Thursday, October 23, 2025
spot_img

భారత జాతీయోద్యమ పిత బాల గంగాధర తిలక్

Must Read
  • బాల గంగాధర్ తిలక్ పుట్టిన రోజు జూలై 23 సందర్భంగా

దేశభక్తిని ప్రజల్లో రగిల్చి, బ్రిటిష్ వారిని భయబ్రాంతుల్ని చేసిన లోకమాన్య “బాల గంగాధర తిలక్ ” జయంతి జూలై 23.బాలగంగాధర తిలక్ ని “భారత జాతీయోద్యమ పిత”గా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడుగా భావిస్తారు. ఈయనకు”లోకమాన్య” అనే బిరుదు కూడా ఉంది.

బాల్యం:

బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు.ఆయనతండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, మంచి ఉపాధ్యాయుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణిత శాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచే వాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటి తనం ఆయనకు సహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు. తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరినుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఆయన అక్కడ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు.1877లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు.ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి లా పట్టా కూడా పొందాడు.

భారత జాతీయ కాంగ్రెస్ తో సంబంధాలు

తిలక్ 1890లో కాంగ్రెస్ లో సభ్యుడుగా చేరాడు. కానీ త్వరలోనే ఆయనకు కాంగ్రెస్ మితవాద రాజకీయాలపై నమ్మకం పోయింది. స్వరాజ్యం కోసం పోరాటమే సరైన మార్గమని ఆయన నమ్మాడు. అప్పటివరకు కాంగ్రెస్ ప్రతి సంవత్సరం డిసెంబరు చివరివారంలో మూడు రోజులపాటుసమావేశమై బ్రిటిష్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను మితవాద ధోరణి చెయ్యడానికే పరిమితమైంది.తిలక్ దాని గురించి చాలా ఘాటైన విమర్శలు చేశాడు.”మీరు సంవత్సరాని కొక సారి మూడు రోజులపాటు సమావేశమై కప్పల మాదిరి బెకబెకలాడడం వల్ల ప్రయోజనం లేదు.” అని, “అసలు కాంగ్రెస్ సంస్థ అడుక్కునేవాళ్ళ సంఘం (బెగ్గర్స్ ఇన్స్టిట్యూషన్)” అన్నాడు. కాంగ్రెస్ సమావేశాలను 3-డే తమాషాగా అభివర్ణించాడు. “స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను.” అని గర్జించాడు.1907లో మహారాష్ట్రలోని సూరత్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది.మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయారు.అదే సమావేశంలో కాంగ్రెస్ కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.

విద్యావిధానం:

ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు .అది భారతీయసాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చే విధంగా ఉందని, ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి “దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ”ని స్థాపించాడు.

పాత్రికేయవృత్తిలో,ఆ తర్వాత తానునడిపిన పత్రికలు

మరాఠా(ఆంగ్ల పత్రిక)”, “కేసరి(మరాఠీ పత్రిక)” లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిర సించి వితంతు వివాహాలను స్వాగతించాడు.

ఇతర కార్యక్రమాలు…

జాతీయస్ఫూర్తిని రగల్చడానికి వీలున్న ఏ అవకాశాన్నీ ఆయన వదిలి పెట్టలేదు.మొట్టమొదటి సారిగా “శివాజీ ఉత్సవాల”ను,”గణపతి ఉత్సవాల”ను పెద్ద ఎత్తున నిర్వహిం చడం ద్వారా ప్రజలను సమీకరించడం,వారిని జాతీయోద్యమం వైపు నడిపించడం ఆయనే మొదలుపెట్టాడు. తన పత్రికల్లో ప్రజలను రెచ్చగొట్టే రాతలు రాసినందుకు 1897లో ఆయనకు ఒకటిన్నరేళ్ళు కారాగారశిక్ష పడింది. విడుదలయ్యాక ఆయన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాడు.1906లో దేశద్రోహం నేరం క్రింద ఆయనకు ఆరేళ్ళు ప్రవాసశిక్ష విధించారు. కారాగారంలో ఉన్నప్పుడే ఆయన “గీతారహస్యం” అనే పుస్తకం రాశాడు.ఆయన చరిత్రకారుడు కూడా.ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని ఆయన అభిప్రాయం.

హోంరూల్ లీగ్

1916 ఏప్రిల్ లో “హోంరూల్ లీగ్ ” నుస్థాపించి దానిలక్ష్యాలను వివరిస్తూ మధ్యభార తదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు.అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలు పెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది.ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులోఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది.అప్పుడే,అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు “బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని” బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు.బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో,అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు.కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది.

పిన్నింటి బాలాజీ రావు
హనుమకొండ
9866776286

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This