- ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించం
- శేరిలింగంపల్లి ఏసీపీ వెంకటరమణ,టీపీఎస్ జీషాన్
- హుడా లేఔట్ ప్లాట్ నెంబర్ 193లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
శేరిలింగంపల్లి సర్కిల్ లిమిట్స్‌లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా.. ఉక్కుపాదం మోపుతామని ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్ జీషాన్ హెచ్చరించారు. ఈవిషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబో మన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల హుడా లేఅవుట్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 193లో ఓ బిల్డర్ అక్రమంగా రెండు అదనపు అంతస్తులు నిర్మించగా శుక్రవారం వాటిని జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి కూల్చివేశారు. ప్లాట్ నెంబర్ 193కి సంబంధించి సదరు బిల్డర్ గతంలో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ భవనాన్ని నిర్మించారు. ఇటీవల ఇదే భవనంపై అదనంగా మరో రెండు అంతస్థులను నిర్మించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు బిల్డింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఉపేందర్‌రెడ్డి సదరు అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్ జీషాన్ కూల్చివేత ప్రక్రియకు పూనుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నాక్ ఇంజినీర్స్ మధుకర్ రెడ్డి, మిత్ర, చైయిన్ మెన్ ఐలయ్య యాదవ్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.