Sunday, July 20, 2025
spot_img

దందాల‌కు కేరాఫ్ చందానగర్

Must Read

స్పీకింగ్ ఆర్డర్లు జారీ చెయ్? పైసలు వసూల్ చెయ్?

  • హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన సర్కిల్-21 డిప్యూటీ కమిషనర్..
  • వేల కోట్ల రూపాయల విలువ చేసే అసైన్డ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు..
  • ఖానామెట్‌లో కానరాని ప్రభుత్వ నిబంధనలు..
  • చందానగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ యాక్ట్-1955, టి.ఎస్. బీ పాస్‌లు వర్తించవు..
  • శేర్‌లింగంప‌ల్లి జోన్ పరిధిలో బోగస్ జీహెచ్ఎంసీ మార్టిగేజ్‌లతో అనుమతుల జారీ..
  • చందానగర్ సర్కిల్, కమిషనర్ పరిధిలో స్పీకింగ్ ఆర్డర్ల జారీ..
  • కానీ.. చర్యలు చేపట్టకపోవడానికి కారణాలేంటి?
  • అయోమయానికి గురిచేస్తున్న చందానగర్ డిప్యూటీ కమిషనర్ వ్యవహార శైలి..
  • తలపట్టుకుంటున్న కింద స్థాయి ఉద్యోగులు..

ఆయన పేరు మోహన్ రెడ్డి.. చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వసూళ్ల‌పర్వానికి తెరలేపారు. అక్రమ నిర్మాణాలు ఆయ‌న‌ దృష్టికి వస్తే స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేయడం.. లక్షల్లో వసూలు చేయడం.. ఇదే తంతు. అసలు మోహన్ రెడ్డి సర్కిల్లో జారీచేసిన స్పీకింగ్ ఆర్డర్లు ఎన్ని? వాటిలో ఎన్ని అక్రమ నిర్మాణాలను కట్టడి చేయగలిగారు? అనేది అంతుబట్టని విషయంగా మారింది. ఈ అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపితే డిప్యూటీ కమిషనర్ అవినీతి ఎంత మేరకు వ్యాపించిందో తెలుస్తుందని స్థానికులు అంటున్నారు. నిజానికి చందానగర్ సర్కిల్ పరిధిలో ఇలాంటి డిప్యూటీ కమిషనర్‌ను గతంలో ఎప్పుడూ చూడలేదని, ఈయన వ్యవహార శైలితో అనేక విషయాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నామని కింది స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు.

హైదరాబాద్, 25 మే (ఆదాబ్ హైదరాబాద్ ): జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్-21లో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, హైడ్రా, శేరిలింగంపల్లి తహశీల్దార్, జీహెచ్ఎంసీ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, స్థానిక రాజకీయ నాయకులకు, చందానగర్ డిప్యూటీ కమిషనర్‌కు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో జరుగుతున్న అక్రమాలు, ఆక్రమణలు కనిపించడం లేదా? స్థానికులు ఈ వాస్తవాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారెవరూ కాపాడలేకపోతున్నారు.

YouTube player

శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామ పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కొద్దిరోజులుగా ఊపందుకున్నాయి. సర్వే నంబర్ అసైన్డ్-41 బై నంబర్‌లో, 41/12, 41/13ల‌లో నిర్మించిన ప్రహరీ బ్లూ షీట్లను కొన్ని రోజుల క్రితం కూల్చివేసిన అధికారులు.. పిచ్చుక మీద‌ బ్రహ్మాస్త్రం వేసినట్లు హడావిడి చేశార‌ని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు జరుగుతున్నా.. అనేక అక్రమ నిర్మాణాలకు సైతం జీహెచ్ఎంసీ అధికారులు కేవలం షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేసి.. ఇక తమకేమీ సంబంధంలేనట్లు చందానగర్ డిప్యూటీ కమిషనర్ చేతులు ముడుచుకొని కూర్చోవడం ఏంట‌ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

షేక్‌పేట్ జోన్‌లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులపై జె.రమేష్ అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేయగా గౌరవ న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి ఇటీవల ఆయా అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా అధికారుల తీరు మారలేదు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనధికారిక నిర్మాణాలను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వాటిని వెంటనే సీజ్ చేయాలని ఆదేశించినా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడం దురదృష్టకరం..

ఖానామెట్ గ్రామ అసైన్డ్ సర్వే నంబ‌ర్‌ 41/12, 41/13, ప్లాట్ నంబర్లు 64, 65, 66, 67తోపాటు చుట్టుపక్కల కొనసాగుతున్న అనేక అక్రమ నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. దీంతో.. ప్లాట్ నంబర్ 64, 65, 66, 67ల్లో అసైన్డ్ చట్టాలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీ నుంచి జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణానికి అనుమతి పొందుతున్నారు. జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం జీ ప్లస్ 3 అంతస్తుల అనుమతి పొందే సమయంలో జీహెచ్ఎంసీకి మార్టిగేజ్ చేయాల్సి ఉండ‌గా అలా చేయకుండా బోగస్ మార్టిగేజ్ డ్యాక్యుమెంట్స్ స‌మ‌ర్పించారు. స‌ర్వే నంబర్లు 1526/2024 రంగారెడ్డి, 1278/2024 ఎస్.ఆర్.ఓ. శేరిలింగంపల్లిలో మార్టిగేజ్‌ చేసినట్లు సమర్పించి ఖానామెట్ ప్లాట్ నంబర్ 64, 65, 66, 67ల్లో నిర్మాణ అనుమతిని చందానగర్ సర్కిల్ అధికారులు మంజూరు చేశారు. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ అనుమతులు తీసుకొని జీ ప్లస్ 6 అంతస్తులకు అక్రమంగా నిర్మాణాన్ని ఎలాంటి సెట్ బ్యాక్‌లు లేకుండా చేపట్టడంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో చందానగర్ డిప్యూటీ కమిషనర్ షోకాస్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లు అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారు. ప్లాట్ నంబర్ 64, 65కి గాను లే.ఆర్. నంబర్: యూసీ/91/సి-21/టి.పీ.ఎస్/జీ.హెచ్.ఎం.సి/2025 .. తేది:17/01/2025, ప్లాట్ నంబర్ 66, 67లకు గాను లె.ఆర్. నంబర్ యూసీ/90/సి-21 టి.పీ.ఎస్/జీ.హెచ్.ఎం.సి. 2025, తేదీ: 17/01/2025లను జారీ చేసి చర్యలు తీసుకున్నామంటూ అక్రమ నిర్మాణదారులకు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పరోక్షంగా సహకరించాడు. దీంతో ఫిర్యాదుదారుడు హైకోర్టులో 4990/2025 కేసు వేశారు.

హైకోర్టు ఆదేశాలను సైతం డోంట్ కేర్ అంటున్న కమిషనర్, డిప్యూటీ కమిషనర్:

హైకోర్టు ధర్మాసనం కేసు నంబర్: 4990/2025లో జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, చందానగర్ డిప్యూటీ కమిషనర్‌కు తేదీ: 17/01/2025న స్పీకింగ్ ఆర్డర్‌ల‌ ప్రకారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది జ‌రిగి ఇప్పటికి నెలలు గడుస్తున్నా చందానగర్ డిప్యూటీ కమిషనర్, సర్కిల్ అధికారులు అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణం పూర్తికావడానికి సహకరించడం చూస్తుంటే ఈ సర్కిల్‌లో అవినీతి ఏవిధంగా తాండవిస్తోందో అర్థ‌మ‌వుతోంది. ప్రస్తుతం ఈ అక్రమ నిర్మాణం జీ ప్లస్ 6 అంతస్తుల పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం తమ కళాశాల నెలకొల్పబోతున్నట్లు తెలుస్తోంది.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన, కోర్టు వివాదంలో ఉన్న భ‌వ‌నంలో ఎలాంటి అనుమతులు పొందకుండా అకాడమీ పేరుతో విద్యా సంస్థను నెలకొల్పడం ఎంత వరకు సమంజసం? చట్టాలను చుట్ట చుట్టి అక్రమార్కులకు చుట్టాలుగా మారుస్తున్నారు చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గారి లీలలు అనేకం.

ఇప్పటికైనా జీహెచ్ఎంసీ కమిషనర్ విచారణ జరిపి ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారా? లేక, హైకోర్టు ఆదేశాలను ఆయన కూడా బేఖాతర్ చేసి చట్టాలకు సవాల్ విసురుతారా? అనేది వేచి చూడాలి. చందానగర్‌లో గందరగోళం సృష్టిస్తున్న స్పీకింగ్ ఆర్డర్ల బాగోతంపై, డిప్యూటీ కమిషనర్ వ్యవహార శైలిపై, సర్కిల్ పరిధిలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల మనోవేదనపై, అలాగే అక్రమంగా అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తున్న నారాయణ కళాశాలపై వరుస కథనాలను మీముందుకు తీసుకురానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS