- కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం ప్రదర్శన
- ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన
- సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలుకై డిమాండ్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విధించిన ఎన్నికల కోడ్ ను కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ ఉల్లంఘించారు. ఇటీవల ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలు, ఫోటోలు, జెండాలు, గోడ రాతలు లేకుండా చూడాలి. కానీ సంబంధిత సబ్ రిజిస్ట్రార్ మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాలను భేఖాతరు చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్జాగా ప్రదర్శిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. నిత్యం పలు రకాల భూమి రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంనకు వచ్చే ప్రజలకి సబ్ రిజిస్ట్రార్ గదిలోనే సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటం దర్శనమిస్తున్నా సంబంధిత ఎంసిసి అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగినిగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ అధికార పార్టీకి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన మోడల్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘన చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పై ప్రజలు మండిపడుతున్నారు. గ్రామాల్లోని ప్రజలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సి విజిల్ యాప్, ఎన్నికల కోడ్ పై అవగాహన కల్పించాల్సిన అధికారులే దారి తప్పితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని తొల గించకుండా ఉంచడంపై ప్రజల్లో సర్వత్రావిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలి: బిజెపి జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత గల సబ్ రిజిస్ట్రార్, ప్రభుత్వ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ప్రదర్శించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని బిజెపి జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన సబ్ రిజిస్ట్రార్ పై ఎన్నికల అధికారి ముజామ్మిల్ ఖాన్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఉపేందర్ రెడ్డి అన్నారు.