Sunday, February 2, 2025
spot_img

రూ. 12 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ

Must Read
  • వేతన జీవులకు ఊరట కలిగిన నిర్మలమ్మ పద్దులు
  • రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌
  • చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
  • రైతుల కోసం మరో కొత్త పథకం
  • కోటి మంది గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా
  • 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌
  • అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ
  • సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
  • 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందచేత
  • 74 నిమిషాల పాటు నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగం
  • వరుసగా ఎనిమిదవసారి బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన మంత్రి
  • మోడీ ప్రభుత్వంలో అత్యధికసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు

వేతన జీవులకు ఊరట కలిగిస్తూ.. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహ మిస్తూ.. అన్నదాతలకు అండగా నిలిచేలా భరోసానిస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్‌ కేంద్ర వార్షిక బడ్జెట్‌2025-26ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వైద్య విద్యార్థులకు తీపి కబురు అందించారు. మొత్తం రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట లభించింది. రూ.12 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది. లోక్‌సభలో ఎనిమిదోసారి బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టారు. దేశమంటే మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడ మాటలను ఉటంకిస్తూ… బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. వ్యవసాయం, ఎగుమతులు, పెట్టుబడులు సహా ఆరురంగాల్లో సమూల మార్పులు చేశారు. వికసిత్‌ భారత్‌ కోసం న్యూక్లియర్‌ ఎనర్జీ మిషన్‌ తోపాటు భూ రికార్డుల డిజిటలైజేషన్‌కు బడ్జెట్‌ లో ప్రాధాన్యమిచ్చారు. హోమ్‌ స్టే కల్పించేవారికి ప్రభుత్వ రుణాలు, ఐఐటి, ఐఐఎంలో కొత్తగా 10వేల ఫెలోషిప్స్‌కు బడ్జెట్‌ లో నిధులు కేటాయించారు. తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్‌ లో చేయూతనిచ్చారు. కొత్తగా నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేకిన్‌ ఇండియా కోసం జాతీయస్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు బడ్జెట్‌లో ప్రాధాన్యమిచ్చారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బ్జడెట్‌లో అదనపు నిధులు కేటాయించారు. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా లక్షలన్న రోట్లు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌, అంతర్రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు. దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహించడంతో పాటు గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, ఎగుమతులు, పెట్టుబడులతో పాటు ఆరు రంగాల్లో సమూల మార్పులు తీసుకోస్తున్నామన్నారు. పిఎం ధన్‌ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం తీసుకరావడంతో పాటు 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని, 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. బిహార్‌లో మకానా బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితి పెంపు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని, పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్‌ మిషన్‌ ఏర్పాటు చేశామని, పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్‌ రంగానికి కొత్త జవసత్వాలు నింపడంతో పాటు ఎంఎస్‌ఎంఈ లకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి అని నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. సున్నా శాతం పేదరికమే మా లక్ష్యమని, వికాస్‌ భారత్‌లో వంద శాతం క్వాలిటీ విద్య ఉంటుందని, 2024-25లో ఎకాన‌మీ వృద్ధి అంచనా 6.4 శాతం, 2025-26కు అంచనా 6.3-6.8 శాతానికి తీసుకెళ్తామన్నారు. సబ్‌ కా వికాస్‌కు వచ్చే ఐదేళ్లు సువర్ణవకాశం ఉంటుందన్నారు. మేం చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయని, ఆరు రంగాల్లో సమూల మార్పులు చేస్తామని, 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం ఉంటుందని, ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక ఉంటుందని, పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. లాజిస్టిక్‌ వ్యవస్థగా ఇండియన్‌ పోస్ట్‌, పోస్టల్‌ శాఖకు కొత్త రూపు ఇచ్చేలా ప్రణాళిక, ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు ప్రోత్సాహం, నేషనల్‌ మ్యాన్‌ఫ్యాక్షరింగ్‌ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు దిద్దామని, అన్ని ప్రభుత్వ స్కూల్స్‌ కు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తున్నామని, పదేళ్లలో ఐఐటిల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపుగా మారిందని, ఐఐటి పాట్నా విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని, విద్యారంగంలో ఎఐ వినియోగం తీసుకొస్తున్నామని, ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు ఏర్పాటు చేశామని, బిహార్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయడంతో రూ.30 వేలతో స్టీట్ర్‌ వెంటర్స్‌కు క్రెడిట్‌ కార్డులు ఇచ్చామని, బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం రూపొందించామన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కోటి మంది గిగ్‌ వర్కర్లకు ఆరోగ్య బీమా, 50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్స్‌, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ శిక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సంస్కరణలు అమలు చేసే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు ఇస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.

వివిధ శాఖలకు కేటాయింపులు..
రక్షణ రూ. 4,91,732 కోట్లు, గ్రావిూణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు,హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్య రూ. 1,28,650 కోట్లు,ఆరోగ్య రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు, విద్యుత్‌ రూ. 81,174 కోట్లు, వాణిజ్య, పరిశ్రమలు రూ. 65,553 కోట్లు, సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు, వైజ్ఞానికి విభాగాలకు రూ. 55,679 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయపన్ను నుంచి 22 శాతం, కేంద్ర ఎక్సైజ్‌ నుంచి 5 శాతం, జిఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం, కార్పొరేషన్‌ పన్ను ద్వారా 17 శాతం కస్టమ్స్‌ ద్వారా… 4 శాతం, అప్పులతో కాని క్యాపిటల్‌ రిసిప్ట్స్‌ ద్వారా 1 శాతం, పన్నేతర ఆదాయం 9 శాతం, అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుందని వివరించారు. వడ్డీ చెల్లింపులకు 20 శాతం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం, కీలక సబ్సిడీలకు 6 శాతం, రక్షణ రంగానికి 8 శాతం, రాష్టాల్రకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం, ఫెనాన్స్‌ కమిషన్‌, ఇతర బదిలీల ద్వారా 8 శాతం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం, ఇతర ఖర్చులకు 8 శాతం, పెన్షన్స్‌లకు 4 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఆమె ప్రవేశపెట్టడం ఇది ఎనిమిదోసారి. తద్వారా ఎక్కువసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. అత్యధికసార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంట్‌కు సమర్పించారు. ఆ తర్వాత పి.చిదంబరం, ప్రణబ్‌ముఖర్జీ వంటి వారున్నారు. నిర్మలా సీతారామన్‌ క్రమంగా వారి రికార్డులకు చేరువవుతున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో వరుసగా అత్యధిక బ్జడెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డును నిర్మలమ్మ కొనసాగిస్తున్నారు. ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళామంత్రి గానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21లో బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలిఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-04బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. 2024-25 బడ్జెట్‌ ప్రసంగంలో పెద్ద పద్దును 86 నిమిషాల్లో (1 గంట 26 నిమిషాలు) ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్‌ ప్రసంగాల్లో అదే అతి చిన్నది. కాగా నేడు ప్రవేశపెట్టిన బ్జడెట్‌లో 74 నిమిషాల పాటు ప్రసంగించారు.

Latest News

సీఎం బందోబస్తుకు వెళ్తున్న ఎస్‌ఐ ఆత్మహత్య

ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండ పర్యటనకు వెళ్తూ ఓ వీఆర్‌ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ పీఎస్‌లో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS