- అధికారుల పర్యవేక్షణ లోపం
- అడ్డగోలుగా దాబా దందా..
- చిలిపిచేడ్ మండల పరిధిలో ‘‘సాయి తిరుమల’’ దాబా
- నాసిరకం, కాలం చెల్లిన పదార్థాల విక్రయాలు
- పట్టించుకునెదెవరూ..? ప్రజారోగ్యాన్ని కాపాడెదెవరూ..?
- ప్రశ్నిస్తున్న మండల బాధిత ప్రజానీకం..
గడిచిన ఏడాది కాలంగా ప్రజారోగ్యాన్ని దెబ్బ తీసే దందాలు జోరుగా ఊపందుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వెలిసే బిర్యానీ సెంటర్లు మారూమూల మండల కేంద్రాలకు విపరీతంగా చేరువయ్యాయి. వీరికి ఎవరు అనుమతులు ఇస్తున్నారో.. ఎవరు మద్దతు పలుకుతున్నారో తెలియదు కానీ విచ్చల విడిగా నాసిరకం ఆహార పదార్థాలు, కాలం చెల్లిన శీతల పానియాలను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి దాపరించింది. తాజాగా చిలిపిచేడ్ మండలం చిట్కూల్ గ్రామ శివారులో వెలసిన సాయి తిరుమల దాబాలో బిర్యానీ తినడానికి వెళ్లిన ఓ వ్యక్తి బిర్యానీతో పాటు ఒక థమ్స్ అప్ శీతల పానీయం కూడా ఆర్డర్ చేశాడు. థమ్స్ అప్ పై కాలం చెల్లిన తేదీని చూసి వారు నివ్వెరపోయారు. అది ఎక్స్ పైరీ అయ్యి కూడా 17రోజులు గడిరచిందని గుర్తించి నిర్వాహకుడిని నిలదీయగా సమాధానం చెప్పకుండా తమ ఓనర్ ను అడుగు అంటు సిబ్బంది సమాధానమివ్వడంతో వారు చేసేదీ ఏమీ లేక వెనుతిరిగిన పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా చిలిపిచేడ్ మండల పరిధిలో విచ్చల విడిగా బిర్యానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయని, కనీసం అనుమతులు కూడా ఉన్నాయా లేవా అనేది తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ అధికారులు జాడ లేకపోవడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఫుడ్ సెఫ్టీ అధికారులు జిల్లా కేంద్రంలో ఉన్నారా..? లేరా..? అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. రోడ్లపై విచ్చల విడిగా విక్రయాలు జరుపుతున్న తినుబండారాల కేంద్రాలను పర్యవేక్షించేదెవరూ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి నాసిరకం కాలం చెల్లిన పదార్థాలు విక్రయిస్తూ ప్రజారోగ్యాలను దెబ్బతీస్తుంటే పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తుందని, మామూళ్ల మత్తులో తూగుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా, మండల ఉన్నతాధికారులు చిలిపిచేడ్ మండల పరిధిలో అనుమతులు లేకుండా అడ్డగోలుగా నాసిరకం కాలం చెల్లిన పదార్థాలు విక్రయిస్తున్న ఆహార వ్యాపార కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు..