Saturday, February 22, 2025
spot_img

టెన్త్ విద్యార్థులకేందీ ఈ పరేషాన్..

Must Read
  • విద్యార్థులను పరీక్షలు రాయమంటారా… వద్దా ..?
  • బోర్డు తీరు స్పష్టం చేయాలనీ విద్యార్థి సంఘాల డిమాండ్
  • కాలేజీల తీరుతో విసిగిపోతున్న పదవతరగతి విద్యార్థులు..
  • పరీక్షలు పూర్తికాకముందే ఎందుకీ ఈ తంతూ అని ప్రశ్న ..
  • ఫోన్ కాల్స్ తో తల్లిదండ్రులను వేధిస్తున్న కార్పొరేట్ సంస్థలు
  • ఇంటర్ బోర్డు తెగేసి చెప్పిన మారని కార్పొరేట్ కాలేజీల తీరు
  • విందులు ఆశ జూపి విద్యాసంస్థల ప్రతినిధులను లోబర్చుకుంటున్న వైనం
  • ఏజెంట్లను నియమించుకుని దందాలు చేస్తుంటే ప్రేక్షక పాత్రలో ఇంటర్ బోర్డు

ఏడాదంతా చదివిన చదువులకు గాను ఏడాది చివరన పెట్టె పబ్లిక్ పరీక్షల్లో మంచిగా పరీక్షలు రాసి చక్కటి మార్కులు తెచ్చుకోవాలన్న తలంపుతో ఉన్న పదవతరగతి విద్యార్థులకు అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య ,నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు ..‘హలో..సర్ అంటూ పలకరిస్తూ పరేషాన్ చేస్తున్నారు.. మీ పాప లేదా బాబు ది త్వరలో పదో తరగతి అయిపోనుంది కదా .. ఇంటర్‌ కోసం ఏం ప్లాన్‌ చేస్తున్నారు. మాది కార్పొరేట్‌ కళాశాల , మా కళాశాలలో మీ పిల్లలు చదివితే ఎక్కడికో వెళతారు..మా సంస్థల్లో ఐఐటీ మొయిన్స్‌, జేఈఈలో ఏసీ, నాన్‌ ఏసీ స్పెషల్‌ బ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు జాయిన్‌ చేయిస్తే ఫీజులో రాయితీ కూడా ఇస్తాం’ అంటూ అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య ,నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తమ కళాశాలలో అడ్మిషన్ కావాలని ఒత్తిడి తెస్తూన్నారు… ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు జిల్లాల వారీగా పీఆర్వోలను నియమించుకుని స్థానికంగా ఉన్న హై స్కూల్ విద్యా సంస్థల ప్రతినిధులకు గాలం వేసి యథేచ్ఛగా అడిషన్ల దందా కొనసాగిస్తున్నారు..మాసంస్థల్లోనే టాప్‌ క్యాంపస్ ప్రవేశాలంటూ ఆయా కళాశాలల పీఆర్‌వోలు, మధ్యవర్తులు 10వ తరగతి పిల్లల తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లు సేకరిస్తున్నారు. దీంతో పలువురు రిజిస్ట్రేషన్ పేరిట రూ.10 వేలు చెల్లిస్తుండగా ఆర్థిక స్థోమత ఉన్న కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఏకంగా ఫీజు మొత్తాన్ని కూడా చెల్లిస్తున్నారు.

జిల్లాలలో ఇప్పటికే తిష్టవేసిన కార్పొరేట్ సంస్థల పీఆర్వోలు :-
కార్పొరేట్ విద్యాసంస్థల పీఆర్వోలు జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రెండు నెలల క్రితమే తిష్ట వేశారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పాఠశాలలకు వెళ్తూ పాఠశాల యాజమాన్యాలను సంప్రదించి వారికీ అందినకాడికి ముట్టజెప్పి విద్యార్థుల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ అడ్మిషన్లు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.ఈ కార్పొరేట్ సంస్థల పీఆర్వోలు ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడ కలుస్తూ వారికి విందులు ఏర్పాటు చేసి తమ సంస్థల్లో విద్యార్థులను చేర్పించేలా ప్రణాలికలు రచిస్తున్నారు…. తమ కళాశాలకు అడ్మిషన్లు ఇప్పివ్వాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. చదువులో మెరుగ్గా ఉన్న విద్యార్థుల వివరాలను ముందే తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలుస్తున్నారు. కొందరు హెచ్ఎంలు కార్పొరేట్ విద్యా సంస్థలకు బహిరంగానే సహకరిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయ సంఘాల సభ్యులకు హైదరాబాద్ కు చెందిన ఓ కార్పొరేట్ విద్యాసంస్థ జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్లో భారీగా విందులు,వినోదాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం..

తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్‌ కళాశాలల అడ్మిషన్ల వేట :-
తమ పిల్లలు త్వరగా అధిక వేతనాలతో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. విద్యార్థి భవిష్యత్తును నిర్ధేషించడంలో ఇంటర్మీడియేట్‌ది కీలకం. ఇంటర్‌లో ఎంచుకునే కోర్సులపైనే భవిష్యత్తులో స్థిరపడే రంగం సుమారుగా ఖరారు అవుతుంది. డిమాండ్‌తో కూడిన వృత్తి విద్యా కోర్సులుగా ఐఐటీ, ఎన్‌ఐటీ, జేఈఈ, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌, ఎంసెట్‌ ఉన్నాయి. వీటన్నిటిలో ప్రవేశాలకు ఇంటర్‌ తర్వాత ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే అదనుగా భవిష్యత్తులో విద్యార్థులు చేరే కోర్సులకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం మొదటి రోజునుంచే కోచింగ్‌ ప్రారంభి స్తామని, ఆయా కోర్సుల్లో తమ సంస్థ కళాశాలల విద్యార్థులు సాధించిన విజయాల కరపత్రాలను చూపుతూ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ ,కరీంనగర్ ,వరంగల్ తదితర జిల్లాలకు చెందిన కార్పొరేట్‌ కళాశాలల ప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులతో అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. అప్పటికప్పుడు ఒప్పుకోని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాతే ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావల్సి ఉంటుంది. చదివే కోర్సులు, చేరే కళాశాలలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్వేచ్ఛ, హక్కులు ఉంటాయి.విలువలు పాటించని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు జలగల్లా మారి విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు ..

అడ్మిషన్ కోసం ఆదాబ్ పత్రిక కార్యాలయానికి ఫోన్ చేసిన శ్రీచైతన్య పీఆర్వోలు :-
హలో..సర్ అంటూ పలకరిస్తూ శ్రీచైతన్య పీఆర్వోలు 040-66060606 నుండి అడ్మిషన్ కోసం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కార్యాలయానికి గురువారం ఫోన్ చేశారు..మీ పిల్లలకు ఇంటర్లో అడ్మిషన్ కావాలంటే మా సంస్థలో చేర్పించాలని వారు కోరారు..ఏడాది ఫీజుకు గాను రూ.1,30,000 వసూలు చేస్తున్నట్లు శ్రీచైతన్య పీఆర్వోలు సెలవిచ్చారు..అడ్మిషన్లు తీసుకోరాదని ఇంటర్ బోర్డు చెపింది కదా మీరెలా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని అడిగితె ..అవి మాకు తెలియదు సార్ ..మా ఫై సార్లు అడ్మిషన్లు తీసుకోమన్నారు మేము తీసుకుంటున్నామని చెబుతున్నారు..నిజానికి పరీక్షలు పూర్తయిన తర్వాత ఫలితాలు వెలువడిన తర్వాత మే, జూన్ సమయంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ డిసెంబర్, జనవరి నుంచే అడ్మిషన్ల ప్రక్రియను అల్ఫోర్స్ ,శ్రీ చైతన్య ,నారాయణ కార్పొరేట్ సంస్థలు ప్రతినిధులు ప్రారంభించారు. నిబంధనలను గాలికి వదిలి అడ్మిషన్లు తీసుకుంటున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం నిజంగా అనైతికం. అధికారులు ఇప్పటికై నా స్పందించి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘాల ప్రతినిధులు,విద్యార్థుల తలిదండ్రులు కోరుతున్నారు.

Latest News

నాణ్య‌త‌లేని సీసీ రోడ్ల నిర్మాణం

గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS