
తెలంగాణలో బదిలీల కాలం నడుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలుచోట్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ, పైసల పలుకుబడితో కొందరూ కావాల్సిన పోస్ట్, అనుకూల ప్రాంతానికి ప్రమోషన్, బదిలీలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీల విషయంలో తీవ్ర పొరపచ్చాలు వస్తున్నాయి. ‘రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడంట’ ఇటీవల వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్స్ కు ఛాన్స్ ఇవ్వడంతో ఇదే అదునుగా తీసుకొన్న ఫైరవీకారులు డైరెక్ట్ గానే తమ చేతులకు పదునుపెడుతున్నారు. లక్షల్లో డబ్బులు దండుకొని సర్కారు పెద్దలు, పొలిటికల్ రూట్ లో పనిచేసిపెడుతున్నట్లు సమాచారం. ఇలాంటివి కొన్ని బయటకు రావడంతో అక్కడ గొడవలు చోటుచేసుకుంటున్నాయి.
మైనార్టీ గురుకులాల్లో అవకతవకలు:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రమోషన్ లిస్ట్‌లో తక్కువ ర్యాంక్ ఉన్నవాళ్లకు కాకుండా ఎక్కువ ర్యాంక్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారని తద్వారా అర్హులైన తమకు అన్యాయం జరుగుతుందని టీచర్లు మంగళవారం మైనార్టీ గురుకుల ప్రధాన కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అనీస్ ఉల్ గుర్బా లోని ప్రధాన కార్యాలయంలో టీచర్లు ధర్నా చేశారు. ప్రమోషన్ లిస్ట్ పై హైకోర్టు స్టే ఇచ్చినప్పటికి కోర్టు ఉత్తర్వులను లెక్కచేయకుండా ప్రమోషన్‌లు చేపట్టడం గమనార్హం. తెలంగాణలోని అన్ని గురుకులాలో సుమారు 8 ఏళ్లు లాంగ్ స్టాండింగ్ ఉంది. కానీ మైనార్టీ గురుకులాల సెక్రటరీ కొత్తరూల్స్‌ను అవలంబిస్తూ 4సంవత్సరాలకే స్టాండింగ్ పెడుతూ.. అందరినీ బదిలీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
మరోవైపు మైనార్టీ గురుకుల నుంచి జారీ చేసిన బదిలీల లిస్ట్‌లో కొన్ని స్కూల్స్ పేర్లు లేకుండా చేయడం.. వారికి అనుకూలమైన వ్యక్తులకు బదీలులు చేస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గురుకుల కార్యదర్శి ప్రమోషన్ లిస్ట్ ను సోమవారం రాత్రి హడావుడిగా రిలీజ్ చేసింది. అదేవిధంగా మంగళవారం నాడు వెంటనే మైనార్టీ గురుకుల ప్రధాన కార్యాలయానికి రావాలని పిలిచి వెంటనే ప్రమోషన్ ఉత్తర్వులను అందజేయడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.