Monday, February 24, 2025
spot_img

నరకాన్ని దూరం చేసే కాళేశ్వర, ముక్తీశ్వరులు

Must Read

అవిభక్త కరీంనగర్, నేటి జయ శంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్ పూర్ మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాశేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి “తెలుగు” పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు మహారాష్ట్ర ఉండగా, మహారాష్ట్ర సరి హద్దున సిరోంచ తాలూకాకు 4కిలోమీటర్ల దూరానే కాళేశ్వరం ఉంది. అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని శైవ క్షేత్రాలైన శ్రీశైలం మల్లికార్జునుడు, ద్రాక్షారామం లోని భీమేశ్వరుడు, కాళేశ్వరం లోని లోని కాళేశ్వర, ముక్తీశ్వరులు మహిమాన్వితులు. దేశంలో సరస్వతీ ఆలయాలు మూడు మాత్రమే ఉండగా, ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసరలో జ్ఞాన సరస్వతి, ‘కాశ్మీర్’లో బాలస రస్వతితో పాటు ‘కాళేశ్వరం’లో మహా సరస్వతి ఉన్నాయి. అలాగే సూర్య దేవాలయాలు మూడే ఉంటే వాటిల్లో ఒరిస్సాలోని ‘కోణార్క్’, శ్రీకాకుళం లోని ‘అరిసెవెల్లి’తో కూడి ‘కాళేశ్వరం’ ఒకటిగా ఉంది. కాళేశ్వరం బ్రహ్మతీర్ధం, నర సింహ తీర్థం, హనుమత్ తీర్థం, జ్ఞాన తీర్ధం, వాయు తీర్థం, సంగమ తీర్థాదులకు నెలవై ఉంది. కాళేశ్వర దేవాలయంలో దేశంలో మరె చ్చటనూ కానరాని విధంగా “ఒకే పానవట్టంపై శివుడు, యముడు” వెలసి ఉన్నారు. ఇక్కడ గోదావరి, ప్రాణహిత” నదులతో పాటుగా అంతర్వాహినిగా సరస్వతీ నది” ప్రవహించడం మూలాన “త్రివేణీ సంగమ తీరం”గా దక్షిణ కాశీగా ప్రసిద్ధి నొందుతున్నది. ఈ క్షేత్రంలో శుభానంద దేవి, శ్రీ సరస్వతి – శ్రీరామ, శ్రీ ఆదిముక్తీశ్వర, శ్రీసంఘమేశ్వర, దత్తాత్రేయ, ఆంజనేయ, సూర్య దేవాలయాలు ఉన్నాయి. ప్రధానాలయంలో ఒకే పానవట్టం పైన కాళేశ్వర, ముక్తీశ్వరులు వెలసి ఉండగా, ముక్తీశ్వరునికి రెండు నాసికా రంధ్రాలున్నాయి. ఈ రంధ్రాలలో ఎంత నీరు పోసినా, పైకి రాదు త్రివేణీ సంగమంలో అట్టి నీరు కలుస్తుందని చారిత్రక ఆధారాలు స్పష్టపరుస్తున్నాయి. కాళేశ్వరుని ముందు పూజించి, తర్వాత ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గప్రాప్తి తప్పక కలగగలదని భక్తుల విశ్వాసం. కాళేశ్వర ప్రధానాలయానికి పశ్చిమ దిశన యమగుండం మీద సుమారు ఒక కిలోమీటరు దూరాన ఆది ముక్తీశ్వరాలయం ఉంది. దానికి చుట్టూరా ప్రకృతి సిద్ధంగా విభూతిరాళ్ళు లభించడం విశేషం. కాళేశ్వర తీర్ధ, క్షేత్రం శిల్ప కళా నిలయం. బయట పడిన అనేక శిల్పాలు గత వైభవ చిహ్నాలుగా నిలిచాయి. పురావస్తు శాఖ తవ్వకాలలో బౌద్ధ విహారాల పునాదులు, గోడలు, మహా స్థూపాలు, కంచు సంబంధిత బుద్ధ భగవానుని విగ్రహాలు లభించాయి. ఆలయ ప్రవేశ ప్రదేశంలో ఉన్న యమకోణం నుండి బయటకు వెళితే యమదోషం పోగలదని భక్తుల నమ్మకం. ఇక్కడ హిందూ ముస్లింలు సోదర భావంతో సహజీవనం చేసినట్లు కాకతీయుల శిలా ఫలకాలు తెలుపు తున్నాయి. కలియుగ ప్రారంభం నుండీ ప్రసిద్ధ శైవ క్షేత్రమని కాళేశ్వర ఖండంలో పేర్కొబడింది. క్రీ.శ.1140లో చాళక్య జగదేక మల్లుని అధికార సుస్థిర ప్రయత్నంలో మంథెనను ఏలుతున్న గుండరాజును ఓడించి, కాకతీయ రెండవ ప్రోలరాజు ఈ ప్రాంతాన్ని తన రాజ్యంలో అంతర్భాగంగా చేసుకున్నాడు. అంతకు ముందు ఈ ప్రాంతం వేములవాడ చాళుక్య రాజుల పాలనలో ఉండినట్లు చెన్నూరు శాసనం ద్వారా తెలుస్తున్నది. తర్వాత కాలాన పశ్చిమ చాళుక్యుల రాజ్యంలో మంత్రపురి (మంథని) ప్రాంతాధిపతుల పాలన కింద ఉండేదని, కాకతీయుల పాలనలో చేరిన అనంతరం, కాకతి రుద్రదేవుడు, తన మంత్రియైన ఎల్లంకి గంగాధరుని పాలకునిగా నియమించినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. గంగాధరుడు కాళేశ్వరంలో శివాలయమును నిర్మించినట్లు క్రీ.శ.1171 నాటి నగునూరు శాసనంలో పేర్కొన బడింది. ఫిబ్రవరి 25 నుండి 27 వరకు మహా శివరాత్రి ఉత్సవాలకు ఈఓ ఎస్. మహేశ్, ఆధ్వర్యంలో అర్చకులు, సిబ్బంది నిర్వహించిన సమన్వయ సమావేశ నిర్ణయాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు గావిస్తున్నారు.
25న ఉదయం దీపారాధన, గణపతి పూజ, స్వస్తి పున్యాహవాచనం, రక్షా బంధనం, దీక్షా వస్త్ర ధారణ, రుత్విగ్వరణ, మృత్సంగ్రహణం, దేవత ఆహ్వానం, నవకలశా రాధన, నవగ్రహాల ఆరాధన, అగ్ని ప్రతిష్ఠ, ఊరేగింపు, ఎదురుకోలు; 26న సాయంత్రం శ్రవణా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న మందు శ్రీ ముక్తేశ్వర శుభానందల కళ్యాణం, అక్షతా రోహణం, రాత్రి 12కు మహాభి షేకం, లింగోద్భవ పూజ, కాళరాత్రి చండీ హవనం, 27న ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పూర్ణాహుతి, సదస్యం, మహదా శీర్వచనం, పండిత సన్మానం, సాయంత్రం 4కు శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి కళ్యాణం, నాకబలి, పవళింపు సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించ నున్నారు.

  • రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494
Latest News

హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే సహించేది లేదు‌‌

దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS