- గురువారం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
- 27 ఏళ్ల తర్వాత రాజధానిలో బీజేపీ సర్కారు
- సీఎం రేసులో ముందున్న పర్వేశ్ సాహిబ్ వర్మ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి(DELHI CM) ఎవరనే సస్పెన్స్‌కు నేటితో తెరపడనుంది. సీఎం ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఉదయం సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం పేరు ఖరారు కానుంది. అనంతరం సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో కొత్త సీఎం పేరును ప్రకటిస్తారు. ఇక రేపు సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని సమచారం. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఉత్సవానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ మంతా ప్రమాణ స్వీకారం చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈ కార్యక్రమానికి బీజేపీ గెస్ట్ లిస్ట్‌లో గిగ్ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్, ఆటో రిక్షా డ్రైవర్లు, రైతులు, జుగ్గీస్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా సంక్షేమ పథకాల లబ్ధిదారును కూడా ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరితోపాటు 50 మందికిపైగా సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు, దౌత్యవేత్తలకు సైతం ఆహ్వానాలు పంపినట్లు పేర్కొన్నాయి. గత ముఖ్యమంత్రులు, ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, అతిషి, కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ చీఫ్ దేవేందర్ యాదవ్‌ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిసింది. రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.34 గంటల వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 12.05 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.