- యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్
- హయత్ నగర్‌లో స్కూల్ నిర్వహణ..
- రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు
- అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ
- ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై
- ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
- విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు
హయత్ నగర్ లోని జీ హై స్కూల్ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు ప్రజలకు తెలియక, విద్యార్థుల భవిష్యత్తుపై ఆశతో వారి అంగుహార్భాటాలు చూసి మోసపోతున్న వైనం. ప్రభుత్వ అనుమతులపరంగా స్కూలుకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్ కాగా స్కూల్ నిర్వహణ మాత్రం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కేంద్రంగా కొనసాగుతుంది. విద్యార్థులు హయత్ నగర్ కేంద్రంగా విద్యను అభ్యసించినా వారి సర్టిఫికెట్లలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి పత్రాలు ఉండడం గమనార్హం. దీనిపై కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇచ్చినట్లుగా పలువురు తెలిపారు. స్కూల్ యాజమాన్యం మాకు ముందుగా స్కూలుకు సంబంధించిన పూర్తి సమాచారం అందించలేదని, మేము తెలియక పిల్లలను స్కూల్లో చేర్పించి ఆనక తప్పక కొనసాగుతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు బాధను తెలియపరిచారు. కొందరు తల్లిదండ్రులు మేము మా పిల్లలను హయత్ నగర్ లో చదివిస్తుండగా సర్టిఫికెట్లపై యాదాద్రి భువనగిరి జిల్లాగా రావడం ఏంటని ముక్కున వేలే సుకుంటున్నారు.
తాజాగా విద్యార్థుల స్కూల్ ఫీజు భారీగా పెంచడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భారీగా ప్లకార్డులు చేత భూని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క విధంగా రాబోయే విద్యా సంవత్సరానికి 30 % మించి ఫీజులు పెంచారంటూ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై విద్యార్థుల తల్లిదండ్రులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎటువంటి ప్రాథమిక సమాచారం లేకుండా ఫీజులు పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై భగ్గుమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యపు ధోరణి ని నిరసిస్తూ జి హై స్కూల్ నుండి విజయవాడ జాతీయ రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫీజులు తగ్గించాలని గతంలో ఎన్నిసార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేలకు వేలు ఫీజులు పెంచుకుంటూ, తల్లిదండ్రుల రక్తం తాగుతూ వారి ఖజానా నింపుకుంటున్నారని ఆక్రోషం వెలగక్కారు. పాఠశాల నిర్లక్ష్యపు ధోరణిపై గతం లో డీఈవో, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా మాకు తగిన న్యాయం జరగలేదని విచారం వ్యక్తం చేశారు. వెంటనే ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని తల్లిదండ్రులకు, విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
అనైతికంగా తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం లేకుండా అధిక మొత్తంలో పెంచిన ఫీజులను వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10% కంటే ఎక్కువగా పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని తల్లిదండ్రులు హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం, సంబంధిత అధికారులు జి స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని తమ గళం వినిపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సంబంధిత స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని బాధితులు కోరుతున్నారు.