Sunday, February 23, 2025
spot_img

కబ్జాదారుల కబంధహస్తాల్లో ఖతమైన చెరువు.. !

Must Read
  • పుప్పాలగూడలో ఫినిక్స్ కబ్జా చేస్తున్న చెరువు స్థలం హైడ్రా పరిధిలో లేదా..?
  • ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ కు ఈ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..?
  • దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్న వైనం..
  • వేల కోట్ల విలువైన స్థలం అధికారుల కండ్లకు కనబడటం లేదా..?
  • కాసులకు అమ్ముడు పోయిన అధికారులు జాడెక్కడ..?
  • వీరి బాగోతం బట్టబయలు కాకుండా ఉండేటందుకే చర్యలు చేపట్టడం లేదా..?
  • నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ 272, 273 గల భూములుకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు..
  • వీటికి అక్రమంగా బై నెంబర్లను సృష్టించిన గండిపేట సబ్ రిజిస్ట్రార్..
  • ఒకేరోజు వరుసగా ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసిన వైనం..
  • లుబ్నా సరావత్ చేసిన ఫిర్యాదుపై వెలుగు చూసిన నకీలీపత్రాల కథ..
  • ఈ వ్యవహారం ముమ్మాటికీ వాస్తవమేనని.. విచారణకు ఆదేశించిన రేరా..!!
  • 13వ తేదీన హాజరు కావాలని ఫినిక్స్, సుమధుర నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసిన రేరా..
  • అయ్యా ముఖ్యమంత్రి గారూ ఈ కబ్జా వ్యవహారం హైడ్రాకు వర్తించదా సార్..?

అస్మదీయులు, తస్మదీయులు అని ఇద్దరు ఉంటారు.. వీరు దైవకాలం నుంచి వున్నారు.. ప్రస్తుత కలియుగంలో కూడా ఖచ్చితంగా ప్రతిఒక్కరికీ అస్మదీయులు, తస్మదీయులు ఉండే వుంటారు.. అయితే ఇరువురిపట్ల సమభావంతో ఉండగలగడం ఎంతో అవసరం.. కానీ అలా జరగడం లేదు.. ఇక రాజకీయాల్లో అయితే మరీ వింతగా ఉంటారు.. అస్మదీయులు అంటే తనవారు.. వీరికోసం చట్టాలు, నియమాలు, నిబంధనలు అసలు పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వారికోసం ఎంతైనా, ఏమైనా చేస్తూ ఉంటారు.. ఇప్పుడు జరుగుతున్న తంతు ఇలాంటిదే.. ఫీనిక్స్ నిర్మాణ సంస్థ అధినేత ఒకప్పటి అధికారులకు, ప్రస్తుత అధికారులకు.. అప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి కూడా అస్మదీయులుగానే కనిపిస్తున్నారు.. అందుకే అతగాడి జోలికి వెళ్లడం లేదు.. శక్తివంతమైన హైడ్రా కూడా ఫీనిక్స్ వైపు కన్నెత్తి చూడటానికి వెనుకాడుతుంది అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో..? అర్ధం చేసుకోవచ్చు..

రంగారెడ్డి జిల్లా పరిధిలోని, గండిపేట మండలంలో గల, పుప్పాలగూడ గ్రామ శివారులో సర్వేనెంబర్ 272, 273లో నార్సింగ్ 2 చెరువుకు సంబంధించిన ప్రభుత్వ భూమి కలదు.. సదరు భూమి రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధిత జాబితా 22 (ఏ)లో ఉంది.. ఇలా నిషేధిత జాబితాలో ఉన్న భూములను బదలాయింపు చేయడానికి వీలులేని భూములుగా, ఇందులో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి కుదరదని రిజిస్ట్రేషన్ చట్టం చెబుతుంది.. కానీ ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ తనకున్న డబ్బు, పలుకుబడి ఇంకా అక్రమసంపాదనపై వ్యామోహంతో సంబంధిత అధికారులను కొనుగోలు చేసి కబ్జాకు తెర లేపాడు.. కాగా ఈ యొక్క ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్లకు.. వీరికి వీరే సదరు సర్వే నెంబర్లకు ఒకచోట బై వన్ అని, ఒకచోట బై పి అని నెంబర్లను వేసుకొని దొడ్డి దారిన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ అక్రమార్కులు.. తెలంగాణ రాష్ట్రంలో ఒకేరోజు ఒకే భూమికి ఒకటి తరువాత మరొకటి వరుస రిజిస్ట్రేషన్లు చేసుకొని కబ్జా చేయుటకు దొడ్డి దారిన తమకు అనుకూలంగా మార్చుకున్నారు రియల్ వ్యాపారులు.. కాగా ఫినిక్స్ అదినేత చుక్కపల్లి అవినాష్ అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న దాంట్లో భాగస్వాములైన వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలుపుటకు నిదర్శనమే నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్.ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవో 1092.. ఈ యొక్క జీవో పరిశీలిస్తే ఫినిక్స్ నిర్మాణం చేస్తున్న స్థలానికి సంబంధించిన సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఈ యొక్క జి.ఓ చూస్తే తేటతెల్లం అవుతుంది.. ఐజి జారీ చేసిన సర్క్యులర్ మెమో నంబర్. జి1/1843/2015 తేదీ : 08-04-2015 ప్రకారం అనెక్సర్ ఒకటి నుండి 8 వరకు ఉన్న ఉత్తర్వుల ఆధారంగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తుల పైన, రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తుల పైన, చేసుకున్న వ్యక్తుల పైన.. అందులో సాక్షుల పైన.. డాక్యుమెంట్ రైటర్ పై.. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఈ యొక్క సర్క్యులర్ తెలుపుతుంది.. కానీ ఈ దిశగా చుక్కపల్లి అవినాష్ పై కానీ సంబంధిత వ్యక్తుల పై కానీ నేటికీ ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది..

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కేసులు నమోదు చేయాల్సిన రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకొని తమకేమీ తెలియదన్న చందాన మౌనంగా ఉండటం వారి అవినీతికి అద్దం పడుతుంది.. మరోవైపు ఇటీవలే అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ ఏఈ నికేష్ కుమార్.. భారీగా అక్రమ ఎన్.ఓ.సి.లు ఇస్తూ వందల కోట్లు పోగుచేసుకుని చెరువులను చరబడుతున్న సంస్థలకు వత్తాసు పలకడం ఒకటైతే.. ఈ యొక్క ఏఈ ఇదే గండిపేట పరిధిలో విధులు నిర్వర్తించడంతో దొరికిన సొమ్ములో ఇక్కడ పొందిన చేతివాటం సైతం ఉండవచ్చు.. నిఖిష్ కుమార్ చేసిన వ్యవహారంలో ఫినిక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాకు ఆజ్యాం పోసినట్లు అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. చెరువులను కబ్జాలు చేస్తే కేసులు నమోదు చేయాల్సిన ఇరిగేషన్ అధికారులు ఫినిక్స్, సుమధుర నిర్మాణ సంస్థలు కలిపి చేస్తున్న కబ్జాలకు వీరు వేసిన ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోయి, పరోక్ష సహకారం అందించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్, రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని 22 (ఏ) నిషేధిత జాబితాలో ఎలా చూసినా ఫినిక్స్, సుమదుర నిర్మాణ సంస్థలు చేస్తున్న స్థలం వంద శాతం కబ్జాకు గురి అయిందని ఇట్టే తెలిసిపోతుంది.. ఇదే విషయమై అంటే చెరువులు కబ్జాకు గురి అయిన విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టబయలు చేసిన రిపోర్టులో సైతం 100 శాతం చెరువు కబ్జాకు గురి అయిన స్థలం.. ఈ యొక్క ఫినిక్స్ నిర్మాణ చేస్తున్న స్థలం.. అని అందులో ఉండడంతో ఇది ముమ్మాటికి కబ్జా అనేది సులువుగా తెలిసిపోతోంది.. చెరువును పరిరక్షించాల్సిన అధికారులే వాటిని భక్షిస్తున్న బడా నిర్మాణ సంస్థలకు అమ్ముడుపోవడం.. దీనిపై విచారణకు వెనుకడుగు వేయడం.. సంబంధిత వ్యక్తులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. సంబంధిత అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు స్థానిక ప్రజలు..

దర్జాగా నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేస్తుంటే.. వేలకోట్ల విలువైన స్థలం అధికారుల కండ్లకు కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు? పలువురు సామాజికవేత్తలు.. పుప్పాలగూడలోని ఫినిక్స్ కబ్జా చేస్తున్న స్థలం హైడ్రా పరిధిలో లేదా..? అనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.. ఉపముఖ్యమంత్రి బట్టి మాట అంటే హైడ్రాకు పట్టింపు లేదా అనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. లేదా ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ కు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక చట్టాలు ఏమైనా ఉన్నాయా..? వీరు కబ్జాలు చేసుకోవడానికి నకిలీ పత్రాలు సృష్టించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందా..? ఒకే రోజు ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఎలా సాధ్యమైందని..? ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు..

లూబ్న సరావత్ అనే మహిళ సామాజిక దృక్పథంతో చెరువు కబ్జాపై ఆధారాలను సేకరించి, రేరా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.. అట్టి ఫిర్యాదుపై స్పందించిన రేరా అధికారులు సదరు పత్రాలను పరిశీలించి, నిషేధిత జాబితాలో ఉన్న భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని దొడ్డిదారిన రేరా అనుమతులు పొంది సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొడుతున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి ఈ నెల 13వ తేదీన రేరా కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు జారీ చేయడం విశేషం..చెరువు కబ్జాకు పాల్పడుతున్న ఫినిక్స్, సుమధుర నిర్మాణ సంస్థలకు, వీటికి అక్రమంగా నిర్మాణా అనుమతులు ఇచ్చిన సంబంధిత కార్యాలయ అధికారులకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది రేరా.. ఇంత భారీగా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతూ ఉంటే.. పట్టపగలే చెరువును దర్జాగా కబ్జా చేస్తూ ఉంటే హైడ్రా ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం.. కనీసం పనులు నిలుపుదల చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి.. ఫినిక్స్, సుమధుర నిర్మాణ సంస్థలు చేస్తున్న చెరువు కబ్జాను కట్టడి చేసి.. హైడ్రా అధికారులను తక్షణమే పంపించి చర్యలు చేపట్టాలని డిమాండ్స్ వెలువెత్తుతున్నాయి.. అంతే కాకుండా నకిలీ పత్రాలు సృష్టించి, భూకబ్జాలకు పాల్పడుతున్న వీరిపై ల్యాండ్ గ్రాబింగ్, ఇరిగేషన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి అన్యాక్రాంతమవుతున్న చెరువును పరిరక్షించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.. ఐజి సర్కులర్ ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు సైతం స్పందించి, అనెక్సర్ వన్ నుంచి ఎనమిది వరకు ఉన్న నిబంధనల ప్రకారం సబ్ రిజిస్టర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న సదరు వ్యక్తులపై తక్షణమే ఫిర్యాదు చేయాలని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. ఫినిక్స్ నిర్మాణ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా గత ప్రభుత్వ పెద్దలను తమ గుప్పిట్లో పెట్టుకొని, చట్టాలతో పని లేకుండా.. నకిలీ పత్రాలు సృష్టించి వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వ్యవహారానికి సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘ ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

దండేకుంట దార్తిపాలు..

దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS