Sunday, July 20, 2025
spot_img

ప్రభుత్వ భూమికి పంగ‌నామాలు

Must Read

˜ ఆ భూమి విలువ‌ 400 కోట్ల రూపాయ‌లు
˜ ప్రొహిబిటెడ్‌ కోర్టు కేసులో ఉన్న భూములకు డీటీసీపీ అనుమతులు
˜ సాల్వో ఎక్స్‌ప్లోసివ్స్‌, శ్రీ కన్‌స్ట్రక్షన్స్‌ డెవలపర్స్‌కు అనుమతి ఎలా ఇచ్చారు? ˜అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డగా మారిన యాదగిరిగుట్ట ఎస్‌ఆర్వో..
˜ ఇప్పటికే ఓ ఎస్‌ఆర్వో సస్పెండ్‌, ఒక‌రు ఏసీబీ ట్రాప్‌లో.. ˜ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో ఎస్‌ఆర్వో మరణం?
˜ అక్రమ లేఅవుట్ల వల్ల వెయ్యి మంది వరకు బాధితులు.. ప్రొహిబిటెడ్‌ను ఎత్తివేయించేందుకు విశ్వ ప్రయత్నాలు
˜ సహకరిస్తున్న రాజకీయ నాయకులు, అధికారులు ఎవ‌రు? ˜ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోవడంలో వెనకంజ ఎందుకు?
˜ అడ్డగోలుగా బ్లాస్టింగ్‌లు.. స్పందించని మైనింగ్‌ అధికారులు.. ˜హరించుకుపోతున్న పర్యావరణం, భయాందోళనలో గ్రామస్థులు..
˜ `సౌభాగ్య మార్కెటింగ్‌ పేరుతో అక్రమ లేఅవుట్ల‌లో ప్లాట్ల విక్రయాలు..

ప్రభుత్వ భూమి.. అందులోనూ ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉంది. దీనికి తోడు కోర్టు వివాదం. ఎవ‌రు ఎంత పుచ్చుకునారో తెలియదు. ఎవ‌రికి ఎంత ముట్టిందో గానీ రూ.400 కోట్ల విలువైన‌ ప్రభుత్వ భూమికి పంగనామాలు పెట్టారు. వివాదాస్పద భూములని కూడా చూడకుండా డీటీసీపీ అధికారులు అనుమతులిచ్చారు. అనుమతి పొందిన కంపెనీలు ప్లాటింగ్‌ చేశాయి. వెయ్యి మంది వరకు బాధితులు. మరి ఎస్‌ఆర్వో అధికారులైనా రిజిస్ట్రేషన్లను ఆపారా అంటే అదీ లేదు. వాళ్లు కూడా తమకు కావాల్సినంత పిండుకున్నారు. రిజిష్ట్రేషన్లు చేస్తూ పోతున్నారు. చివరకు ఈ సర్వే నంబర్‌ పూణ్యమా అని ఎస్‌ఆర్వో కార్యాలయంలోని ఒక‌ ఎస్‌ఆర్వో హర్ట్‌స్ట్రోక్‌తో మరణిస్తే మరొక‌రు ఏసీబీకి చిక్కారు. ఇంకొక‌రు సస్పెండై ఇంట్లో కూర్చున్నారు. మొత్తానికి యాదగిరిగుట్ట ఎస్‌ఆర్వోలో అసలు ఏం జరుగుతుందనే విషయం అంతుపట్టకుండా పోతోంది. ఈ మొత్తం వ్యవహారం వెనక ఎవ‌రి హస్తం ఉంది?. ఎవ‌రి ప్రమేయంతో ఈ అక్రమ రిజిష్ట్రేషన్లు జరుగుతున్నాయి? వేలాది మంది బాధితుల కన్నీటిని తుడిచేదెవ‌రు? అనే అంశాల‌పై ఆదాబ్‌ ప్రత్యేక కథనం…

హైదరాబాద్‌ 25, మే (ఆదాబ్‌ హైదరాబాద్‌): యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్‌ మండలం చల్లూరు గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్‌ 322/4లో జరుగుతున్న అక్రమ లేఅవుట్‌ వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఈ లేఅవుట్‌ చేస్తున్న భూమి మొత్తం కూడా ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉంది. అదే విధంగా ఈ భూమిపై ఇప్పటికే కోర్టులో వివాదం కూడా నడుస్తోంది. ఇన్ని లిటిగేషన్లు ఉన్నా కూడా సదరు భూమిని లేఅవుట్‌గా మార్చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ పోతుండ‌టం అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం కాసులకు కక్కుర్తి పడుతున్న కారణంగా రేపు సదరు లేఅవుట్‌లలో ప్లాట్లు కొనే వారి కళ్లల్లో కన్నీరు కారుతుందనే ఇంగితం కూడా మర్చిపోయి అధికారులు వ్యవహరిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చల్లూరు గ్రామ శివారు స‌ర్వే నంబ‌ర్‌ 322/4లోని ప్రభుత్వ భూమిని 2021లో అప్పటి కలెక్టర్ ప్రొహిబిటెడ్‌ జాబితాలో పెట్టారు. ఈ భూమిపై వివాదం ఉందని 1954-1955 ఖాస్రా పట్టాదారైన శంకరప్ప, లింగప్ప వారసుడు నందకిశోర్‌ జిల్లా అద‌నపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ సర్వే నంబర్‌లోని 322/4 భూములను నిషేధిత జాబితాలో పొందుపరిచారు. కానీ.. అడ్డదారిలో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్చిన సాల్వో ఎక్స్‌ప్లోసివ్స్‌ అండ్‌ కెమికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ 2022లో ఈ భూమికి డీటీసీపీ అనుమతి పొందడం గమనార్హం. నిషేధిత భూమిలో ఉన్న 322/4 జాబితాలోని సుమారు 40 ఎకరాల భూమికి 2022లో డీటీసీపీ అధికారులు అనుమతిస్తే తిరిగి 2023లో అదే సర్వే నంబర్‌లోని మరో 70 ఎకరాలకు సదరు కంపెనీ అనుమతి పొందింది. సందెట్లో సడేమియా అంటూ సాల్వో కంపెనీ చూపిన అడ్డదారిలోనే మరో రియల్ ఎస్టేట్‌ కంపెనీ సిరి కన్స్‌స్ట్రక్షన్స్‌, డెవలపర్స్ కూడా మరో 70 ఎకరాల 24 గుంటల భూమికి డీటీసీపీ అనుమతి పొందింది. మొత్త‌మ్మీద ఈ రెండు కంపెనీలు అక్రమ మార్గంలో డీటీసీపీ అధికారుల నుంచి సదరు లేఅవుట్‌లు చేసేందుకు అడ్డదారిలో అనుమతులు పొందారు.

ఇలా అడ్డదారిలో అనుమతులు పొందిన కంపెనీల‌ యాజమాన్యాలు ఈ భూములను వెంచర్లుగా మార్చడంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందినవారికి విక్రయించారు. ఈ భూమి వెనక ఉన్న కథలు తెలియక కేవలం డీటీసీపీ లేఅవుట్‌ అనుమతులు ఉన్నాయనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటి వరకు సుమారు వెయ్యి మంది వరకు ఈ ప్లాట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా ఈ వెంచర్‌ చేస్తున్న కంపెనీలు సౌభాగ్య మార్కెటింగ్‌ వారి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మార్కెటింగ్‌ కంపెనీ కస్టమర్లను తమ మాయమాటలతో బొల్తా కొటిస్తూ ప్లాట్లను అంటగడుతున్నారు. తీగలాగితే డొంక కదలినట్లు ప్రస్తుతం అసలు విషయం బ‌యటకు వస్తుండడంతో బాధితులు రోడ్డున పడినట్లు తెలుస్తోంది. ఇంత కాలం తమవి అనుకున్న ప్లాట్లు తమకు కాకుండా పోతాయనే భయం వారిలో మొదలైంది. ఈ విషయంలో త‌మ‌కు న్యాయం చేసేదెవ‌రా అని ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల ప్రభుత్వ భూమిని అక్ర‌మార్కులు ఇలా కబ్జా చేస్తుంటే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్న అధికారులు వారికి వంత పాడటం శోచనీయం. ఇంత పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతుంటే కనీసం ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు సదరు రియల్ ఎస్టేట్‌ వ్యాపారులపై చర్యలు తీసుకోవడం లేదు?. వారి వెనక ఉన్నదెవ‌రు?. వారిని కాపాడుతున్నదెవ‌రు? రాజకీయవేత్తలా లేక‌ అధికారులా అనే అనుమానాలు కలగకమానడం లేదు. సుమారు వెయ్యి మంది బాధితులను రోడ్డున పడేసిన కంపెనీపై ప్రభుత్వ పెద్దలు కూడా కనీసం చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందిస్తే ప్రభుత్వానికి రూ.400 కోట్ల ఆదాయం వస్తుంది.

కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఇంత వ్యవహారం జరుగుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఎమ్మెల్యేలకు తెలియకుండా ఉంటుందనుకోవడం పొరపాటే అవుతుంది. మరి ఇందులో అప్పటి ఎమ్మెల్యేతోపాటు ప్రస్తుత ఎమ్మెల్యేకు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు ముట్టిందెంత? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. అందరి ప్రమేయంతోనే ఈ వ్యవహారం నడిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇందులో ఎవ‌రి వాటా ఎంతనే విషయం ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సిన అవసరం ఉంది.

పర్యావరణానికి పెను ముప్పు…

ఇక్కడ వెంచర్లు చేస్తున్న కంపెనీలు పర్యావరణ నిబంధనలను కూడా పాటించడం లేదు. ముఖ్యంగా గుట్టలను ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేస్తుండ‌టంతో సమీపంలోని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగ్‌ల వల్ల తమ ఇళ్లకు ప‌గుళ్లు వస్తున్నాయని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూమిలో ఇంత బాహాటంగా బ్లాస్టింగ్‌లు చేస్తూ అక్రమంగా లేఅవుట్లు చేస్తున్నా అడ్డుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు కనీసం అటు వైపు కన్నెతి కూడా చూడటం లేదు. ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పేరు వింటేనే సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులు జంకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్‌ లేదా ఉన్నతాధికారుల విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడటంతోపాటు ప్రభుత్వ ఆదాయ వనరులను కాపాడుకుంటే మంచిది. దీనిపై మరింత సమగ్ర సమచారంతో మరో వార్తతో మీముందకు రానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS