- బీసీ హక్కుల సాధనకు కృషి చేస్తున్న ఉద్యమ నేత
- 42% బీసీ రిజర్వేషన్ లక్ష్యంగా ఉద్యమం
- సామాజిక ఉద్యమ నాయకుడిగా గుర్తింపు
- చారిత్రక సిఫారసుల అమలుకి నూతన దిక్సూచి
- బీసీల సామాజిక న్యాయం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
ఒక వ్యక్తి జీవితమే ఉద్యమంగా మారినప్పుడు, ఆ జీవితం యావత్ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల గాఢమైన బాధ్యత.. ఈ మూడు మూలస్తంభాలపై తన జీవనయానాన్ని నిర్మించుకున్న నాయకుడే డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం వెనక్కి తగ్గని ధైర్యంతో నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తి.. బీసీల సామాజిక న్యాయం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన అరుదైన నాయకుల్లో కృష్ణమోహన్ రావు ఒకరు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం కొనసాగుతున్న పోరాటానికి తాజాగా చట్టసమ్మత రూపం ఏర్పడుతోంది. 42 శాతం రిజర్వేషన్ల ఉద్యమానికి మేధోపునాదిని వేస్తూ, చట్టబద్ధంగా దిశానిర్దేశం చేస్తూ సాగుతున్న డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు నాయకత్వం బీసీ రాజకీయ చరిత్రలో మరచిపోలేని మైలురాయిగా నిలుస్తోంది.
బీసీలకు సాంఘిక న్యాయం కేవలం నినాదాల్లో కాదు, చట్టబద్ధ మార్గాల్లో సాధ్యమవుతుందన్న డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు చేస్తున్న ఉద్యమం, రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ చర్చనీయాంశంగా మారింది. “సామాజిక న్యాయం నినాదాలతో కాదు, చట్టబద్ధ మార్గాలతోనే సాధ్యం” అనే ఆయన మాటలు, ఆయన్ను ఓ శాశ్వతమైన ప్రజాస్వామ్య పోరాటయోధుడిగా నిలబెడుతున్నాయి.
తన విద్యా కాలం నుంచే సామాజిక సమస్యల పట్ల అవగాహన పెంచుకున్న డా. వకుళాభరణం, విద్యను ఓ సాధనంగా మలిచారు. ఒక వైద్యుడిగా వ్యవహరించాల్సిన సమయంలో కూడా ఆయన ప్రజల మధ్యనే తిరుగుతూ బహుజన వర్గాల సమస్యలు పట్ల స్పందించారు. పదవుల కోసమే కాకుండా, ప్రజల హక్కుల సాధన కోసం నిబద్ధతగా పని చేయగల నాయకత్వాన్ని డా. వకుళాభరణం చూపిస్తున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం కంటే ముందు నుంచే ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. బీసీ వర్గాల విద్య, ఉపాధి, రాజకీయ సమావేశం వంటి అంశాలపై స్పష్టమైన దృక్పథంతో ఆయనే ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘటనలు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
డా. వకుళాభరణం విద్యావంతుడిగా, పరిపక్వ రాజనీతిజ్ఞుడిగా బీసీ ఉద్యమానికి దిశానిర్దేశకుడిగా మారారు. పాలకవర్గాల దృష్టిని బీసీ వర్గాల వైపు మళ్లించడంలో, వారి హక్కులకు బలమైన వేదికలను ఏర్పాటు చేయడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న 42% రిజర్వేషన్ సాధన ఉద్యమం ఆయనకు రాజకీయ నాయకుడిగా కాక, సామాజిక ఉద్యమకారుడిగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. బీసీల హక్కులను సమర్థంగా నిలబెట్టేందుకు ఆయన నడిపిస్తున్న ఉద్యమం, భవిష్యత్ తరాల కోసం మార్గదర్శకంగా నిలవనుంది.
లోతైన అధ్యయనం.. శాస్త్రీయ మార్గంలో ఉద్యమం
పోరాటం అగ్రహంతో కాదు – ఆధారాలతో సాగాలి అనే భావనతో, డా. వకుళాభరణం సుప్రీం కోర్టు మరియు వివిధ హైకోర్టుల కీలక తీర్పులను, మండల్ కమిషన్, అంబశంకర్ కమిషన్ వంటి చారిత్రక నివేదికలను లోతుగా విశ్లేషిస్తూ ఉద్యమానికి న్యాయపరమైన బలాన్నిస్తోన్నారు. అందులో ఇంద్రసాహ్నీ (1992), కృష్ణమూర్తి (2010), వికాస్ గావ్లీ (2021) వంటి తీర్పుల ప్రాసంగికతను ప్రస్తుత ఉద్యమంతో అనుసంధానిస్తూ, మార్గదర్శకంగా ఉపయోగిస్తున్నారు. అంతేగాక, పత్రికల్లో ప్రచురితమైన ఆయన వ్యాసాలు, ప్రసార మాధ్యమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలు ఈ ఉద్యమానికి మేధోబలంగా నిలుస్తున్నాయి.
చారిత్రక సిఫారసుల అమలుకి నూతన దిక్సూచి
తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలోనే, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వేను చేపట్టాలని డా. వకుళాభరణం సిఫారసు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన సూచనల ప్రకారమే ఈ సర్వేను 2024 చివరిలో ప్రారంభించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా బీసీలను కేంద్రంగా పెట్టిన శాస్త్రీయ కుల డేటా సేకరణగా గుర్తింపు పొందింది.
ఉద్యమానికి మార్గదర్శక పునాదులు
డా. వకుళాభరణం తరచుగా మండల్ కమిషన్, అంబశంకర్ కమిషన్, పి.ఎస్.కృష్ణన్ నివేదికలను ప్రస్తావిస్తూ, “ఇవి పాత కాగితాలు కావు.. ఇవే నేటి బీసీ ఉద్యమానికి జీవనశక్తి” అని స్పష్టం చేశారు. ఆయన శైలిలో ప్రజలకు ఈ చరిత్రను అర్థమయ్యేలా వివరిస్తూ, విద్యార్హతతో పాటు చైతన్యాన్ని కలిగిస్తున్నారు.
వాటా కోసం పోరాటం.. బీసీ ఉద్యమ టైమ్‌లైన్
2024 నవంబర్–డిసెంబర్: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక-ఆర్థిక-రాజకీయ కుల సర్వే.
2025 జనవరి: వర్కింగ్ గ్రూప్ నివేదికలపై అధ్యయనం.
2025 మార్చి 17: తెలంగాణ శాసనసభలో 42% రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం.
2025 జూన్: పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విడుదల.
2025 జూలై: న్యాయ నిపుణుల సలహాలతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలపై ప్రభుత్వం చర్చ.
డా. వకుళాభరణం మాటల్లో మార్గదర్శనం
“సామాజిక న్యాయం నినాదాలతో కాదు, చట్టబద్ధ మార్గాలతోనే సాధ్యం.”
“డేటా లేకుండా రిజర్వేషన్లు ఊహాగానాలే – శాస్త్రీయ సర్వేలు తప్పనిసరి.”
“మండల్ కమిషన్ చూపిన మార్గమే నేటి బీసీ ఉద్యమానికి దిక్సూచి.”
“ప్రభుత్వాలు తాత్కాలిక నిర్ణయాలు కాకుండా రాజ్యాంగబద్ధ చర్యలే తీసుకోవాలి.”
“42% రిజర్వేషన్ పోరాటం బీసీల ఆత్మగౌరవ యాత్ర.”