- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
- ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా మెరుగుగా లేకపోయినా, గత పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం మాటలతోనే సరిపెట్టిందని… తాము మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ చేశామని.. ఇంకా చేస్తామన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసి వారికి లాభం చేకూర్చామన్నారు. మహిళల ఆర్థిక స్థితిని పెంచేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తామన్నారు. ఉద్యోగాల భర్తీ జరగాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం అని.. పట్టభద్రులు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఆర్థిక విధానాలపై పూర్తి అవగాహన తమకు ఉందని.. అభివృద్ధి పథంలో తెలంగాణను అగ్ర స్థానంలో నిలుపుతామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు మెజారిటీ ఇచ్చినట్లే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామస్థాయిలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పట్టభద్ర ఓటర్లను స్నేహపూర్వకంగా కలుసుకొని, వారిని ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్య పరచాలని కోరారు.