- పర్వేశ్ వర్మవైపూ బిజెపి నేతల మొగ్గు
- రేపటి ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు
ఈ నెల 20 ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం. సిఎం అభ్యర్థి ఎంపిక సోమవారమే జరగాల్సి ఉన్నా.. దానిని 19కి వాయిదా వేశారు. బుధవారం జరిగే భేటీలో సిఎం ఎంపిక జరగవచ్చు. 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇన్నేళ్ల తర్వాత అధికారంలోకి వస్తుండటంతో నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున సినీ తారలు, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20న గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి. ప్రఖ్యాత రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ వేడుకకు కమలదళం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రమాణస్వీకారానికి ముందు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇక, 50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్టాల్ర ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం. వీరితోపాటు దిల్లీకి చెందిన పలువురు రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్రశాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నట్లు భాజపా వర్గాలు పేర్కొన్నాయి.