- కొండల్ రావు సారంటే మా అందరికీ హడల్…
- ‘‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’’ సాహస విశ్లేషణ
- ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటే గుర్తొచ్చేది కొట్లాటలు.. విజయాలే
- కాలేజీ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా.. క్రుషి చేస్తా
- సమాజంలో విలువలు పడిపోతున్నయ్…
- మీ రచనలతో ప్రజలను మేల్కొల్పండి
- అవాస్తవాలను ఖండించకపోవడం కూడా తప్పే
- కాలేజీ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- కళాశాలలో 3 పుస్తకాలను ఆవిష్కరించిన బండి సంజయ్
ప్రముఖ రచయితలు డాక్టర్ వెలిచాల కొండల్ రావు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, ప్రొఫెసర్ కలువకుంట రామక్రిష్ణ రచనలు తమకు ఆదర్శమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(BANDI SANJAY KUMAR) అన్నారు. వారి రచనలు తమకు పాఠాలే కాకుండా అప్పుడప్పుడు గుణపాఠాలు కూడా అవుతాయని వ్యాఖ్యానించారు. సమాజంలో నైతిక విలువలు, కుటుంబ బంధాలు పతనమవుతున్నాయని, రచయితలు, కవులు తమ రచనలతో మళ్లీ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజంలో జరిగే చెడును, అవాస్తవాలను ఖండించకపోవడం కూడా తప్పే అవుతుందనే విషయాన్ని గ్రహించాలన్నారు. ధర్మం అనేది ఆధారంగా రచనలు, కవిత్యాలు రాయాలని కోరారు.
ఈరోజు ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల సెమినార్ హాలులో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు రచించిన ‘‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’’, డాక్టర్ మండలోజు నర్సింహాస్వామి రచించిన ‘‘డాక్టర్ వెల్చాల కొండల్ రావు జీవితం – వాఙ్మయ సేవ’’, ప్రొఫెసర్ కలువకుంట రామక్రిష్ణ ‘‘ఫ్రాగ్రన్స్ ఆఫ్ లైఫ్’’ పేరిట రచించిన ఇంగ్లీష్ అనువాద పుస్తకాలను బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..
ఎస్ఆర్ఆర్ కళాశాల అంటే నాకు గుర్తొచ్చేవి కొట్లాటలు.. విజయ ధృవీకరణ పత్రాలే. ఈ కాలేజీలోనే నిరంతరం కొట్లాడుకునే వాళ్లం. అట్లాగే ఎస్ఆర్ఆర్ కళాశాల పరిధి కూడా నా కార్పొరేటర్ పరిధిలోనిదే. గెలిచిన ప్రతిసారి ఎన్నికల ధృవీకరణ పత్రాలు అందుకున్నది కూడా ఇక్కడే. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాల అభివృద్ధికి తప్పకుండా నావంతు కృషి చేస్తా.
ముగ్గురు ఉద్దండులు రచించిన పుస్తకాలను నాలాంటి సామాన్యుడి చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా, గర్వంగా భావిస్తున్నా. సామాన్యుడిని. రాజకీయ నాయకుడిని. మీ రాతలు, కవిత్వాలు సమాజానికి అద్దం పట్టేవే. మా అందరికీ పాఠాలే. కొన్నిసార్లు గుణపాఠాలుగా భావిస్తూ మా నడవడికను మార్చుకుంటాం.
సమాజంలో జరిగే మంచి చెడులను ఎప్పటికప్పుడు మీ రచనలతో లేవనెత్తుతూ సమాజాన్ని అప్రమత్తం చేస్తారు. లోకం పోకడలపై మీరు సంధించే అక్షరాలు మాలాంటి వాళ్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలే. అందువల్లనే మేమంతా పండితుల మాటలను వింటూ ఉంటాం. అట్లాంటి గొప్ప పేరున్న పండితుల్లో నాకు బాగా నచ్చిన వారు మా కొండల్ రావు సార్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డా. కలువకుంట రామకృష్ణ. మీరంతా మాలాంటి వాళ్లందరికీ మార్గదర్శకులు.
ఇగ కొండలరావు సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరానికి ఆదర్శం. వారి అంకిత భావం, వృత్తి నిబద్ధత మాలాంటి ఎందరికో ఆదర్శప్రాయం. వారి జీవితం గురించి, సాహిత్య సేవ గురించి రాయాలంటే పీహెచ్ డీ గ్రంథమైతది. ‘జయంతి’ పత్రిక నిర్వహణ కొండల్ రావు సార్ సాహిత్య సేవకు నిలువెత్తు నిదర్శనం.
