- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు.రాష్ట్రంలో మార్పు కావాలి,కాంగ్రెస్ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తీసుకోని వచ్చారని ఎద్దేవా చేశారు.జేఎన్టీయూలో జరిగిన ఘటన పై స్పందించిన కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.పదేళ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టల్స్ లో పురుగుల అన్నం,నీళ్ల చారు కనిపించేదని,నేడు కాంగ్రెస్ పాలనలో అంతకంటే అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.హాస్టల్లో ఉండే విద్యార్థులకు బల్లిపడిన టిఫిన్లు,చిట్టెలుకలు తిరిగే చట్నీలు పెడుతున్నారని విమర్శించారు.మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారిందని గుర్తుచేశారు.కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి 20 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారని తెలిపారు.ఈ విషాహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని ప్రశ్నించారు.అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ ఉందని నిలదీశారు.కలుషిత ఆహారం వల్ల పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు.అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులు ఈ అవస్థలు ఎదురుకుంటున్నారు అని ఎక్స్ వేదికగా తెలిపారు.