లయన్ కెప్టెన్ డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు
వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ కొందరు విద్యార్థినీవిద్యార్థుల్లో ఆందోళనలు, మానసిక ఒత్తిడులు పెరగడంతో వారి పరీక్షా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ భాద్యతలను నిర్వహించడం అతి ముఖ్యమని రిటైర్డ్ ప్రిన్సిపల్, బిఎస్‌సి కెమిస్ట్రీ పాఠ్య పుస్తక రచయిత, ప్రముఖ కాలమిస్టు లయన్: కెప్టెన్: డా: బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ రోజు గర్షకుర్తి సరస్వతీ ఉన్నత పాఠశాలలో భారీగా ఏర్పాటు చేసిన స్కూల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారం జతకూడితేనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఆశావహ మానసిక పట్టుదల లేదా ఒత్తిడి అవసరమవుతుంది, కాల పట్టిక వేసుకొని ప్రతి సబ్జెక్టుకు సమయం కేటాయిస్తూ ఇష్టంగా చదివిస్తే చిన్నారుల భవిష్యత్తు ఆశించిన దానికన్న మెరుగ్గా ఉంటుందని తెలిపారు. తల్లితండ్రులు తమ పిల్లలకు సరైన దినచర్యను, సిసంస్కారాన్ని అలవాటు చేయాలని, ఉదయం 4 లేదా 5 గంటలకు నిద్ర లేపడం, రోజుకు కనీసం 4 – 6 గంటలు ఇంట్లో చదవడాన్ని అలవాటు చేయడం, క్రమశిక్షణను నేర్పడం మరిచి పోరాదు. తల్లితండ్రుల అలవాట్లు పిల్లలకు వస్తాయని, పెద్దలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమ్మాయిలను ఉన్నత చదువులు చదివించాలని, పెళ్లి పేరుతో చదువు మాన్పించవద్దని తెలిపారు. గ్రామీణ గర్షకుర్తిలో అత్యున్నత ప్రమాణాలతో సరస్వతి ఉన్నత పాఠశాలను నడిపిస్తున్న మాధవి-రాజశేఖర్ దంపతులను మనస్పూర్తిగా అభినందించారు.
సరస్వతి హైస్కూల్ అధిపతి రాజశేఖర్, మాధవిల అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థినీవిద్యార్థులు, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు, ఆహ్వానితులు పాల్గొన్న వేడుకల్లో విద్యార్థినీవిద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభాధ్యక్షత వహించిన రాజశేఖర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3000 పాఠశాలలు లీడ్ కర్రికులమ్ అమలు పరుస్తున్న వేళ సరస్వతి హైస్కూల్‌కు 27వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా డా: బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన పుస్తకాలను పాఠశాల గ్రంథాలయానికి అందించారు. కార్యక్రమ ముఖ్యఅతిథి డా మధుసూదన్ రెడ్డిని సరస్వతి ఉన్నత పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.