ఎన్‌టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్ సమాయానికి అందుతోందా?, ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో 2,28,388 పెన్షన్లకు రూ. 98.14 కోట్లు మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా సమాజం నుంచి పేదరికాన్ని దూరం చేయడం, నూరు శాతం అక్షరాస్యత, తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా ప్రోత్సహించడం.. ఇలా పూర్తిస్థాయిలో పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, యూసీడీ పీవో పి.వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.