- వైద్యంలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి
- జిల్లా మంత్రి ఉత్తమ్ దృష్టి సారించాలి
- సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్
సూర్యాపేట, మే 25(ఆదాబ్ హైదారాబాద్): కొంతకాలంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న వరుస మరణాలు, అక్రమాలు, అనుమతులపై సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని అనేక ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్‌లు ఎలాంటి అనుమతి లేకుండా ఏళ్ల కొద్దీ నడుస్తున్నా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేద ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నకిలీ వైద్యులు ఆపరేషన్లు చేయడం వల్ల అనేక మంది ప్రజలు మృత్యువాతపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. అర్హత లేని రేడియాలజిస్టులతో స్కానింగ్ సెంటర్లు నిర్వహించడం, నకిలీ డాక్టర్లతో ఆపరేషన్లు చేయడం గత కొన్నేళ్లుగా జరుగుతున్నా అధికారులు కాసులకు ఆశపడి పట్టించుకోలేదని నాగార్జున రెడ్డి ఆరోపించారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్‌లు, మెడికల్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని అన్నారు. రష్యా, చైనా దేశాల్లో వైద్య విద్యను అభ్యసించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అర్హత, రిజిస్ట్రేషన్ లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులను ఎలా ఏర్పాటుచేసి నిర్వహిస్తారని ప్రశ్నించారు. అన్ క్వాలిఫైడ్ డాక్టర్ల విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేటికీ స్పందించలేదని నాగార్జున రెడ్డి విమర్శించారు. తక్షణమే జిల్లా మంత్రి జోక్యం చేసుకొని జిల్లా వైద్య రంగంలో జరుగుతున్న ప్రజల మరణాలు, ఆస్పత్రుల అక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి పాల్గొన్నారు.