- లోగో నుండి చార్మినార్ తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమే
- కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుంది
- ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించొద్దు
- చార్మినార్ ముందు నిరసన చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార లోగో నుండి చార్మినార్ ను తొలగించడం అంటే హైదరాబాద్ ను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవలే ప్రభుత్వం రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలనీ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లోని చార్మినార్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అధికార లోగో నుండి కాకతీయ కళాతోరణం , చార్మినార్ తొలగించడాన్ని ఖండిస్తున్నాం అని తెలిపారు. పదేండ్లలో సాధించిన ప్రగతిని కాదని ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా రాజముద్రని మారుస్తుందని విమర్శించారు. ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరించొద్దని కోరారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, రాజయ్య, మాగంటి గోపీనాథ్, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.