ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో 150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో వస్తాయి. తలుపుల హండిల్స్, కీబోర్డులు, సెల్ ఫోన్‌లు, లిఫ్ట్ బటన్‌లు, షాపింగ్ కార్ట్‌లు, పంప్‌లు మొదలైన వాటిమీద బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. తడి చేతుల నుండి పొడి చేతుల కంటే 1000 రెట్లు ఎక్కువ క్రిములు వ్యాపిస్తాయి. పబ్లిక్ టాయిలెట్ల కంటే సగటు ఎటిఎం లలో ఎక్కువ క్రిములు ఉంటాయి. దగ్గు, తుమ్ములతో పాటు, డోర్ హ్యాండిల్స్ ద్వారా జలుబు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. 72 శాతం షాపింగ్ కార్ట్‌లలో మల ఇ.కోలి క్రిములు ఉంటాయి. మన దేశంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలకు అతిసారం మూడవ ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం 3,00,000 మంది పిల్లలు చనిపోతున్నారని అంచనా. ఈ వయస్సులో 13% మరణాలకు ఇది కారణం. చేతులు పరిశుభ్రంగా ఉంచడంవలన జలుబు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వైరస్లు, జీర్ణశయాంతర అనారోగ్యం వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డయేరియాతో బాధపడుతున్న ముగ్గురు చిన్న పిల్లలలో ఒకరికి, న్యుమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతున్న ఐదు మంది పిల్లలలో ఒకరిని రక్షించవచ్చు. అందువలన ఈ సూక్ష్మజీవులు దరిచేరకుండా ఉండేందుకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. అతిసార, శ్వాస కోస వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ది లక్ష్య 6 ” అందరికీ స్వచ్ఛమైన నీరు పారిశుధ్యం ” సాధించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ లక్ష్యాన్ని 2030 సం.నికి సాధించాలి.
పరిశుభ్రత దినోత్సవం:
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 15న నిర్వహించబడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంకోసం ప్రతిరోజూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్న విషయం గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 15 అక్టోబర్ 2015లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 51 జిల్లాల నుంచి 12,76,425 మంది చిన్నారులు చేతులు కడిగే కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ రికార్డు సాధించారు.
చేతులు ఎప్పుడు కడుక్కోవాలి?
రెస్ట్రూమ్ ఉపయోగించిన తర్వాత, లోదుస్తులు మార్చిన తర్వాత, తినడానికి ముందు, చేతులు మురికిగా కనబడ్డప్పుడు, దగ్గు లేదా తుమ్మిన తర్వాత, శరీరం నుండి ఎటువంటి అవశేషాలను విసిరిన తర్వాత, పెంపుడు జంతువులు జంతువులను తాకిన తర్వాత తప్పునిసరిగా చేతులను కడుక్కోవాలి.
ఎలా పరిశుభ్రం చేయాలి:
సరైన పద్ధతిలో చేతులను కడుక్కుంటే అనారోగ్యాలను అడ్డుకోవచ్చు. చేతులను సబ్బుతో లేదా హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించి శుభ్రపరుచుకోవాలి. ఇది చిన్న చర్యగా అనిపించవచ్చు. కానీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. శుభ్రమైన కుళాయి నీటితో చేతులను తడిపి, కుళాయిని ఆపివేసి సబ్బును నురుగు వచ్చేంతవరకు రుద్దాలి. చేతుల వెనుక, మీ వేళ్ల మధ్య, గోళ్ల కింద నురుగు ఉండేలా చూడాలి. ఇలా కనీసం 20 సెకన్ల పాటు చేతులను పరిశుభ్రం చేసుకోవాలి. తరువాత శుభ్రమైన టవల్ ఉపయోగించి చేతులను పొడిగా ఉంచుకోవాలి.
చిన్ననాటి నుండే నేర్పాలి:
చేతి శుభ్రతపై అవగాహన కల్పించి శుభ్రమైన చేతులే వ్యాధులను నివారించగలవని పిల్లలకు చిన్న వయస్సులో చేతులు కడుక్కోవడం నేర్పించాలి. ఇది జీవితకాల అలవాటును ప్రోత్సహించడానికి మంచి మార్గం.
కింజరాపు అమరావతి
9494588909