Thursday, November 21, 2024
spot_img

విశ్వ క్రీడల్లో మన త్రివర్ణ పతాకపు సత్తా చాటాలి

Must Read

డెభై ఐదు సంవత్సరాల స్వాతంత్ర్య భారతంలో అణు పరీక్షలు, చంద్రయాన్,మంగళయాన్ వంటి ప్రయోగాల ఫలితాలతో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అగ్రదేశాలకు దీటుగా మనమంతా ఎదిగాం.త్వరలోనే గగనయాన్ ప్రయోగంతో నూతన చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం.క్రికెట్ ఆటతో, విన్నూతనమైన సినిమాలతో విశ్వ వేదికలపై మన సత్తాను చాటాం.కానీ మనమంతా ఆందోళన చెందుతూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం సాధించిన నోబెల్ బహుమతులు, ఒలింపిక్ పతకాల సంఖ్య గురించి.దీనికై విద్యావేత్తలు,మేధావులు,ప్రభుత్వాలు,నేటి యువతరం, తదితరులు లోతుగా అధ్యయనం చేస్తూ సమగ్రమైన చర్చలతో మన సమస్యలకు పరిష్కారం వెతకాల్సిందే.ఆచరణకై అడుగులు వేయాల్సిందే.

జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు త్వరలో పారిస్ లో జరగనున్న విశ్వ క్రీడా సంగ్రామం ఒలింపిక్స్ పోటీలకు ఈ సారి మన దేశం నుంచి 117 మంది అథ్లెట్లు మనదేశ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడానికి మనందరి ఆశలు, బాధ్యతను మోస్తున్నారు.టోక్యో ఒలింపిక్స్ లో ఏడు పతకాలు సాధించిన మనం ఈసారి డబుల్ డిజిట్ పతకాలపైనే ఆశలు పెట్టుకున్నాం.ఈ ఒలింపిక్స్ పతాక దారులుగా పి.వి సింధు మరియు శరత్ కమల్,చెఫ్ ది మిషన్ గా గగన్ నారంగ్ ముందు నడవనున్నారు.మన దేశ ప్రభుత్వం కూడా ఈ సారి ఈ ఒలింపిక్స్ కోసం “టార్గెట్ ఒలింపిక్ పోడియం” పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించి నైపుణ్యం ,ప్రతిభ గల యువక్రీడాకారులను ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన ఆటగాళ్ళకు శిక్షణ ఇప్పించారు.విశ్వసమరానికి సిద్ధం చేశారు.

ఒకసారి మన ఒలింపిక్స్ పోటీలకు సంబంధించిన చరిత్రను గమనిస్తే అరకొర వసతులతో,ఆకలి బాధలతో వున్న బ్రిటిష్ వారి పరిపాలన కాలంలోనే మన జాతీయ క్రీడ హాకీ లో స్వర్ణయుగం చూశాం.ప్రముఖ దిగ్గజ ఆటగాడు ధ్యాన్ చంద్ హయాంలో వరుసగా 1928,1932,1936 ఒలింపిక్స్ లో మన హాకీ టీం మూడు స్వర్ణాలు గెలిచింది.తర్వాత రాను రాను హాకీ లో మనస్థాయి తగ్గింది. చివరి సారి మళ్ళీ టోక్యో ఒలింపిక్స్ లో హాకీలో కాంస్య పతకం సాధించాం.2008 బీజింగ్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా స్వర్ణ పతకపు మెరుపులతో స్ఫూర్తిగా నిలిచాడు.టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ చరిత్రలో తొలి పసిడి పతకాన్ని సాధించి నేటి ఆధునిక భారతయువతరానికి ఆదర్శమయ్యాడు.మన తెలుగు అమ్మాయి పి.వి.సింధు బ్యాడ్మింటన్ లో రెండు పతకాలు గెలిచి నేడు స్వర్ణ పతకమే లక్ష్యంగా పారిస్ లో అడుగుపెట్టనుంది.