ఇగ మన కరీంనగర్ పండిత దిగ్గజం లక్ష్మణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు రాష్ట్రాల్లోనే సుపరిచితుడు. వారి ప్రసంగాలను చాలాసార్లు వినేవాడిని. ఇగ మనందరికీ శ్రీరామచంద్రుడన్నా, రామాయణమన్నా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటాం. ఎందుకంటే రామాయణం మనకు నిత్య పారాయణం. ఎప్పుడు, ఏ రూపంలో విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పించేంత నిత్య నూతనం. నా ఆదర్శ రాముడు, అందాల రాముడు, అభినవ రాముడు, అయోధ్య రాముడే మనందరికీ ఆదర్శం. ధర్మానికి ప్రతి రూపం రాముడు. ఆదర్శాలు చెప్పడం కాదు, ఆచరించి చూపిన మహనీయుడు. అటువంటి శ్రీరాముడి చరిత్రను ‘రామాయణ కల్పవృక్షం’ పేరుతో విశ్వనాథ సత్యనారాయణ మనకు గొప్ప పుస్తకాన్ని అందించారు.
విశ్వనాథ సత్యనారాయణ గొప్ప కవి. ఆయనే ఒక మహా విశ్వవిద్యాలయం. బతికి ఉన్నంత కాలం మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు చెదరకుండా కాపాడిన మహానుభావుడు. వారు రచించిన ‘రామాయణ కల్పవృక్షం’ కోట్ల మందిని కదిలించింది. ఆ పుస్తకంలోని అంశాలపై విశ్లేషణ (వ్యాఖ్యానం) చేయడమంటేనే ఓ సాహసం. డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ఆ సాహసం చేశారు. ‘‘రామాయణ కల్పవృక్షం – లోకానుశీలనం’’ పేరుతో అనేక విషయాలను జోడించి అద్బుతమైన వ్యాఖ్యానం అందించారు. కల్పవృక్షంలోని రత్నాలన్నింటినీ ఒకచోట ఏర్చికూర్చి దండలాగా మార్చి సహజ సుందరంగా, సరళంగా అందరికీ అర్ధమయ్యేలా అందించగలిగారు. నిజంగా డాక్టర్ గండ్ర లక్ష్మణరావు చేస్తున్న సాహిత్య సేవ చాలా గొప్పది. వారిని అభినందించకుండా ఉండలేం. కార్పొరేటర్ గా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్లి అనేకసార్లు కరపత్రాలు రాయించుకున్నా.
డా. కలువకుంట రామకృష్ణ కేవలం ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా మాత్రమే కాదు, గొప్ప పండితులు కూడా. శ్రీ కృష్ణ, యతీంద్ర రామానుజ జియ్యంగార్ల పుత్రుడు. వారి ఉన్నతికి వారసత్వ సంస్కారమే కారణమైందనుకుంటా. ఇంతటి మహా మహా పండితుల పుస్తకాలను ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా.

ఈ సందర్భంగా ఇక్కడున్న మహానుభావులైన పండితులు, రచయితలను నేను కోరేదొక్కటే… సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నయ్. కుటుంబ బంధాలు సన్నగిల్లుతున్నయ్. విదేశీ సంస్కృతి పేరుతో జాతీయ భావజాలంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. కార్పొరేట్ శక్తులు విదేశీ మోజును, విదేశీ సంస్కృతిని మనమీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నయ్. ధర్మం ఆధారంగా రచనలు, కవితలు రాయాలని కోరుతున్నా. సొంత నిర్ణయాలను, అవాస్తవాలను సమాజంపై రుద్దే ప్రయత్నాలను తిప్పికొట్టాలి. వాటిని ఖండించకపోతే కూడా తప్పే అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మన దేశ సంస్కృతి, సంప్రాదాయాల గొప్పతనాన్ని, ఘనమైన వైభవాన్ని నేటి యువతకు తెలియజేయండి. విదేశీ మోజులో పడి మన సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోతే జరిగే నష్టాన్ని అర్ధమయ్యేలా రచనలు చేయండి. కుటుంబ బంధాలను, నైతిక విలువలను పెంపొందించండి. ఇట్లాంటి పెద్దలు రచించే పుస్తకాలను చదవాలని కోరుతున్నా. ఇట్లాంటి పుస్తకాలను చదవకుండా టీవీలు, సీరియల్స్, ఇంటర్నెట్ కు పరిమితం కావడం సరికాదు..
మీ రచనలు విదేశీ మోజుల పడే వారికి అంకుశం కావాలి. జాతీయ వాద భావజాలాన్ని పెంపొందించేందుకు, మన యువతను మేల్కొల్పే సూర్యకిరణాలు కావాలే. దేశాన్ని ప్రేమించే, దేశ గౌరవాన్ని కీర్తించేలా కవిత్వాలు, పుస్తకాలను నేటి తరానికి అందించాలే.
అంతిమంగా మనసులను కలిపి ఉంచే కవిత్వం రావాలని కోరుతూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా.