- వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు ఖాయం
- ఎంపీ ఈటలరాజేందర్
అర్థంలేని హామీలతో సీఎంరేవంత్ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ అభ్యర్ది సరోత్తం రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పీఆర్సీ ఏమైంది.. డీఏలు ఏమయ్యాయని నిలదీశారు. సీపీఎస్ విధానంపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని అడిగారు. గతంలో యూటీఎఫ్ అభ్యర్థిని గెలిపిస్తే ఓరిగింది ఏమీ లేదని విమర్శించారు. బీజేపీ పాలనలో దేశం సుభిక్షమని.. అన్ని రంగాల్లో అభివృద్ధి పధంలో పరుగులు పెడుతోందన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయలకు అండగా ఉంటామని.. సమస్యల పరిష్కారానికి కొట్లాడతామని స్పష్టం చేశారు. కులాన్ని విస్మరించలేమని.. కుల గణన జరగాలన్నారు. కాంగ్రెస్‌కు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అధికారికంగా లెక్కలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయం బూమరాంగ్ అవుతోందన్నారు. 2011 జనాభా లెక్కలకు ఇప్పటి లెక్కలకు పొంతన లేకుండా చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని.. డ్రామా కంపెనీలా చేయవద్దని హితవుపలికారు.