కేవలం లక్షల సంఖ్యలో జనాభా కలిగి,సరైన వసతులు లేకున్నా,ఆకలి,నిరుద్యోగం, నిరక్షరాస్యత వంటి మహామ్మారులతో పోరాడుతున్న ప్రపంచ పటంలో చిన్న చిన్న దేశాల ఆటగాళ్ళు స్వర్ణాలు గెలుస్తున్నారు.జమైకా దేశం తరపున ఉస్సేన్ బోల్డ్ పరుగుపందెంలో పసిడి కాంతులతో చూపిన ప్రతిభ యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది.మన విద్యా వ్యవస్థలో ఆటలు అంతర్భాగం అయినప్పటికీ సరైన మైదానాలు,వసతులు లేక ,సరైన ప్రోత్సాహం అందక కాగితాలకే పరిమితం అయ్యాయి.యువతరం కూడా “ఆటలు మనకు అన్నం పెట్టవు కదా..!”అనే ధోరణిలో బ్రతుకాటలో ఉద్యోగవేటలో జీవితాలను నెట్టుకొస్తున్నారు.ఇక ప్రతిభ, నైపుణ్యాలను కలిగి వున్న యువతను ప్రోత్సాహించాల్సిన ప్రభుత్వాలు రాజకీయంతో ఆటలు ఆడిస్తున్నారు.రెజ్లింగ్ సంఘంలో తలెత్తిన వివాదాలు మనం చూశాం.ఏదేమైనా ఆటల్లో మనదేశం రాణించాలంటే మన ఆలోచనలు,విద్యా సంస్థల దృక్పథాలు,ప్రభుత్వాల విధానాలు ఇలాంటివి చాలా మారాల్సిందే.మనమంతా మార్చుకోవాల్సిందే.ప్రతిభానైపుణ్యాలు కలిగిన ఆటగాళ్ళకు అవార్డులతో పాటు, ఆర్థికసాయం అందించి జీవన భరోసా కలుగజేస్తే అప్పుడే మళ్ళీ మనం ఒలింపిక్స్ లాంటి పోటీల్లో అగ్రదేశాలకు దీటుగా ఎదగగలం.

ఎన్ని సమస్యలు, సవాళ్లు మన ముందు వున్న ఇప్పుడు మన దేశం నుంచి పారిస్ కు వెళ్తున్న క్రీడాకారులకు మనమంతా నైతిక మద్దతు, ప్రోత్సాహం అందిద్దాం.రెజ్లింగ్,హాకీ, షూటింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, గుర్రపుస్వారీ,గోల్ఫ్ విభాగాల్లో ఈసారి మనం పతకాల రేసులో వున్నాం.పి.వి.సింధు, మీరాబాయి చాను,నీరజ్ చోప్రా తదితరులు మళ్ళీ మన ఆశలకు సజీవ ప్రాణం పోస్తారు.ఈ ఒలింపిక్స్ లో మన తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.నిఖిత్ జరీన్,ఆకుల శ్రీజ,ఇషా సింగ్ , పి.వి సింధు,సాత్విక్,జ్యోతియర్రాజు,దండిజ్యోతికశ్రీ, బొమ్మ దేవర ధీరజ్ లు ఒత్తిడి అధిగమిస్తూ చివరివరకు పోరాడి తమ పతకాల వెలుగుతో మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని మనమంతా ఆశిద్ధాం.విఖ్యాత భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద అన్నట్లు ,”శారీరక మానసిక ధృడత్వం గల భారతాన్ని విద్యాలయాల్లో,మైదానాల్లో నిర్మించగలం”పుట్ బాల్ వంటి ఆటల్లో త్వరలోనే మనం పురోగతి సాదిద్ధాం.రంగం ఏదైనా ఈ ప్రపంచానికి భారతదేశం దిక్సూచి కావాలి.
ఆల్ ది బెస్ట్ ఇండియా.

ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS