స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులకు, ఆనాటి నాయకత్వానికి వినమ్ర నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేశారు.
14 రాష్ట్రాలతో ప్రారంభమైన స్వతంత్ర భారతదేశం, ఈ రోజు 28 రాష్ట్రాల వైవిధ్యభరిత భారతంగా ఎదిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ అనే అతి పిన్న రాష్ట్రం, బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం విజయవంతమై రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, తలసరి ఆదాయం, వ్యవసాయ విస్తరణలో అద్భుత విజయాలు సాధించామన్నారు. “జై జవాన్, జై కిసాన్” అనే నినాదాన్ని కేసీఆర్ నాయకత్వం సాకారం చేశారని చెప్పారు. 14వ స్థానంలో ఉన్న తెలంగాణ, పంజాబ్, హర్యానాలను వెనక్కి నెట్టి ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానానికి చేరుకోవడం వెనుక రైతును రాజుని చేయాలన్న కేసీఆర్ సంకల్పమే ప్రధాన కారణమని వివరించారు.
ఐటీ రంగం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పల్లె ప్రగతి, పేదల సంక్షేమం వంటి అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
20 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. యూరియా కోసం రైతులు లైన్లు వేస్తున్నారని, పాత కాంగ్రెస్ రోజులను సీఎం రేవంత్ రెడ్డి తిరిగి తీసుకొచ్చారని ఆరోపించారు. స్వాతంత్ర్యం అంటే కేవలం పరిపాలన మాత్రమే కాకుండా ఆత్మగౌరవంతో బతకడమని, కేసీఆర్ పాలనలో అది సాధ్యమైందని, ఇప్పుడు ఢిల్లీ పాలన తెలంగాణ ప్రజల నెత్తిపై రుద్దబడుతోందని ధ్వజమెత్తారు.
‘ఢిల్లీ కిరాయి పాలన’ వ్యాఖ్యలు
51 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి, ప్రతి చిన్న పని కోసం ఢిల్లీ వైపు చూడాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొన్నదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి ఢిల్లీ పార్టీల కారణంగా సంక్షేమం, వ్యవసాయం వెనుకబడ్డాయని, ఐటీ, పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని ఆరోపించారు.
ఆత్మగౌరవ పిలుపు
“స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష” అని జయశంకర్ ప్రొఫెసర్ అనేకసార్లు చెప్పారని, సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ నాయకత్వమే భరోసా అని కేటీఆర్ పిలుపునిచ్చారు. కులం, మతం మనల్ని విభజించవచ్చునేమో కానీ మనందరినీ ఏకం చేసే శక్తి భారతీయత మాత్రమే అని అన్నారు.