కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో వెల్లడి : కేటీఆర్
తెలంగాణలో అప్పుల అంశంపై నెలలుగా కొనసాగుతున్న రాజకీయ వాదోపవాదాలకు తాజాగా పార్లమెంట్ సాక్షిగా స్పష్టత లభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం భరించిన అప్పులు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నట్లుగా విపరీతంగా లేవని, కేంద్ర ప్రభుత్వం అధికారిక గణాంకాలతో వెల్లడించింది. పార్లమెంట్‌లో సమర్పించిన నివేదిక ప్రకారం, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణకు వారసత్వంగా వచ్చిన అప్పు రూ.70 వేల కోట్లు. కేసీఆర్ పాలనలో (2014–2023) రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త అప్పు సుమారు రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే. రెండింటిని కలిపితే మొత్తం అప్పు రూ.3.50 లక్షల కోట్లు అవుతుంది. ఇది కాంగ్రెస్ నేతలు చేస్తున్న రూ.5–6 లక్షల కోట్ల అప్పు ఆరోపణలతో పోలిస్తే చాలా తక్కువ. ఈ వివరాలను ఆధారంగా చేసుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కఠినంగా స్పందించారు.
కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ రికార్డులే వారికి చెంపదెబ్బ కొట్టాయి. కేసీఆర్ పాలనలో అప్పులు నియంత్రణలోనే ఉన్నాయి. కేంద్ర గణాంకాలు దీనికి సాక్ష్యం అని ఆయన అన్నారు. ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం కాంగ్రెస్‌కు చేతకాక, అభాండాలు వేయడం మాత్రం చేస్తోంది. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ పై ఈ తప్పుడు ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు.