పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన ఆంశాలమీద చర్చ జరిగింది. ప్రమాదాల పట్ల కార్మికులలో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం నుండి ఒక సంస్థ అవసరమని ఆ సభలో పాల్గొన్నవారు సూచించారు. 1965 డిసెంబరు నెలలో ఢిల్లీలో జరిగిన పారిశ్రామిక భద్రత తొలి సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఇతర సంస్థలు పాల్గొని జాతీయ, రాష్ట్రస్థాయిల్లో భద్రతామండలి ప్రారంభించాలని నిర్ణయించారు. 1966 మార్చి 4న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ భద్రతామండలి ఏర్పడింది. మండలి ప్రారంభమయిన మార్చి 4న ప్రతి సంవత్సరం జాతీయ భద్రతా దినోత్సవం జరుపబడుతుంది. ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజలు భద్రత, ఆరోగ్య రక్షణను తమ జీవితంలో భాగంగా నిర్వర్తించుకునేలా చేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
మరణాలు పెరుగుతూనే ఉన్నాయి:
దేశంలో వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఫలితంగా ప్రమాదాలు, గాయాలు మరణాల సంఖ్య పెరిగింది. ప్రధానంగా తయారీ, నిర్మాణం, మైనింగ్, తయారీ వంటి పరిశ్రమలలో ప్రమాదాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. అలాగే ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాల రేటు కలిగిన దేశాలలో ఒకటిగా మన దేశం ఉంది. ఇంకా ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత విపత్తులు ప్రజల ప్రాణాలకు, ఆస్తికి విస్తృతమైన నష్టాన్ని కలిగిస్తూ పుండుపై కారం జల్లినట్లు తయారయ్యాయి. 2024 సంవత్సరం దేశవ్యాప్తంగా పనిచేసే ప్రదేశాల్లో భద్రతకు భయంకరమైనదిగా ఉందని ఇండస్ట్రీయల్ యూనియన్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 10 నాటికి తయారీ, మైనింగ్, ఇంధన రంగాలలో కనీసం 240 ప్రమాదాలు సంభవించాయి. దీని ఫలితంగా 400 మందికి పైగా మరణాలు, 850 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. వాస్తవ సంఖ్యలు ఎక్కువగా ఉండవచ్చు. రసాయన ఔషధ రంగంలో అత్యంత తీవ్రమైన ప్రమాదాలు జరిగాయి. ఈ రంగంలో 110 కి పైగా పని ప్రదేశాలలో ప్రమాదాలు సంభవించాయి. దీనివల్ల కనీసం 220 మంది కార్మికులు మరణించారు. 550 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మీడియా నివేదికల ప్రకారం, రసాయనాలను కలపడం, నిల్వ చేయడంలో తగినంత జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి భద్రతా లోపాలు పేలుడుకు దారితీశాయి. మైనింగ్ పరిశ్రమలో కనీసం 22 ప్రమాదాలలో 60 మంది కార్మికులు మరణించగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంధన రంగ పని ప్రదేశాలలో జరిగిన ప్రమాదాల్లో 20 మందికి పైగా కార్మికులు మరణించారు.
భద్రత అవసరం ఎందుకు ?
దేశం ఆర్థికాభివృద్ధికి, ప్రజల ఉపాధికి పరిశ్రమలు అత్యంతవసరం. ఇదే సందర్భంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తేనే వారి సేవలు నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తాయి. ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం, అక్కడ సేవలందించే వారికి భద్రత కల్పించడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం యాజమాన్యాల బాధ్యత. కార్మికులకు ధైర్యాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మంచి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడానికి ఉద్యోగుల భద్రత ముఖ్యం. ఇది పరిశ్రమవృద్ధికి, లాభదాయకతకు దోహదం చేస్తుంది. కార్యాలయంలో సురక్షితమైన పరికరాలు, సురక్షితమైన విధానాలను చేర్చడం లాంటి చర్యలు ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించినట్లవుతుంది. వివిధ రంగాలలో పనిచేసే వ్యక్తులు, కార్మికులు నిర్ధిష్ట భద్రతా అవసరాలను కలిగి ఉంటారు. పనిప్రదేశ భద్రతను ప్రభావితం చేసే కారకాలలో అసురక్షిత పని పరిస్థితులు, పర్యావరణ ప్రమాదాలు, మాదకద్రవ్య దుర్వినియోగం, కార్యాలయంలో హింస వంటివి ఉంటాయి. ఎలక్ట్రిక్ ఉత్పత్తులు తయారయ్యే పరిశ్రమలలో ఉద్యోగులుకు నాసిరకం వైర్లు లేదా ఎలక్ట్రానిక్స్‌తో ప్రమాదాలు పొంచి ఉంటాయి. నిర్మాణ సంస్థలో భారీ పరికరాలను ఆపరేట్ చేయడం వల్ల ఉద్యోగులు ప్రమాదాలకు గురవుతారు. వీటిని ఎదుర్కోవడానికి యాజమాన్యాలు తమ కార్యాలయాల్లో భద్రతను నిర్ధారించే వ్యూహాలను రూపొందించాలి. అన్ని కంపెనీలు పెద్ద లేదా చిన్న అనే తేడా లేకుండా తమ పరిశ్రమ లేదా కార్యాలయాలలో భద్రతను పొందుపరచాలి. సురక్షితంగా ఉండాలని పనిచేసే వారందరూ కోరుకుంటారు. భౌతిక భద్రత, సామాజిక భద్రత, ఆర్థిక భద్రత లేదా మరేదైనా భద్రతా అయినా అవ్వొచ్చు. భద్రతకు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఉద్యోగి పనితీరు పెరిగి కంపెనీ వృద్ధికి దోహదపడతాయి. ఉద్యోగుల భద్రత కార్మికుల భద్రతను నిర్ధారించడానికి, పనిచేసే ప్రదేశాలలో సురక్షితమైన పరికరాలు, సురక్షితమైన విధానాలను చేర్చడం అనేది ఉద్యోగులకు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడాన్ని సూచిస్తుంది. ధైర్యాన్ని, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మంచి సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడానికి ఉద్యోగుల భద్రత ముఖ్యం. ఉద్యోగులకు సరైన భద్రతా విధానాలు కల్పించకపోతే చట్టపరంగా అది నేరమే !
పరిష్కారాలు:
పరిశ్రమలలో ప్రమాదాలను నివారించడానికి, కార్మికుల సురక్షితతను నిర్ధారించడానికి కొన్ని భద్రతా చర్యలు అవసరం. వ్యక్తిగత రక్షణ సామగ్రి (పిపిఇ) ధరించాలి. హెల్మెట్లు, సేఫ్టీ గ్లవ్స్, కళ్ళద్దాలు, సురక్షిత పాదరక్షలు వంటి సామగ్రిని ఉపయోగించాలి. రసాయనాలు లేదా ధూళితో పనిచేసేటప్పుడు మాస్కులు ధరించాలి. యంత్రాలను సురక్షితంగా ఎలా నిర్వహించాలో కార్మికులకు నియమిత శిక్షణ ఇవ్వాలి. అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రతిస్పందన గురించి డ్రిల్లులు నిర్వహించాలి. యంత్రాలపై సురక్షిత కవర్లు, గార్డ్లు ఉంచాలి. మెయింటెనెన్స్ సమయంలో “లాకౌట్-ట్యాగౌట్” విధానాలు పాటించాలి. ఈ పద్ధతి పాటించడం వలన గాయాలు, మరణాల నుండి ఉద్యోగులను రక్షించవచ్చు. పరికరాలకు నష్టం జరగకుండా చేయవచ్చు. ఖరీదైన మరమ్మతులు, భర్తీల అవసరాన్ని తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. అగ్ని నిర్వాహక యంత్రాలు, స్మోక్ డిటెక్టర్లు,అత్యవసర నిష్క్రమణ మార్గాలు సిద్ధంగా ఉండాలి. ప్రమాదకర రసాయనాలను సరైన లేబుల్స్, కంటైనర్లలో నిల్వ చేయాలి. వెంటిలేషన్ సౌకర్యాలు, ప్రత్యేక భద్రతా ప్రోటోకాల్లు పాటించాలి. విద్యుత్ వైర్లు, సాధనాలను తనిఖీ చేసి, ఓవర్లోడింగ్ నివారించాలి.
నీరు లేదా తడి ప్రాంతాల్లో విద్యుత్ పరికరాల ఉపయోగం తప్పించాలి. అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నియమిత కాలంలో యంత్రాలు, విద్యుత్ సిస్టమ్లు, భద్రతా సామగ్రిని తనిఖీ చేయాలి. లోపాలను ఉంటే వెంటనే సరిదిద్దాలి. కార్మికులుచే అధిక గంటలు పనిచేయించగూడదు. భద్రతా కమిటీలు ఏర్పాటు చేసి, సమస్యలను నివారించాలి. పరిశ్రమల్లో భద్రతా నియమాలు కఠినంగా పాటించడం వలన ప్రమాదాలు, ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు. ప్రతి కార్మికుడు భద్రతను ప్రాధాన్యతనిచ్చి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాక్టరీస్ చట్టాలను, ఇతర ప్రభుత్వ నిబంధనలను పరిశ్రమలు అనుసరించాలి. ఉల్లంఘించిన వాటిని మూసివేయించడమే కాకుండా యాజమాన్యాలపై తగు చర్యలు తీసుకోవాలి. ప్రాణ నష్టం జరిగితే సంబంధిత యాజమాన్యలే తగు నష్ఠ పరిహారం ఇవ్వాలి.
జనక మోహన రావు దుంగ
ఫోన్: 8247045230